Liquor shops applications : రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీచేసిన సంగతి తెలిసిందే.ఈనెల 9 వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ప్రభుత్వం.రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం షాపులతో పాటు 12 నగరాల్లో రిటైల్ స్టోర్ ఏర్పాటుకు నిర్వహించే వేలానికి మూడు రోజుల క్రితం దరఖాస్తులను ఆహ్వానించింది.అయితే తొలి రెండు రోజులు అంతంతమాత్రంగానే దరఖాస్తులు వచ్చాయి.అమావాస్య ఎఫెక్ట్ స్పష్టంగా కనిపించింది. కానీ మూడో రోజు గురువారం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మరో ఐదు రోజులపాటు గడువు ఉండడంతో దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఆన్లైన్ కంటే ఆఫ్లైన్లోనే ఎక్కువమంది దరఖాస్తు చేస్తుండడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా దరఖాస్తులు వస్తాయని అధికారులు అంచనా వేశారు. అయితే అంచనాలకు మించి దరఖాస్తులు వస్తుండడంతో లక్షకు మించితాయని భావిస్తున్నారు. మద్యం షాపులు దరఖాస్తు చేసుకునే వారి నుంచి రెండు లక్షల నాన్ రిఫండబుల్ మొత్తాన్ని వసూలు చేస్తున్నారు. అక్టోబర్ 11న ఈ దరఖాస్తులను అనుసరించి లాటరీ వేయునున్నారు. ఈ లాటరీలో లైసెన్స్ దక్కినా.. బక్కకపోయినా ఈ మొత్తం మాత్రం తిరిగి ఇవ్వరు. లాటరీలో లైసెన్స్ దక్కించుకున్న వారు ఆ మరుసటి రోజు నుంచి షాపులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మొత్తం నాలుగు స్లాబుల్లో షాపులను ఏర్పాటు చేయనున్నారు. అందుకు అనుగుణంగా లైసెన్స్ ఫీజు నిర్ణయించారు.
* తొలి రోజు కేవలం 200
తొలి రోజు కేవలం 200 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఎదురు అమావాస్య కావడంతో చాలామంది వెనక్కి తగ్గారు. అయితే గురువారం నుంచి దరఖాస్తుల ప్రక్రియ ఊపందుకుంది. గురువారం ఒక్కరోజే రెండు వేల రూపాయగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు నాన్ రెఫండబుల్ మొత్తం 60 కోట్ల రూపాయలు సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు. ఈనెల 9 వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉంది. దీంతో భారీగా దరఖాస్తులు రావచ్చని అంచనా వేస్తున్నారు.
* రంగంలోకి అనుచరులు, బినామీలు
మరోవైపు పెద్ద ఎత్తున షాపులు దక్కించుకునేందుకు రాజకీయ పార్టీల నేతలు, వ్యాపారులు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులైనా చేసుకోవచ్చని వెసులుబాటు ఇచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు సైతం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. దీంతోరాజకీయ పార్టీల నేతలు తమ అనుచరులు, బినామీల పేరుతో దరఖాస్తులు చేసుకుంటున్నారు. షాపుల లాభనష్టాల విషయంలో లెక్కలు వేసుకుంటున్నారు. అయితే సాధారణంగా రాజకీయంగా విభేదించుకునే నేతలు మద్యం షాపులు దక్కించుకోవడానికి మాత్రం రింగ్ అవుతున్నారు. సిండికేట్ గా మారుతున్నారు.