Fake Beer Incident In AP: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. టిడిపి కూటమి వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్న పరిస్థితికి మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అన్నీ చేశామని భావించింది. కానీ వైసీపీ ప్రభుత్వం పై కూటమి వ్యతిరేక ప్రచారం చేసింది. దీనిని ప్రజలు బలంగా నమ్మారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం లైట్ తీసుకుంది. అయితే ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు దాని నుంచి గుణపాఠాలు నేర్చుకుంది వైసిపి. అందుకే కూటమికి వ్యతిరేకంగా ఏ చిన్న ప్రచారాన్ని విడిచిపెట్టడం లేదు. ఈ క్రమంలోనే కల్తీ మద్యం కుంభకోణం ఒకటి బయటపడింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే కల్తీ మద్యం చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ ఈ రాజకీయ కుట్రలో వైసీపీ భాగం అయిందని కూటమి ఆరోపిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఒకసారి కొత్త ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకు మద్యం కల్తీ జరిగిందని ఆరోపించింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. తాజాగా బీర్ లో కూడా కల్తీ జరుగుతోందని ఆరోపిస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* మారిన సీన్..
సాధారణంగా విస్కీతోపాటు బ్రాందీ మద్యం బాటిళ్లలో మాత్రమే కల్తీ జరుగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. నకిలీ కార్కింగ్ తో పాటు మిక్సింగ్ మద్యాన్ని ఖాళీ సీసాలో వేసి చలామణి చేస్తున్నారన్న అనుమానాలు ఉన్నాయి. అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని పాత ధరలకే అందిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీకి తగ్గట్టుగానే కూటమి ప్రభుత్వం ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసి పాత ప్రీమియం బ్రాండ్లు అందిస్తోంది. అయితే ఆ ప్రీమియం బ్రాండ్ సీసాలో నకిలీ మద్యం విక్రయిస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు అనుకూల మీడియాలో కథనాలు వచ్చాయి. అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. ఈ నకిలీ మద్యంతో సంబంధాలు ఉన్న తెలుగుదేశం పార్టీ నేతలను సస్పెండ్ చేసింది హై కమాండ్. అది మొదలు టిడిపిని టార్గెట్ చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఈ నకిలీ దందా అనేది ఇప్పటిది కాదని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దీని సంకేతాలు ఉన్నాయని టిడిపి చెబుతోంది. ప్రధాన నిందితుడితో ఒక వీడియోను బయటపెట్టింది.
* సోషల్ మీడియాలో వైరల్..
అయితే నకిలీ మద్యం మీ పాపం అంటే మీ పాపం అంటూ టిడిపి వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ అన్నట్టు పరిస్థితి ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మరో వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కృష్ణాజిల్లా గన్నవరం లో బీరు నకిలీ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. నకిలీ మద్యానికి సంబంధించిన నిర్ధారణకు ప్రభుత్వం ఒక యాప్ అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఆ యాప్ తో గన్నవరంలోని ఓ మద్యం షాపులో బీరును పరిశీలించగా క్యూఆర్ కోడ్ రాంగ్ గా వచ్చింది. తద్వారా ఆ బీరులో నీరు కలిపినట్లు స్పష్టం అవుతుంది. అదే విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ ఒక వీడియో వైరల్ అవుతుంది. కానీ ఆ వీడియోలో సంబంధిత షాప్ కానీ.. మనుషులు కానీ వెలుగులోకి రాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ తరహా ప్రయత్నం చేస్తోందని కూటమి ప్రభుత్వం అనుమానం వ్యక్తం చేస్తోంది. మరి అందులో ఎంత నిజం ఉందో తెలియాలి.