https://oktelugu.com/

Fengal Cyclone : తుఫాను పంజా..భారీ వర్షాలు.. ఏపీకి హై అలెర్ట్

ఫెంగల్ తుఫాను వణుకు పుట్టిస్తోంది. బంగాళాఖాతంలో స్థిరంగా కొనసాగుతోంది. అయితే ఏపీ కంటే తమిళనాడు పైనే అధికంగా ప్రభావం చూపుతోంది. దీంతో రాష్ట్ర ప్రజల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

Written By: , Updated On : November 30, 2024 / 01:28 PM IST
Fengal Cyclone

Fengal Cyclone

Follow us on

Fengal Cyclone :  బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ రెండు రాష్ట్రాలతో పాటు ఓ కేంద్రపాలిత ప్రాంతం పై ప్రభావం చూపుతోంది. ప్రధానంగా తమిళనాడు పై పంజా విసురుతుంది. ఏపీతో పాటు పుదుచ్చేరిలో అల్లకల్లోలం రేగుతోంది. గత రెండు రోజులుగా తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడుతున్నాయి.చెన్నై తో సహా రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా తమిళనాడు ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించింది.బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా మారింది. భారీ తుఫాన్ గా బంగాళాఖాతంలోనే కేంద్రీకృతమై ఉంది. ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటల సమయానికి ఈ తుఫాన్ నైరుతి బంగాళాఖాతంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. పుదుచ్చేరికి ఈశాన్య దిశగా 150, చెన్నైకి 140, నాగపట్నానికి 210, శ్రీలంకలోని టీం కోమలికి 400 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై కనిపిస్తోంది. ఈరోజు మధ్యాహ్నం తమిళనాడులోని ఉత్తర ప్రాంతం, పుదుచ్చేరి తీరం సమీపంలో తీరం దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

* విశాఖలో వర్షం
వాస్తవానికి తుఫాను ప్రభావం ఏపీ పై కూడా ఉంటుందని అంచనా వేశారు. ప్రధానంగా రాయలసీమతో పాటు దక్షిణ కోస్తా లో భారీ వర్షాలు కురుస్తాయని భావించారు. ముఖ్యంగా చిత్తూరు తో పాటు నెల్లూరులో వర్షాలు పడతాయని అంచనా వేశారు. అయితే ఊహించినంతగా కాకున్నా.. ఏపీలో చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉత్తరాంధ్రలో తుఫాన్ ప్రభావం కనిపించింది. తీరానికి చేరువగా ఉన్న జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. విశాఖపట్నంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ప్రధానంగా విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం, అగనంపూడి, హనుమంతు వాక, ఎంవిపి కాలనీ, గోపాలపట్నం, ఆర్కే బీచ్, బోయపాలెం, కాపులుప్పాడ, మద్దిలపాలెం, సీతమ్మ ధారా వంటి ప్రాంతాల్లో వర్షం కురిసింది.

* భారీ ఈదురుగాలులు
మరోవైపు తీరం గుండా ఈదురు గాలులు వీస్తున్నాయి. ఒకటో ప్రమాద హెచ్చరిక ఎగురవేయడంతో మత్స్యకారులు వేటకు వెళ్ళలేదు. తీరానికి పరిమితం అయ్యారు.అటు రాష్ట్రవ్యాప్తంగా చల్లటి వాతావరణం కొనసాగుతోంది.కొన్ని ప్రాంతాల్లో అయితే రోజంతా చిరుజల్లులు పడుతూనే ఉన్నాయి.ప్రస్తుతం రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి.సరిగ్గా ఇటువంటి సమయంలోనే వర్షాలు పడుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ తుఫాను ప్రభావం ఏపీ కంటే తమిళనాడు పైనే అధికంగా కనిపిస్తోంది. ఏపీకి ముప్పు తప్పినట్లేనని టాక్ వినిపిస్తోంది.