రిపబ్లిక్ సినిమా ప్రీరిలీజ్ వేడుకలో ఆన్ లైన్ సినిమా టికెట్ల అంశంలో పవన్ కళ్యాణ్ ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. అయితే, ఏపీ ప్రభుత్వం పై పవన్ చేసిన వ్యాఖ్యల పై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పవన్ కల్యాణ్ కి కౌంటర్ ఇస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. పవన్ కళ్యాణ్ నటించినా, సంపూర్ణేష్ బాబు నటించినా.. కష్టం ఒకటే అంటూ.. పవన్ ను ఒక కమెడియన్ తో పోల్చి చెబుతూ పవన్ ఫ్యాన్స్ ను హర్ట్ చేశాడు. అయినా పవన్, సంపూర్ణేష్ బాబు కష్టం, ఇక ఆ కష్టానికి ఫలితం ఒక్కటి ఎలా అవుతుంది అనిల్ ?

ఇక ఆన్ లైన్ టికెట్ల పోర్టల్ గురించి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలోని కొందరు ప్రముఖులే ఈ విధానం పై ప్రభుత్వ పెద్దలతో చర్చించారని.. కాబట్టి ప్రభుత్వం పై విమర్శలు మానుకోవాలని అనిల్ చెప్పుకొచ్చాడు. మరి ఆ సినీ పెద్దలు ఎవరో అనిల్ ఎందుకు చెప్పడం లేదు ? అలాగే.. అనిల్ పవన్ విధానం పై స్పందిస్తూ.. ‘కేవలం మా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పవన్ మాట్లాడుతున్నాడు. అయినా పవన్ కళ్యాణ్ కి తన రాజకీయ ఉనికి కోసం జగన్ ని తిట్టడం ఒక ఫ్యాషన్ అయిపోయింది.
ఇక నేను రోడ్డుపైకొస్తే మనిషిని కాదు, బెండు తీస్తాం’ అని పవన్ కల్యాణ్ మాట్లాడటం చాలా సార్లు చూశాం. పవన్ కల్యాణ్ పార్టీ త్వరలోనే చాపచుట్టేయడం ఖాయం’ అంటూ అనిల్ కుమార్ కాస్త ఘాటుగానే కామెంట్స్ చేశాడు. అయినా సినిమాల గురించి మాట్లాడినప్పుడు మధ్యలో రాజకీయ ప్రస్తావన ఎందుకు ? మైక్ ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడి మధ్యలో నాలుగు తిట్లు తిట్టి వెళ్ళిపోతే.. అది రాజకీయం ఎలా అవుతుందో అనిల్ కే తెలియాలి.
ఇక మరో వైసీపీ నేత బొత్స సత్యనారాయణ కూడా పవన్ చేసిన వ్యాఖ్యల పై విమర్శలు చేశారు. బొత్స మాట్లాడుతూ.. ‘సినిమా టికెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ కామెంట్స్ సరికాదు. అయినా.. సినిమా టికెట్ల రేట్లను మా ఇష్టానుసారం పెంచుకుంటాం.. ప్రభుత్వం చూస్తూ ఉండాలి అంటే.. కుదరదు. ప్రజలపై భారం వేస్తే.. ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. జీఎస్టీ వంటి పన్నులను స్ట్రీమ్ లైన్ చేయడమే మా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం ఇలా గొప్పగా సాగింది బొత్స స్పీచ్.
కానీ, ప్రజలకు మేలు చేస్తున్నాం అని చెబుతున్న బొత్స ఏ రకంగా మేలు చేస్తున్నారో ఎందుకు చెప్పడం లేదు. ఇక చివరలో ‘నోరుందని పవన్ ఇష్టానుసారంగా మాట్లాడాడు’ అంటూ పవన్ పై విమర్శలు చేశాడు. ఏమిటో టికెట్ల సమస్య పై మాత్రం ఒక్కరూ మాట్లాడలేదు.