Hindi Language Debate: హిందీ భాషను( Hindi language) దేశవ్యాప్తంగా బలంగా రుద్దుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీపై మిగతా పార్టీలు ఆగ్రహంగా ఉన్నాయి. ఈ విషయంలో బిజెపికి ఎవరు మద్దతు తెలిపినా వారు ప్రత్యర్థులుగా మారుతున్నారు. మాతృభాష అమ్మ అయితే.. హిందీ భాష పెద్దమ్మ అంటూ ఆ మధ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీంతో వివిధ ప్రాంతీయ పార్టీల నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసుకున్నారు. అది మరువక ముందే ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హిందీని జాతీయ భాషగా వ్యాఖ్యానించినందున టార్గెట్ అయ్యారు. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల వారు లోకేష్ తీరును తప్పు పడుతున్నారు. ఇటీవల ఇండియా టుడే కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లోకేష్ జాతీయ విద్యా విధానంపై యాంకర్ వేసిన ప్రశ్నపై చెప్పిన సమాధానం ఇప్పుడు వివాదాస్పదం అయ్యింది.
నోరు జారిన లోకేష్
ఏపీ మంత్రి నారా లోకేష్ ( Minister Nara Lokesh) నోరు జారడం వాస్తవం. హిందీని జాతీయ భాషగా మాట్లాడే క్రమంలో.. యాంకర్ దానిని సరి చేసే ప్రయత్నం చేసినా లోకేష్ గుర్తించలేకపోయారు. దీంతో దీనిని రాజకీయ కోణంగా మలుచుకుని ప్రత్యర్థులు సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేయడం ప్రారంభించారు. దక్షిణాది రాష్ట్రాలలో హిందీని బలంగా రుద్దే ప్రయత్నం జరుగుతోందని.. అది కూడా ఏపీని ఉపయోగించుకొని బలవంతంగా ఉద్య ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలు ప్రారంభించారు. వాస్తవానికి హిందీ అనేది జాతీయ భాష కాదు. అది అధికార భాష. దానికి అనుసంధానంగా ఇంగ్లీష్ కూడా అధికార భాషగా గుర్తించారు. వాటితో పాటు దేశవ్యాప్తంగా 22 భాషలను రాజ్యాంగం గుర్తించింది. అయితే జాతీయస్థాయిలో ఉత్తర ప్రత్యుత్తరాలు హిందీతో పాటు ఇంగ్లీషులో జరగాలన్నది రాజ్యాంగంలో రాశారు. నారా లోకేష్ మాతృభాషను గౌరవిస్తూనే.. మాతృభాషను అనుసరిస్తూనే.. హిందీ తో పాటు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తప్పు ఏంటి అనేది ప్రశ్నించారు. ఇప్పటికే అధికార భాషలుగా ఆ రెండు ఉన్నందున ఆచరించడంలో తప్పేంటి అని వ్యాఖ్యానించిన క్రమంలో.. జాతీయ భాషగా అభివర్ణించారు. అదే ఇప్పుడు నారా లోకేష్ ట్రోల్స్ కు కారణం.
Also Read: Sivakumar YSR Congress EC letter: వైసీపీకి గొడ్డలి గుర్తు కావాలని ఈసీకి లేఖ.. వైరల్
1968 నుంచి..
జాతీయ విద్యా విధానంలో( national education system) భాగంగా 2020లో మూడు భాషల విధానాన్ని తెరపైకి తెచ్చారు. ప్రతి రాష్ట్రంలో మాతృభాషను చదువుతూనే ఇంగ్లీష్ తో పాటు హిందీ ని తప్పనిసరి చేశారు. అయితే ఇది కొత్త విధానం కాదు. 1968లో జాతీయ విద్యా విధానంలో భాగంగా ప్రతి రాష్ట్రంలో మూడు భాషలను తప్పనిసరి చేశారు. కానీ అప్పట్లో తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది. తమ మాతృభాష తమిళం తో పాటు ఇంగ్లీష్ మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. అది మొదలు తమిళనాడులో హిందీ భాష పై వ్యతిరేకత ఉండనే ఉంది. అయితే అసోసియేట్ అధికార భాషగా ఉన్న ఇంగ్లీష్ కులేని అభ్యంతరం.. భారతదేశానికి చెందిన హిందీ భాష పై ఎందుకు అన్నది ఒక ప్రశ్న.
మూడు భాషలు తప్పనిసరి..
భారత రాజ్యాంగమే అధికార భాషగా హిందీని గుర్తించింది. దానికి అసోసియేటెడ్ గా ఇంగ్లీష్ ( English)ఉంది. రాష్ట్రాలు తమ మాతృభాషను అనుసరిస్తూనే.. ఆ రెండు భాషలు నేర్చుకోవాలన్నది రాజ్యాంగ సూచన. కానీ ఇప్పుడు ఈ భాష వివాదం చెలరేగడం అనేది నిజంగా ఆందోళనకు గురి చేసే విషయం. కేవలం రాజకీయాల కోసమే ఈ వివాదాన్ని తెరపైకి తెచ్చినట్టు కనిపిస్తోంది. రాష్ట్రాల మధ్య, దేశంలో అంతర్గత సమస్యలు చాలానే ఉన్నాయి. కానీ ప్రజల మధ్య భాష విద్వేషాలను నింపేందుకు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్న అనుమానాలు ఉన్నాయి. దీనిని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఎన్ని దశాబ్దాలైనా.. భాషా వివాదం కొనసాగుతూనే ఉంటుంది.