Annadhata Sukhibava Money: ఏపీలో( Andhra Pradesh) ఎన్నికల హామీగా ఉన్న అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. కేంద్రం అందించే పీఎం కిసాన్ సాయంతో పాటు అన్నదాత సుఖీభవ పథకం కింద 5000 రూపాయల మొత్తాన్ని అందించింది. కేంద్ర ప్రభుత్వం అందించే 2000 రూపాయలతో కలిపి 7000 రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో రైతుల్లో ఆనందం కనిపిస్తోంది. అన్నదాత సుఖీభవ విడుదల చేసిన తొలి రోజే 99.98 శాతం మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ అయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే చాలామంది రైతులకు వివిధ కారణాలతో నిధులు జమ కాలేదు. అటువంటి వారంతా ఆందోళన చెందాల్సిన పనిలేదని.. తప్పిదాలను సరిచేసి అర్హులుగా చూపించుకుంటే ఖాతాల్లో నిధులు జమ అవుతాయని చెప్పుకొస్తున్నారు.
ఆ హామీ మేరకు..
అధికారంలోకి వస్తే సాగు సాయం కింద కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఏటా 20వేల రూపాయలు అందిస్తామని చంద్రబాబు ( CM Chandrababu)హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నిన్ననే అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. అర్హుడైన ప్రతి రైతుకు సాయం అందాలని.. తప్పులు ఉంటే సరి చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు. అయితే ప్రధానంగా వెబ్ ల్యాండ్, ఆధార్ సీడింగ్ విషయంలో చాలామంది రైతులకు సాంకేతిక సమస్యలు వచ్చాయి. అటువంటి వారికి నిధులు జమ కాలేదు. అయితే ఇటువంటి వారందరికీ అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. ఆగస్టు 3న అంటే ఆదివారం నుంచి అభ్యంతరాలు, సవరణలు నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
వివరాలు వెల్లడించిన వ్యవసాయ శాఖ..
రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్( Agriculture Department director) ఢిల్లీ రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 44.75 లక్షల మంది రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ నిధులు జమ అయ్యాయని తెలిపారు. అయితే ఈ కేవైసీ సమస్యలు ఉన్న వారి విషయంలో మాత్రం నిధులు జమ కాలేదన్నారు. ఎన్పీసీసీఐలో చురుగ్గా లేని.. మ్యాప్ కానీ అకౌంట్లను బ్యాంకుకు వెళ్లి యాక్టివ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అప్పుడే వారి ఖాతాల్లో నగదు జమ అవుతుందని చెబుతున్నారు. నిధులు జమ కాని రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదని అధికారులు సూచిస్తున్నారు. ఎవరికైనా నిధులు జమకాకుంటే గ్రామాల్లో ఉండే రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈకేవైసీ సమస్యలు, బ్యాంక్ ఖాతాలు సక్రమంగా లేనివారు, భూ యజమానులు చనిపోయాక వారసులు పాసుపుస్తకాలు పొందడంలో ఆలస్యం అయిన వారు, వెబ్ లాండ్ సమస్యలు ఉన్నవారికి నిధులు జమకాలేదు. అటువంటి వారిలో అర్హులు తమ అర్హతను నిరూపించుకుంటే ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది. ఈరోజు నుంచి ఇందుకు సంబంధించి గ్రీవెన్స్కు అనుమతి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం.