Prasada Reddy: విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy). ఈ ఎన్నికల్లో ఆయన గెలిచి ఉంటే విశాఖ నుంచి పాలన ప్రారంభించే వారు. అది కూడా తాను ముచ్చటపడి కట్టుకున్న రిషికొండ ప్యాలెస్ నుంచి. అయితే ఒక్క పాలనే కాదు అంతకుముందే విశాఖపట్నం పట్టు సాధించాలని చూశారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీకి రిజిస్ట్రార్ గా ఉన్న ప్రసాద్ రెడ్డి ని వైస్ ఛాన్స్లర్ గా నియమించారు. ఆంధ్ర యూనివర్సిటీకి ఎంతోమంది హేమాహేమీలు వీసీలుగా నియమించబడ్డారు. ఎన్నెన్నో సంస్కరణలను అమలు చేసి ఆంధ్ర యూనివర్సిటీని ప్రపంచంలోనే నిలబెట్టారు. అటువంటి యూనివర్సిటీకి అడ్డగోలుగా ప్రసాద్ రెడ్డి నియామకం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రసాద్ రెడ్డి నియామకం రాజకీయ కోణంలోనే జరిగిందనే ఆరోపణలు బలంగా వినిపించాయి. అందుకు తగ్గట్టుగానే ఆంధ్ర యూనివర్సిటీని వైసిపి కార్యాలయంగా మార్చేసారన్న విమర్శలు ప్రసాద్ రెడ్డి పై ఉన్నాయి. అప్పట్లో ఆయన కోర్టు తీర్పులను కూడా లెక్క చేయలేదు. ఇప్పుడు ఆ పాపం ఆయనను వెంటాడింది. నెల రోజులపాటు జైలు శిక్ష అనుభవించాలని ఆదేశించేదాకా వచ్చింది.
* వైసీపీ కార్యాలయంగా ఏయు!
ఆంధ్ర యూనివర్సిటీ( Andhra University) విశాఖ నగరం నడిబొడ్డున ఉంటుంది. అయితే 2021 విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైసిపి కార్యకలాపాలని ఏయూ నుంచి జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లో ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆయన సైతం తరచూ ఆంధ్ర యూనివర్సిటీకి వస్తూ వెళ్తూ ఉండేవారట. ఈ క్రమంలోనే అప్పట్లో వీసీగా ఉన్న ప్రసాద్ రెడ్డి విశాఖ నగరంలో వైసీపీ అభ్యర్థుల ఎంపిక కోసం పనిచేశారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఫలానా డివిజన్లో ఫలానా నేతకు టికెట్ ఇస్తే బాగుంటుంది అని.. ఏయూ విద్యార్థులతో సర్వేలు కూడా జరిపించారని అప్పట్లో ప్రత్యర్థులు ఆరోపించారు. కానీ అవేవీ ప్రసాద్ రెడ్డి పట్టించుకునే స్థితిలో లేకుండా పోయారు. ఐదేళ్లపాటు ఆంధ్రా యూనివర్సిటీకి వీసీగా కొనసాగారు. కూటమి వచ్చిన తర్వాత ఆయన పాపం పండింది. వీసీ పదవి నుంచి తొలగించారు.
* కోర్టు ధిక్కారం పై ఆగ్రహం..
అయితే ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ గా ప్రసాద్ రెడ్డి( Andhra University Vice Chancellor Prasad Reddy) ఉండే సమయంలో ఒక నిర్ణయంపై ఇప్పుడు జైలు శిక్ష పడింది. నెల రోజులపాటు జైలు శిక్షతో పాటు రెండు వేల జరిమానా విధిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆంధ్ర యూనివర్సిటీ సైన్స్ కాలేజీ బాటనీ విభాగంలో నూకన్న దొర అనే వ్యక్తి 17 సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తూ వచ్చారు. ప్రసాద్ రెడ్డి వీసీగా నియమితులైన తర్వాత నూకన్న దొరను విధుల నుంచి తొలగించారు. అయితే ఈ నిర్ణయం పై హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు నూకన్న దొర. అయితే ఈ నిర్ణయం తప్పు అని.. తిరిగి ఆయనను వీధుల్లో చేర్చుకోవాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే దీనిని అమలు చేయకుండా జాప్యం చేశారు ప్రసాద్ రెడ్డి. మరోవైపు నూకన్న దొర ప్రసాద్ రెడ్డి కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రసాద్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు తీర్పుపై సవాల్ చేస్తూ అప్పీల్ చేసుకోవాలే కానీ.. ఇలా ఉద్దేశపూర్వకంగా తీర్పును తొక్కి పెట్టడం ఏంటని ప్రశ్నించింది. దీనిని తీవ్ర నేరంగా పరిగణిస్తూ 2000 రూపాయల జరిమానా తో పాటు నెలరోజుల జైలు శిక్ష విధించింది. ఇదే తీర్పు పై ప్రసాద్ రెడ్డి సవాల్ చేసుకోవచ్చని కూడా ఈ నెల 22 వరకు సమయం ఇచ్చింది. కోర్టు స్టే ఇస్తే పర్వాలేదు కానీ.. లేకుంటే మాత్రం ఆయనకు జైలు శిక్ష తప్పేలా లేదు.