AP Rains : ఏపీకి భారీ వర్ష సూచన. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండం గా మారింది.ఈరోజు తుఫాన్ గా రూపాంతరం చెందింది. కొద్ది రోజుల కిందట బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిన సంగతి తెలిసిందే. అది కాస్త అల్పపీడనంగా మారి వాయుగుండం గా రూపాంతరం చెందింది. తరువాత తుఫాన్ గా తీరం దాటనుంది. ప్రస్తుతం ఉత్తర వాయువ్య దిశగా తమిళనాడు వైపు కదులుతోంది. దీని ప్రభావంతో ఏపీవ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా మారింది.ఆకాశం మేఘవృతం అయింది.ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు మత్స్యకారులు వేటకు దూరమయ్యారు.దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. ఉత్తర కోస్తాలో సైతం వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడే ఛాన్స్ కనిపిస్తోంది.
* తీరం దాటడం పై స్పష్టత లేదు
అయితే తుఫాను తీరం దాటే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. తమిళనాడు శ్రీలంక తీరాల వైపు తుఫాను కదులుతోంది. ముఖ్యంగా దక్షిణ కోస్తాలో పరిస్థితి తీవ్రంగా ఉంటుంది. తీరం వెంబడి గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాయుగుండం ప్రభావంతో సముద్రంలో అలజడి నెలకొంది.కోస్తా తీరం వెంబడి ఒకటో నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. శుక్రవారం వరకు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని సూచించారు.
* రైతుల్లో ఆందోళన
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.ఒకవైపు వరి కోతలు జరుగుతున్నాయి. ఇంకో వైపు రబీలో భాగంగా సాగు పనులు చేపడుతున్నారు. ఇంతలోనే వర్ష హెచ్చరికలతో ఆందోళన చెందుతున్నారు రైతులు. మరోవైపు రోజుల తరబడి ఉపాధికి దూరం కావడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.