Pavan kalyan  :  జనసేన ఎమ్మెల్యేలు ఆన్ డ్యూటీ.. పవన్ ఆలోచనకు హ్యాట్సాఫ్

ప్రజా ప్రతినిధులు ప్రజల కోసం పనిచేయాలి. ప్రజలతో మమేకం కావాలి. వారి సమస్యలను తెలుసుకొనాలి. అప్పుడే వాటికి పరిష్కార మార్గం చూపగలరు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్.

Written By: Dharma, Updated On : August 1, 2024 9:55 am
Follow us on

Pavan kalyan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది జనసేన. పోటీ చేసిన 21 స్థానాల్లో గెలిచింది ఆ పార్టీ. దేశ రాజకీయాల్లోనే సంచలనం సృష్టించింది. పార్టీ ఆవిర్భవించి సుదీర్ఘకాలం అవుతున్నా సరైన విజయం దక్కలేదు. 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.దీంతో పరిస్థితి మరింత దిగజారింది. రాజకీయ ప్రత్యర్థుల హేళనకు,అవమానాలకు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా సరే గత ఐదేళ్లుగా పార్టీని నిర్మాణాత్మకంగా నడిపి అధికారంలోకి తీసుకు రాగలిగారు పవన్.అయితే ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని భావిస్తున్నారు.అందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ప్రకటించారు. ఇందుకు ప్రత్యేకమైన షెడ్యూల్ కూడా విడుదల చేశారు. నేటి నుంచి జనసేన ఎంపీలు, ఎమ్మెల్యేలు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి ప్రజల నుంచి అర్జీలు, పార్టీ శ్రేణుల నుంచి అభ్యర్థనలు స్వీకరించనున్నారు. నెలలో కనీసం రెండు రోజులపాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాల్సిందేనని పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆదేశాలు కూడా ఇచ్చారు. ప్రజల నుంచి వచ్చే వినతులకు పరిష్కార మార్గం చూపించాలని కూడా సూచించారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం తో పాటు ఆరు కీలక శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ప్రజా దర్బార్ కు ప్రాధాన్యమిచ్చారు. పార్టీ క్యాంపు కార్యాలయం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. వాటికి పరిష్కార మార్గం చూపించారు. ప్రజల నుంచి సంతృప్తి రావడంతో ప్రజా దర్బార్ ను కొనసాగించాలని నిర్ణయించారు. అయితే తాను ఒక్కడినే చేస్తే సరిపోదని..పార్టీ ఎమ్మెల్యేలకు,ఎంపీలకు భాగస్వామ్యం కల్పిస్తే కార్యక్రమం విజయవంతం అవుతుందని పవన్ భావిస్తున్నారు. అందుకే కీలక ఆదేశాలు ఇచ్చారు.

* షెడ్యూల్ విడుదల
ఈ వినతుల స్వీకరణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేశారు పవన్. ఆగస్టు 1,2 తేదీల్లో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారు. 3,4 తేదీల్లో నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి ప్రజా సమస్యలు వింటారు. ఇలా సెప్టెంబర్ 10, 11 తేదీల వరకు ప్రజాప్రతినిధుల షెడ్యూల్ను విడుదల చేశారు పవన్.ఎట్టి పరిస్థితుల్లో తమకు కేటాయించిన షెడ్యూల్ లో ప్రజల నుంచి వినతులు స్వీకరించాలని స్పష్టం చేశారు. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు.

* వినూత్న నిర్ణయాలు
పవన్ కళ్యాణ్ వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను అమలు చేసి చూపిస్తున్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు అనుసరించాలని సూచిస్తున్నారు. ఎన్నికలకు ముందు నాటి నుంచే పవన్ సినిమాలకు దూరమయ్యారు. ఎన్నికల్లో గెలిచి కీలక మంత్రిత్వ శాఖలను దక్కించుకున్నారు. అయితే చాలా హుందాగా నడుచుకుంటున్నారు. పవన్ తీసుకున్న నిర్ణయాలపై ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పలువురు అభినందిస్తున్నారు. ఏపీలో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఎమ్మెల్యేలు, ఎంపీలకు షెడ్యూల్ వేసిన ఏ పార్టీని ఇంతవరకు చూడలేదని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు.

* సభ్యత్వ నమోదుకు విశేష స్పందన
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన సభ్యత్వ నమోదు ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. పది లక్షల సభ్యత్వ నమోదు క్రాస్ చేసి జనసేన రికార్డును సొంతం చేసుకుంది. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు పవన్. ఒకవైపు పాలనలో వినూత్న మార్పులు చేసి చూపిస్తున్నారు. అదే సమయంలో పార్టీని బలోపేతం చేయాలని చూస్తున్నారు. 500 రూపాయలు ఇచ్చి స్వచ్ఛందంగా జనసేనలో చేరేందుకు చాలామంది ముందుకు వస్తున్నారు. అందుకే జనసేన నాయకత్వం సభ్యత్వ నమోదు గడువును పెంచింది.