Vidadala Rajini : మాజీ మంత్రి విడదల రజిని ( Vidadala Rajini) చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఆమెకు ఇబ్బందులు తప్పవా? హైకోర్టు ఆదేశాలతో ఆమెపై కేసు నమోదు కావడం దేనికి సంకేతం? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విడుదల రజిని చుట్టూ వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఆమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండేవారు. ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలపై అనేక రకాల ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై కూటమి ప్రభుత్వం సైతం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అన్ని వివరాలు ఆరా తీస్తోంది. ఇటువంటి సమయంలో సామాన్య టిడిపి కార్యకర్త ఒకరు ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. రజిని మంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఆదేశాల మేరకు తనకు చిత్రహింసలు పెట్టారని ఫిర్యాదు చేశారు. విచారణకు స్వీకరించిన హైకోర్టు విడుదల రజినీతోపాటు ఆమె పీఏ లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశించింది. దీంతో ఈ విచారణ ఎంతవరకు వెళుతుందో అన్న ఆందోళన వైసిపి శ్రేణుల్లో ఉంది.
* గత ఐదేళ్లుగా దూకుడు
విడదల రజిని( Rajini) గత ఐదేళ్లుగా దూకుడుగా ఉండేవారు. అయితే అవి విమర్శల వరకే పరిమితం అయ్యేవారు. వ్యక్తిగత వివాదాల జోలికి వెళ్లేవారు కాదు. అయితే చిలకలూరిపేటలో టిడిపి కార్యకర్తలను వేధించారన్న ఆరోపణలు మాత్రం ఆమెపై ఉన్నాయి. ఈ క్రమంలో పిల్లి కోటి అనే టిడిపి కార్యకర్త సోషల్ మీడియాలో.. అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని పోస్టులు పెట్టారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టినట్లు బాధితులు చెబుతున్నాడు. అయితే అప్పట్లో దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయిందని.. అందుకే తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. కోర్టు ఆదేశాలతో మాజీమంత్రి విడుదల రజిని పై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు తనకు జరిగిన అన్యాయంపై జిల్లా ఎస్పీని కలిసి స్వయంగా వివరించారు కోటి. దీంతో కేసు విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు.
* అనుచరుల్లో ఆందోళన
అయితే ఒక సామాన్య కార్యకర్త ఫిర్యాదు మేరకు పోలీస్ విచారణ( police enquiry) జరుగుతుండడంతో రజిని అనుచరుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఇప్పటికీ ఆమె నిర్వర్తించిన శాఖలో లోపాలపై ఫిర్యాదులు ఉన్నాయి. వాటిపై విచారణ జరుగుతుందనుకుంటే.. ఎప్పటిదో పాత కేసును తిరగ దోడడంపై అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రజిని చుట్టూ ప్రభుత్వం ఉచ్చు బిగిస్తున్నట్లు ప్రచారం ప్రారంభమైంది. అయితే గత కొంతకాలంగా విడదల రజిని సైలెంట్ గా ఉన్నారు. పొలిటికల్ గా కూడా పెద్దగా యాక్టివ్ గా లేరు. మీడియా ముందు కూడా కనిపించడం లేదు.
* జనసేనలో చేరతారని ప్రచారం
వాస్తవానికి విడదల రజిని జనసేనలో( janasena ) చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. 2019 ఎన్నికలకు ముందు టిడిపి నుంచి అనుహ్యంగా వైసీపీలో చేరారు రజిని. చిలకలూరిపేట వైసిపి టికెట్ దక్కించుకున్నారు. భారీ విజయం సాధించారు. అయితే తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినా.. విస్తరణలో ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. తనదైన రీతిలో దూకుడుగా వ్యవహరించేవారు. అయితే చిలకలూరిపేటలో సొంత పార్టీ శ్రేణులే వ్యతిరేకించడంతో ఆమెను.. గుంటూరు వెస్ట్ సీటుకు షిఫ్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల్లో అక్కడ నుంచి పోటీ చేసిన రజినీకి ఓటమి తప్పలేదు. అయితే ఇటీవలే చిలకలూరిపేట ఇన్చార్జి పోస్టును తిరిగి ఇచ్చారు రజనీకి జగన్ మోహన్ రెడ్డి. వైసీపీలో ఆమె యాక్టివ్ అవుతారని అంతా భావించారు. ఇంతలోనే ఈ కేసులు మెడకు చుట్టుకోవడంతో ఆమె ఆందోళనకు గురవుతున్నట్లు తెలుస్తోంది. అయితే అవన్నీ తప్పుడు కేసులని.. న్యాయస్థానంలో తనదే విజయం అని చెబుతున్నారు రజిని. చూడాలి మరి ఏం జరుగుతుందో?