Minister Vangalapudi Anitha: గత ఐదేళ్ల వైసిపి పాలనలో శాంతి భద్రతలు దారుణంగా క్షీణించాయని విపక్ష టిడిపి, జనసేనలు ఆరోపించేవి. ఎక్కడ ఏ చిన్నపాటి ఘటన జరిగినా రాజకీయం చేసేవారు. ఏపీలో నేరాలు ఘోరాలు జరిగిపోతున్నాయని ప్రచారం చేసేవారు. అసలు జగన్ పాలన చేయలేకపోతున్నారని ఎద్దేవా చేసేవారు. నేర నియంత్రణలో పోలీస్ శాఖ వైఫల్యం చెందిందని.. అధికార వైసీపీ సేవలో తరిస్తోందని ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ కక్షలకే పోలీస్ శాఖ ఉపయోగపడిందన్న కామెంట్స్ కూడా బలంగా అప్పట్లో వినిపించేవి. దీనినే ప్రతిపక్షాలు హైలెట్ చేసేవి. తెలుగుదేశం పార్టీ ప్రత్యేక పోరాటాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పాలన ప్రారంభించి 50 రోజులు దాటుతోంది. కానీ నేరాల నియంత్రణ సాధ్యం కావడం లేదు. ప్రతిరోజు ఏదో ఒక చోట నేరాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలపై అఘాయిత్యాలు, రాజకీయ హత్యలు, అత్యాచార ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. గంజాయి, మాదకద్రవ్యాలు పట్టుబడుతూనే ఉన్నాయి. దీనిపై విమర్శలు చెలరేగుతున్న తరుణంలో హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. పోలీస్ శాఖ పరంగా గట్టి చర్యలే చేపడుతున్నట్లు చెబుతున్న ఆమె.. ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ సాధ్యమని తేల్చి చెప్పడం విశేషం. అప్పట్లో ఏపీలో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆమె.. ఇప్పుడు హోంమంత్రిగా ఉంటూ బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటూ వైసీపీ ప్రచారం చేయడం ప్రారంభించింది.
* ఏపీలో పెరుగుతున్న నేరాలు
ఏపీలో పెరుగుతున్న నేరాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నేరాలు తగ్గుముఖం పడతాయని అంతా భావించారు. గతంలో వైసీపీ హయాంలో హోం మంత్రులుగా మేకతోటి సుచరిత, దానేటి వనిత వ్యవహరించారు. కానీ ఇద్దరు హోం శాఖపై పెద్దగా ప్రభావం చూపలేకపోయారని ప్రచారం జరిగింది. పేరుకే హోంశాఖ కానీ సమీక్షలన్నీ అప్పట్లో సజ్జల రామకృష్ణారెడ్డి చేసేవారని.. కనీసం కానిస్టేబుల్ బదిలీ కూడా చేసుకునే స్థితిలో వారు లేరన్న విమర్శలు ఉన్నాయి. అప్పట్లో హోంశాఖ పరంగా నిర్ణయాలని సీఎం జగన్ తీసుకునే వారని ప్రచారం జరిగింది.
* పరిస్థితి మారుతుందని ఆశ
హోం శాఖ మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు తీసుకున్న తర్వాత స్వతంత్రంగా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు. వరుసగా రివ్యూలు జరిపారు. శాఖపరమైన ఆదేశాలు ఇచ్చారు. దీంతో పోలీస్ శాఖలో వినూత్న మార్పులు ఉంటాయని అంతా భావించారు. కానీ తాజాగా వంగలపూడి అనిత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఐదు కోట్ల జనాభా కు 50 వేల మంది పోలీస్ సిబ్బంది మాత్రమే ఉన్నారని.. నేర నియంత్రణ ఎలా సాధ్యమని ఆమె ప్రశ్నించారు. ప్రజా భాగస్వామ్యంతోనే నేర నియంత్రణ సాధ్యమని కూడా తేల్చి చెప్పారు.
* అప్పట్లో ఉన్నది ఇంతే సిబ్బంది
అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో ఇంతే సిబ్బంది ఉన్నారన్న విషయం వంగలపూడి అనితకు తెలియదా? అప్పుడు ప్రజా భాగస్వామ్యంతో నేర నియంత్రణ సాధ్యమని భావించలేదా? అంటూ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రారంభించింది. తమ వరకు వస్తే కానీ ఏ విషయం అర్థం కాదని.. వైసిపి హయాంలో పోలీస్ శాఖను నిర్వీర్యం చేశారని ప్రచారం చేశారని.. ఇప్పుడు చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ పోస్టులే వైరల్ గా మారాయి. వైసిపి శ్రేణులు సైతం ట్రోల్ చేస్తున్నారు.