Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu 18-months rule: 18 నెలల చంద్రబాబు పాలన ఎలా ఉంది?

Chandrababu 18-months rule: 18 నెలల చంద్రబాబు పాలన ఎలా ఉంది?

Chandrababu 18-months rule: పాలనా దక్షుడు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు చంద్రబాబు( AP CM Chandrababu). ఆయనకు రాజకీయము కొత్త కాదు. పాలన కొత్త కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేసిన ఘనత ఆయనది. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన. ఇప్పుడు రెండోసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. 18 నెలల పాలన పూర్తి చేసుకున్నారు. ఇప్పటివరకు ఐదు సార్లు ముఖ్యమంత్రి పదవిని అలంకరించారు. అంతే స్థాయిలో ఈ రాష్ట్రానికి ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఉన్నారు. అయితే ఆయన సీఎం పదవి చేపట్టిన 14 సంవత్సరాలు ఒక ఎత్తు. ఈ ఐదేళ్లు ఒక ఎత్తు అన్నట్టు ఉంది చంద్రబాబు పాలన పరిస్థితి. మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి, సంక్షేమం సమానంగా ముందుకు తీసుకెళుతున్నారు చంద్రబాబు. ఆపై అమరావతి రాజధాని, ఇంకోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరుగులెత్తిస్తున్నారు.

ప్రతి సంతకానికి న్యాయం..
గత ఏడాది జూన్లో అధికార పీఠం ఎక్కింది కూటమి ప్రభుత్వం( Alliance government ). నవ్యాంధ్రప్రదేశ్ కు రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు చంద్రబాబు. డీఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు చంద్రబాబు. రెండో సంతకంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశారు. మూడో సంతకం గా పెన్షన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. నాలుగో సంతకంగా అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై చేశారు. ఐదో సంతకంగా నైపుణ్య గణన ఫైల్ పై చేశారు. కానీ ముఖ్యమంత్రిగా ఈ ఐదు ఫైళ్లపై చేసిన సంతకాలు ఏపీ స్వరూపాన్ని మార్చాలి అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీతో తొలి సంతకానికి న్యాయం చేశారు చంద్రబాబు. ప్రజలు తమ సొంత ఆస్తులపై భయాందోళనతో ఉన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దుచేసి సంచలనానికి తెర లేపారు. అప్పటివరకు ఇస్తున్న మూడువేల రూపాయల పెన్షన్ మొత్తాన్ని నాలుగు వేలకు పెంచి మూడో సంతకానికి న్యాయం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లను తెరిచి.. ఐదు రూపాయలకే పేదలకు అన్నం పెట్టి నాలుగో సంతకానికి నిజమైన న్యాయం చేకూర్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఐటి పరిశ్రమలతో పాటు ఇతర పరిశ్రమలను ఏర్పాటు చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచారు. అలా అయిదో సంతకానికి విలువ తెచ్చారు చంద్రబాబు.

ప్రపంచస్థాయి నగరంగా అమరావతి…
అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణానికి పరుగులు పెట్టించారు చంద్రబాబు. ఐదేళ్ల వైసిపి హయాంలో అమరావతి పూర్తిగా నిర్వీర్యం అయింది. స్మశానంలా మార్చేశారు వైసీపీ పాలకులు. అమరావతి రైతుల ఉద్యమాన్ని ఉక్కు పాదంతో అణచివేశారు. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి పై ఫుల్ ఫోకస్ పెట్టారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం అమరావతికి కళ వచ్చింది. గత అనుభవాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ప్యాకేజీ పొందడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. తొలి వార్షిక బడ్జెట్లోనే కేంద్రం అమరావతికి 15 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. రైల్వే తోపాటు రోడ్డు ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకొచ్చింది. ఒక ఉద్యమంలా ప్రారంభం అయింది అమరావతి రాజధాని నిర్మాణం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ పరంగా భవనాల నిర్మాణం జరుగుతుండగా.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంకులు, ఆర్థిక కార్యాలయాల నిర్మాణం ప్రారంభం అయింది. అదే సమయంలో ప్రపంచానికే దిక్సూచిగా నిలిచే క్వాంటం వ్యాలీ, డ్రోన్ల హబ్ నిర్మాణం కూడా జరుగుతోంది. అయితే ఇప్పుడు అదనంగా 20 వేల భూమిని సేకరిస్తున్నారు. ప్రపంచంలోనే అమరావతి నగరాన్ని అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ముందుకు వెళుతున్నారు సీఎం చంద్రబాబు.

పోలవరం ప్రాజెక్టు శరవేగంగా..
పోలవరం ప్రాజెక్టు( polavaram project) నిర్మాణం పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ను సస్యశ్యామలం చేయాలన్నది చంద్రబాబు ప్రణాళిక. గతంలో పట్టిసీమ మాదిరిగానే రాయలసీమకు గోదావరి తో పాటు కృష్ణా జలాలను తరలించాలన్నది చంద్రబాబు ఆలోచన. నదుల అనుసంధానంతో పాటు మిగులు జలాలను రాయలసీమకు పంపించి ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలన్న ఆలోచనతో ముందుకు అడుగులు వేస్తున్నారు. 2028 నాటికి అమరావతి తో పాటు పోలవరం ప్రాజెక్టుకు ఒక రూపం తేవాలన్నది చంద్రబాబు ఆలోచన. దాదాపు 18 నెలల కాలంలో చంద్రబాబు ఈ విషయంలో సక్సెస్ అయ్యారు కూడా. చంద్రబాబు పాలనకు ఇవి గీటురాళ్లుగా మారతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు.

వరుసగా పథకాలు అమలు చేస్తూ..
చంద్రబాబుపై ఒక అపోహ ఉంది. పాలనాపరమైన మంచి పేరు ఉంది కానీ సంక్షేమానికి దూరం అన్న విమర్శ ఆయనపై ఉంది. ఆ కారణంతోనే 2019లో జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) అవకాశం ఇచ్చారు ఏపీ ప్రజలు. ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో నగదు ఇచ్చేందుకు చంద్రబాబు వ్యతిరేకం అనే ముద్ర ఉండేది. 2024లో టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అదే విమర్శ కొనసాగింది. తొలి ఏడాది సంక్షేమ పథకాలు ఆశించిన స్థాయిలో అమలు కాకపోవడంతో అదే ఆరోపణలు వచ్చాయి. కేవలం పింఛన్ల పెంపు, అన్న క్యాంటీన్ల ఏర్పాటుతో సంక్షేమం నిలిచిపోవడంతో.. చంద్రబాబు సంక్షేమ పథకాలు అమలు చేయలేరని వైసీపీ ఎద్దేవా చేయడం ప్రారంభించింది. కానీ ఒకేసారి సంక్షేమ పథకాలతో విలయతాండవం చేసారు చంద్రబాబు. వరుసగా అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఆటో డ్రైవర్ల సేవలో, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఇలా సూపర్ సిక్స్ పథకాలను వరుసగా అమలు చేస్తూ వచ్చారు. సంక్షేమానికి తాను దూరం కానని.. అభివృద్ధితో పాటు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నది తన ధ్యేయమని చక్కటి సంకేతాలు పంపగలిగారు సీఎం చంద్రబాబు.

కూటమిని సరైన రీతిలో..
ఎక్కడైనా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్లాలంటే రాజకీయపరమైన అనేక అడ్డంకులు వస్తాయి. ఏపీలో కూడా టిడిపి, జనసేన, బిజెపి లతో కూడిన కూటమి ప్రభుత్వం నడుస్తోంది. సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆపై కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కీలక భాగస్వామి. ఇటువంటి ప్రభుత్వం నడపాలంటే కత్తి మీద సామే. అనేక రకాలైన అవరోధాలు ఎదురుగా వస్తుంటాయి. కానీ వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు చంద్రబాబు. సీఎం చంద్రబాబు కు కొండంత అండగా నిలుస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ ఇద్దరు నేతలకు స్వేచ్ఛ ఇచ్చింది కేంద్రంలోని బిజెపి. ఇలా ఈ మూడు పార్టీల త్రయం మరో 15 ఏళ్ల పాటు కొనసాగాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఆ మూడు పార్టీల మధ్య చీలికను ప్రయత్నించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు కానీ.. ప్రతి ప్రయత్నం విఫలం అవుతూనే ఉంది. మొత్తానికి అయితే 18 నెలల చంద్రబాబు పాలన ఏపీ అభివృద్ధికి కొత్త అడుగులు వేస్తుండగా.. రాజకీయ ప్రత్యర్థులకు మాత్రం చెమటలు పుట్టిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version