AP Rains: ఏపీకి మరో ముప్పు.. 11 జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారుతోంది. ఏపీ పై ప్రభావం చూపడం ప్రారంభించింది.ముఖ్యంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడుతుండడంతో ఆందోళన నెలకొంది. దీంతో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో అధికారులు అలెర్ట్ అయ్యారు. విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

Written By: Dharma, Updated On : September 9, 2024 9:05 am

AP Rains

Follow us on

AP Rains: ఏపీకి మరో ముప్పు. వరద ప్రభావం నుంచి కోలుకోకముందే మరో ప్రమాదం పొంచి ఉంది.బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో గత రెండు రోజులుగా ముసురు వాతావరణం ఉంది. రానున్న 48 గంటల్లో ఉత్తర కోస్తాలో అత్యంత భారీ వర్షాలు, దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ స్పష్టం చేసింది. రాయలసీమలోనూ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు.అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు. విజయవాడ వరదలతో పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం జరిగింది. 45 మంది వరకు మృత్యువాత పడ్డారు. దాదాపు 16 జిల్లాల్లో 5.15 లక్షల ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లింది. కృష్ణానది రికార్డు స్థాయిలో ప్రవహించింది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి తీవ్రత అధికంగా ఉండి.మొన్నటి వరదలకు ఏలూరు,ఎన్టీఆర్, కృష్ణా,గుంటూరు,బాపట్ల, పల్నాడు,ప్రకాశం జిల్లాలు సైతం మూల్యం చెల్లించుకున్నాయి.

* వర్షాలు ప్రారంభం
వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు ప్రారంభమయ్యాయి. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళి నదులకు వరద పెరిగే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతాల్లోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు,ఎస్పీలు,ఇతర ఉన్నతాధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు.

* ఐదు జిల్లాలపై పెను ప్రభావం
ప్రధానంగా ఈ వాయుగుండం ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు గోదావరి జిల్లాల పైన ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. దీంతో రాష్ట్రంలోని 11 జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు ఎక్కడికక్కడే సెలవులు ప్రకటించారు.వర్షాలు, వరదల ప్రభావం తక్కువగా ఉన్న చోట మినహాయించి.. మిగతా జిల్లాల్లో సెలవులు అమలు చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా అధికారులు నిర్ణయం తీసుకుంటున్నారు.మొన్న గుంటూరు జిల్లాల్లో కారు గల్లంతయి ఒక ఉపాధ్యాయుడితో పాటు ఇద్దరు విద్యార్థులు మృతి చెందిన సంగతి తెలిసిందే.

* సెలవులు ప్రకటించిన జిల్లాలు ఇవే
ఇప్పటివరకు రాష్ట్రంలో సెలవులు ప్రకటించిన జిల్లాల్లో విజయనగరం, శ్రీకాకుళం,విశాఖపట్నం,అనకాపల్లి,కాకినాడ,పార్వతీపురం మన్యం,అల్లూరి సీతారామరాజు,పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలు ఉన్నాయి.ఎన్టీఆర్ జిల్లాలోని ముంపు ప్రాంతాలు, పునరావాస కేంద్రాలు ఉన్నచోట కూడా సెలవులు కొనసాగిస్తున్నారు. బాపట్ల జిల్లాలోని కొన్ని మండలాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. విజయవాడ వరదలు నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో ఈ వారం మొత్తం విద్యాసంస్థలు మూత పడ్డాయి.