AP BJP: ఏపీ ( Andhra Pradesh) విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా నిలుస్తోంది. పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా తమ వంతు సాయం ప్రకటించింది. ఇప్పుడు తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఏకంగా 11,500 కోట్ల రూపాయలు అందించింది. తద్వారా విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ లేదని తేల్చి చెప్పింది. వాస్తవానికి ఏపీ విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తూనే ఉంది. కానీ అందుకు తగ్గట్టుగా బిజెపి క్యాష్ చేసుకోలేకపోతోంది. రాష్ట్ర బిజెపి ఉన్నా.. ఆ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఎంపీలు ఉన్నా.. కేంద్రం అందిస్తున్న ప్రత్యేక సాయం విషయంలో ప్రచారం చేసుకోలేకపోతోంది బిజెపి.
ఇటీవల విశాఖలో( Visakhapatnam) రెండు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు ప్రధాని మోదీ. రాష్ట్రానికి ప్రత్యేక రైల్వే జోన్ కూడా ఇచ్చారు. అమరావతి రాజధానికి అనుసంధానంగా రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను సైతం ప్రకటించారు. అందులో కొన్ని ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయి కూడా. ఇక గన్నవరం సమీపంలో ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణాన్ని సైతం నిర్మించారు. వాడరేవుల అభివృద్ధికి సైతం ప్రత్యేక చర్యలు చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం తో పాటు 11 ఎయిర్పోర్టులను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. అయితే ఇంత చేస్తున్న వాటిని ప్రచారం చేసుకోవడంలో ఏపీ బీజేపీ విఫలమవుతోంది.
* పటిష్ట నాయకత్వం ఉన్న
ఏపీ బీజేపీలో( AP BJP ) చాలామంది సీనియర్లు ఉన్నారు. పటిష్టమైన నాయకత్వం ఉంది. కానీ టిడిపి కూటమిలో కొనసాగుతున్నందున తగిన రీతిలో ప్రచారం చేసుకోలేకపోతున్నారు బిజెపి నేతలు. ఇది ఆ పార్టీకి ముమ్మాటికి నష్టమే. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడ టిడిపి ప్రభుత్వం ఉంది. అక్కడ ఎన్డిఏ అధికారంలోకి వచ్చింది. అప్పట్లో కూడా కేంద్ర ప్రభుత్వం ఉదారంగా సాయం చేసింది. కానీ ప్రత్యేక హోదాను అడ్డం పెట్టుకొని చంద్రబాబు కేంద్రంతో తెగదెంపులు చేసుకున్నారు. బిజెపిని ఏపీలో ఒక విలన్ గా చూపారు. పూర్తిగా నిర్వీర్యం చేశారు. దాంతో 2019 ఎన్నికల్లో కనీసం రాష్ట్రంలో బోణి కూడా తెరవలేదు. బిజెపికి ఒక్క సీటు అయినా రాలేదు. కనీసం ఒక్క శాతం ఓట్లయినా లభించలేదు.
* గత ఐదేళ్లలో సైతం
గత ఐదేళ్ల వైసిపి( YSR Congress ) పాలనలో కూడా ఏపీకి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. అనేక రకాలుగా ఆదుకుంది. భారీగా నిధులు కేటాయించింది. అప్పుడు కూడా బిజెపి నేతలు సద్వినియోగం చేసుకోలేకపోయారు. కేంద్ర సాయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయలేదు. అటు జగన్ సైతం ప్రత్యేక రాజకీయ పరిస్థితులతో బిజెపిని ఎదగనివ్వకుండా చేశారన్న విమర్శ ఉంది. అప్పట్లో కూడా బీజేపీ నేతలు ఎవరు నోరు తెరవలేదు. పైగా జగన్ కు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా మారిపోయారే తప్ప.. తమకు తాము ఎదిగే ప్రయత్నం చేయలేదు. కేంద్ర ప్రభుత్వ సాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రయత్నం చేయలేదు.
* కేంద్రం నుంచి భారీగా సాయం
ఈసారి ఎన్నడూ లేని విధంగా కేంద్రం( central government) నుంచి ఏపీకి అన్ని విధాలా సాయం అందుతోంది. ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో బిజెపి చేరింది. దీంతో బిజెపి పాలిత రాష్ట్రాల కంటే ఏపీకి ప్రాధాన్యం ఇస్తోంది కేంద్రం. ఇటువంటి సమయంలో బిజెపి ఏపీ నేతలు ఎంత యాక్టివ్ గా పని చేయాలి. కేంద్ర సాయాన్ని ఏ స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కానీ అటువంటి ప్రయత్నమే అస్సలు జరగడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు బిజెపి నేతలు ఏం చేస్తున్నారన్నది ఇప్పుడు ప్రశ్న. ఆ పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు ఎంపీలు ఉన్నారు. మరి ఎంతమందో సీనియర్లు పార్టీలో కొనసాగుతున్నారు. కానీ ఎందుకు కేంద్రం ఇచ్చిన సాయం విషయంలో ప్రచారం చేయడానికి వెనుకడుగు వేస్తున్నారో తెలియడం లేదు. ఇప్పటికైనా బిజెపి నేతలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏపీలో పార్టీ అభివృద్ధి సాధించడం ఖాయం.