TGPSC Chairman : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రెండేళ్ల క్రితం తీవ్రమైన అప్రతిష్ట మూటగట్టుకుంది. పరీక్షల నిర్వహణలో విఫలమైంది. ప్రశ్నపత్రాల లీకేజీ అరికట్టలేకపోయింది. ఈ నేపథ్యంలో 2023 డిసెంబర్‌లో అధికారం చేపట్టిన రేవంత్‌రెడ్డి.. టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశారు. టీఎస్‌పీఎస్సీగా ఉన్న పేరును టీజీ పీఎస్సీగా మార్చారు. కొత్త చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని నియమించారు. కమిటీ సభ్యులను కూడా ప్రభుత్వ సూచన మేరకు గవర్నర్ నియమించారు. ప్రస్తుత చైర్మన్ మహేందర్‌రెడ్డి పదవీకాలం డిసెంబర్ 3న ముగియనుంది. ఈ నేపథ్యంలో నూతన చైర్మన్ కోసం ప్రభుత్వం కసరత్తు చేసింది. చిరవకు బుర్రా వెంకటేశం పేరును గవర్నర్ ఆమోదం కోసం పంపించింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈమేరకు ఆమోదం తెలిపారు. దీంతో నూతన చైర్మన్‌గా డిసెంబర్ 3 తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. తెలంగాణ తొలి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్‌గా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన గంటా చక్రపాని పనిచేశారు తర్వాత జనార్దన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈయన హయాంలోనే ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి.
బీసీకి ఛాన్స్…
తెలంగాణ పబ్లిక్ కమిషన్ చైర్మన్ ఎస్సీ సామాజికవర్గానికి ఇవ్వగా, తర్వాత రెడ్డి సామాజికవర్గానికి దక్కింది. వీటిని దృష్టిలో పెట్టుకుని రేవంత్‌రెడ్డి సర్కార్.. ఈసారి బీసీ సామాజికవర్గానికి చెందిన బుర్రా వెంకటేశంను చైర్మన్‌గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈయన నాలుగేళ్లు ఈ పదవిలో ఉంటారు.
45 అప్లికేషన్లు…
టీజీపీఎస్సీ చైర్మన్ పదవి కోసం నవంబర్ 20 నోటీఫికేషన్ విడుదలైంది. అదేరోజు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. చైర్మన్ పదవి కోసం మొత్తం 45 దరఖాస్తులు వచ్చాయి. అందులో రిటైర్డ్ ఐఏఎస్‌లతోపాటు వివిధ యూనివర్సిటీల ప్రొఫెసర్లు దరఖాస్తు చేసుకున్నారు. వీటిని స్క్రూటిని చేసిన ప్రభుత్వం చివరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా పనిచేస్తున్న బుర్ర వెంకటేశంను ఎంపిక చేసింది. దీంతో ఆయన ప్రస్తుతం ఉన్న పదవికి రాజీనామా చేయనున్నారు. ఈమేరకు ఇపపటికే వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనికి ప్రభుత్వం ఆమోదించింది.
ఎవరీ వెంకటేశం..
బుర్రా వెంకటేశ్ 1969, జనవరి 10న జంగం గ్రామంలో జన్మించారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో పుట్టిన ఆయన.. వారి కుటుంబంలో ఉన్నత చదువులు చదివిన మొదటి వ్యక్తి. 1989లో హైదరాబాద్‌లోని అంబేద్కర్‌కాలేజ్‌లో బీఏ పూర్తి చేశారు. 1992లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. 1995లో తెలంగాణ కేడర్ ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 2005 నుంచి 2008 వరకు మెదక్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. మెదక్‌కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. ఇక 2014లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ మొహంతి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ కోసం నియమించిన ముగ్గురు ఐఏఎస్ అధికారుల కమిటీలో బుర్ర వెంకటేశం ఒకరు. పునర్‌వ్యవస్థీకరణ చట్టం అమలు కోసం వ్యవసాయం, ఉద్యానవనం, సెరీ కల్చర్, పౌర సరఫరాలు, పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమ అభివృద్ధి, వెనుకబడిన కులాల సంక్షేమం, మైనారిటీల సంక్షేమం, సాంఘిక సంక్షమ, గిరిజన సంక్షేమ, రెయిన్ షాడో ఏరియా డెవవలప్‌మెంట్ సెక్రటేరియట్ విభాగాల్లో సేవలు అందించారు. 2015లో తెలంగాణ యువన అభ్యున్నతి, పర్యాటకం, సంస్కృతి విభాగానికి కార్యదర్శిగా నియమితులయ్యారు. 2023, డిసెంబర్‌లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా నియమితులయ్యారు.