Amaravathi: ఇన్నాళ్లూ అమరావతిలో పరోక్ష పోరాటాలే జరిగాయి. ఒక వైపు చట్టపరమైన పోరాటాలతో పాటు నిరసనలు, ర్యాలీలతో అమరావతి రైతులు ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించేవారు. చివరకు అమరావతి టు అరసవల్లి పాదయాత్ర చేస్తున్న తమపై వైసీపీ అల్లరిమూకలు దాడిచేసినా రైతులు సంయమనంతో వ్యవహరించారు. ఆ బాధను తట్టుకొని ముందుకు సాగారు. న్యాయస్థానంలో కేసులు వేసి ఓపికగా విచారణలకు హాజరవుతున్నారు. అయితే రాజు స్థానంలో ఉన్న జగన్ ఇప్పుడు సరికొత్త ప్లాన్ రూపొందించారు. పేదలను అడ్డంపెట్టుకొని అమరావతి రైతులతో యుద్ధం ప్రకటించారు. దీంతో కళ్లెదుటే దగాకు గురవుతున్న బాధితవర్గమైన రైతులు ప్రత్యక్ష పోరాటాలకు దిగుతున్నారు. దీంతో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.
జేసీల పర్యవేక్షణలో..
అమరావతి రాజధానికి సేకరించిన భూముల్లో పేదలకు పట్టాలివ్వాలని జగన్ సర్కారు డిసైడయ్యింది. దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వానికి అనుకూలంగా కోర్టు తీర్పు వచ్చింది. దీంతో 1,134 ఎకరాల్లో 50 వేల మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు సంబంధించి చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఆ భూమి చాలదన్నట్టు.. ఇప్పుడు మరో 268 ఎకాల భూమి కేటాయింపుకు నిర్ణయించింది. ఈ నెల 18న సీఎం జగన్ చేతులమీదుగా పట్టాలిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రౌండ్ లెవలింగ్ స్ధలాల విభజన రోడ్లు డ్రైనేజీ ఏర్పాట్లకు మార్క్ చేయటం ఇంటి స్ధలాలను గుర్తించేందుకు సరిహద్దు రాళ్ళని నాటడం లాంటి పనులను స్వయంగా కలెక్టర్లు జాయిట్ కలెక్టర్లే దగ్గరుండి చూసుకుంటున్నారు. రాత్రనక పగలనక యంత్రాంగం మొత్తం యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తోంది.
నివురుగప్పిన నిప్పులా..
అయితే దీనిపై న్యాయపోరాటానికి అమరావతి జేఏసీ నిర్ణయించింది. సుప్రీం కోర్టులో పిటీషన్ వేయనుంది. అయితే ఈ అనుమానంతోనే ప్రభుత్వం ఇక్కడ పనులను వార్ ఫుటింగ్ తో చేయిస్తోంది. కానీ అమరావతి రైతులుఅడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. భూమిని చదును చేస్తుండడంతో పాటు సర్వేరాళ్లను తొలగిస్తున్నారు. ఒక వైపు ప్రభుత్వం తరుపున పనులు, మరోవైపు రైతుల అడ్డగింతలతో అమరావతిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజధాని రైతులు ఇతరులు ఎవరు ఆ భూములో్ల అడుగుపెట్టేందుకు లేదని ఆంక్షలు విధించింది. ముందుజాగ్రత్తగా పెద్దఎత్తున పోలీసులను ఏర్పాటుచేసింది. పనులను అడ్డుకుంటున్న వాళ్ళని గుర్తించి కేసులు నమోదుచేస్తోంది. అధికారులే జేఏసీ సభ్యులపై ఫిర్యాదులు ఇస్తున్నారు. అంటే ఒకవైపు పట్టాలను పంపిణీ చేయాలని ప్రభుత్వం మరోవైపు పంపిణీని అడ్డుకోవాలని జేఏసీ పట్టుదలగా ఉండటంతో గొడవలు పెరిగిపోతున్నాయి. దీంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారుతోంది.