Namaste Telangana vs Andhrajyothy : “ఔటర్ రింగ్ రోడ్డు కాసులు కురిపించే కామధేనువు. కెసిఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం అప్పులపాలు చేయడంతో, ఇప్పటికిప్పుడు పైసలు కావాలి. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు ను ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టాడు. దీని ద్వారా వచ్చిన డబ్బులతో ఎన్నికలకు వెళ్తాడు.. ఇది ఎంతవరకు కరెక్ట్ ?” ఇదీ రాధాకృష్ణ ప్రశ్న. ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయి.. తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని పదేపదే చెప్పే కెసిఆర్ మాటలు పచ్చి అబద్దాలు.. అది ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ ద్వారానే బయటపడింది మొన్నటిదాకా ఇలానే సాగింది ఆంధ్రజ్యోతి వార్తీకరణ. ఎలాగూ ఆంధ్రజ్యోతి రాసింది కాబట్టి, అది కెసిఆర్ కు వ్యతిరేకం కాబట్టి.. నమస్తే తెలంగాణ కౌంటర్ పల్లవి అందుకుంది.
ఆంధ్రజ్యోతిని తూర్పార పట్టింది
ఇప్పుడు నమస్తే తెలంగాణకు ఎడిటర్ గా తిగుళ్ల కృష్ణమూర్తి వ్యవహరిస్తున్నాడు. ఈయన ఒకప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఫోల్డ్ లో వ్యక్తే. ఎక్కడ లింకు కుదిరిందో గాని కెసిఆర్ కాంపౌండ్లోకి వెళ్లిపోయాడు. ఇక అప్పటినుంచి కెసిఆర్ భజన మరింత రంజుగా చేస్తున్నాడు. పేపర్ నిండా తాటికాయంత అక్షరాలతో వార్తలను నింపేస్తున్నాడు. అంతేకాదు తన కులపు వ్యక్తులతో నమస్తే తెలంగాణను నింపేశాడు.. అయితే అవుటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్టుకు సంబంధించి ఆంధ్రజ్యోతి రాసిన వార్తలకు కౌంటర్ వేశాడు. కానీ ఏ మాటకు ఆ మాట నమస్తే రాసిన వార్తలన్నీ సత్య దూరంగా ఉన్నాయి. 7000 కోట్లు 30 సంవత్సరాల లో రెండు లక్షల కోట్లు అవుతాయని లెక్క కట్టిన నమస్తే.. 30 సంవత్సరాలలో టోల్ చార్జీ రెట్టింపు అవుతుందనే విషయాన్ని విస్మరించడం విశేషం.
కాపాడేందుకు విఫల ప్రయత్నం
మనం చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం. చంద్రబాబు ప్రస్తావన లేకుంటే రాధాకృష్ణ చెలరేగిపోతాడు. అతడి జర్నలిజంలో ఉన్న బ్యూటీ అదే. ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో సరైన సమాచారంతోనే వార్త బరిలోకి దిగాడు. స్పష్టమైన ఆధారాలతో కెసిఆర్ ను ఇరుకున పెట్టాడు. తెలంగాణలో లాభం వచ్చే ప్రాజెక్టు ఏదైనా ఉందంటే అది ఔటర్ రింగ్ రోడ్డు మాత్రమేనని, తన రాజకీయ అవసరాల కోసం కేసీఆర్ దానిని ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాడని కుండబద్దలు కొట్టాడు. ఇలా రాధాకృష్ణ అవుటర్ రింగ్ రోడ్డు మీద వరుస కథనాలు ప్రచురించడంతో నమస్తే తెలంగాణ పసలేని వాదనకు దిగింది. కౌంటర్ ఇచ్చే పేరుతో దానికి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేసింది. ఆంధ్ర మీడియా అంటూ రంకెలు వేసింది. అన్నట్టు తెలంగాణ రాష్ట్ర సమితి కాస్త భారత రాష్ట్ర సమితి అయిన తర్వాత ఇంకా ఈ సెంటిమెంట్ రాజకీయాలు దేనికి? రాధాకృష్ణకు పొలిటికల్ ఇంట్రెస్ట్ లు ఉండవచ్చు గాక. కానీ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో అతడు రాసింది నూటికి నూరు పాళ్ళు నిజం. ఇదంతా కూడా అవినీతి మరక అని రాధాకృష్ణ కేసీఆర్ కు పూశాడు. అయితే ఇప్పుడు కెసిఆర్ దాన్ని కడుక్కునే పనిలో ఉన్నాడు.. కానీ మధ్యలో నమస్తే తెలంగాణ కెసిఆర్ ను శుద్ధపూసలాగా చిత్రీకరించేందుకు నానా తంటాలు పడింది. ఇదే క్రమంలో ఆంధ్రజ్యోతితో ఔటర్ రింగ్ రోడ్డు మీద పోరాటానికి దిగి బొక్కా బోర్లా పడింది.
నానా తంటాలు
ఇక ఔటర్ రింగ్ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్న సంస్థ ను వెనకేసుకొచ్చేందుకు నమస్తే తెలంగాణ నానా తంటాలు పడింది. కానీ ఈ రోడ్డును ఎందుకు ప్రైవేటుపరం చేస్తుందో చెప్పలేదు. పోనీ దీనివల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఏమైనా నష్టం ఉందా అంటే అదీ కూడా లేదు.. పోనీ నిర్వహణ పేరుతో ఏటా వందల కోట్లు ఖర్చు అవుతున్నాయా అంటే అదీ కూడా లేదు. కేవలం సర్కార్ వద్ద డబ్బులు లేక ఈ ఔటర్ రింగ్ రోడ్డును బేరం పెట్టింది. ఈ విషయాన్ని దాచలేక అడ్డగోలు వార్తలు రాసింది. అవి కేసీఆర్ క్యాంపును సంతోష పెట్టవచ్చు గాక.. కానీ అసలు విషయం జనాలకు ఎప్పుడో అర్థమైంది. తెలంగాణ ప్రజల కోసమే తాను చివరి ఊపిరి వరకు పోరాడుతా అని చెప్పే కేసిఆర్..ఇలా ఔటర్ రింగ్ రోడ్డును ప్రైవేటుపరం ఎలా చేశాడో అని ప్రతిపక్ష పార్టీ నాయకులు విమర్శిస్తుంటే.. అలా ప్రైవేట్ కంపెనీలకు కాంట్రాక్ట్ కు ఇవ్వడం మంచిదే అని నమస్తే తెలంగాణ సూత్రీకరించడం ఆశ్చర్యకరమే.