IAS Krishna Teja: పవన్ ప్రత్యేకం.. ఓఎస్డిగా నేషనల్ అవార్డ్ పొందిన యువ ఐఏఎస్

పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణ తేజ 2017 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనకు ప్రత్యేక పురస్కారానికి ఎంపిక చేసింది.

Written By: Dharma, Updated On : June 21, 2024 10:42 am

IAS Krishna Teja

Follow us on

IAS Krishna Teja: పాలనలో తన మార్కు చూపించాలని పవన్ కళ్యాణ్ పరితపిస్తున్నారు. తనకు ఇష్టమైన పల్లెపాలనను తన చేతిలోకి తీసుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ శాఖలను సొంతం చేసుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాను సైతం దక్కించుకున్నారు. అయితే ఇలా చాలా బాధ్యతలను తన మీదకు వేసుకున్నారు. ఈ శాఖలను నిర్వర్తించడం కత్తి మీద సామే. అందుకే తన చుట్టూ పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావిస్తున్నారు. సమర్థవంతమైన అధికారులను ఒక టీం గా ఏర్పాటు చేసుకోవాలన్న తలంపుతో ఉన్నారు. అందులో భాగంగానే యువ ఐఏఎస్ అధికారి కృష్ణ తేజను తన ఓఎస్డిగా తెచ్చుకుంటున్నారు. పవన్ విజ్ఞప్తిని సీఎం చంద్రబాబు సైతం సమ్మతించారు. ప్రస్తుతం కేరళలో ఐఏఎస్ అధికారిగా ఉన్న కృష్ణ తేజను డిప్యూటేషన్ పై పంపాలని కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారు. పవన్ ఓఎస్డిగా కృష్ణ తేజ నియామకం దాదాపు ఖరారు అయినట్టే.

పల్నాడు జిల్లా చిలకలూరిపేటకు చెందిన కృష్ణ తేజ 2017 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఇటీవల జాతీయ బాలల రక్షణ కమిషన్ ఆయనకు ప్రత్యేక పురస్కారానికి ఎంపిక చేసింది. బాలల హక్కుల రక్షణలో త్రిసూర్ జిల్లాను ఆయన దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. 2023 మార్చిలో ఆ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాధలుగా మారిన 609 మంది విద్యార్థులను గుర్తించి.. దాతల సహకారంతో ఉన్నత చదువులకు చేయూత అందించారు. కొవిడ్ తో భర్తలను పోగొట్టుకున్న 35 మంది వితంతువులకు ఇల్లు నిర్మించి ఇచ్చారు. 150 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ఐఏఎస్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన అద్భుత పనితీరుతో తనదైన ముద్ర వేసుకుంటూ వస్తున్నారు. అటువంటి అధికారిని పవన్ ఏరి కోరి తెచ్చుకోవడం విశేషం.

సాధారణంగా ఆర్డిఓ స్థాయి అధికారులను మంత్రులకు ఓఎస్డీలుగా నియమిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ కోసం ఐఏఎస్ అధికారి అయిన కృష్ణ తేజ నియామకానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. కృష్ణ తేజ ప్రస్తుతం కేరళలోని త్రిశూల్ జిల్లా కలెక్టర్ గా ఉన్నారు. ఆయనను డిప్యూటేషన్ పై రాష్ట్రానికి పంపాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు. కృష్ణ తేజ గతంలో కేరళలో పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండిగాను, పర్యాటక శాఖ డైరెక్టర్ గాను, ఎస్సీ అభివృద్ధి శాఖ డైరెక్టర్ గారు, ఆలాప్పుజ జిల్లా కలెక్టర్ గా సేవలందించారు. ఇటీవల జాతీయ పురస్కారానికి ఎంపికైన కృష్ణ తేజను పవన్ కళ్యాణ్ అభినందించారు. శుభాకాంక్షలు తెలిపారు. రెండు రోజుల కిందట సచివాలయంలో పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలిశారు కృష్ణ తేజ. కేరళ నుంచి రిలీవ్ అయిన వెంటనే ఆయన పవన్ కళ్యాణ్ ఓఎస్డిగా నియమితులయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.