AP Rain Alert: తెలుగు రాష్ట్రాలకు( Telugu States ) భారీవర్ష సూచన. వర్షాలు ఇప్పట్లో వీడే పరిస్థితి కనిపించడం లేదు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడనుంది. శనివారం ఉదయానికి తీరం దాటనుంది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం చెబుతోంది. అయితే ఈ వాయుగుండం ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉండనుంది. ఇప్పటికే భాగ్యనగరంలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
* ఈ జిల్లాలకు హెచ్చరిక..
ఏపీకి ఈరోజు భారీ వర్ష సూచన ఉంది. ప్రధానంగా ఏలూరు( Eluru), ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే సముద్రం అల్లకల్లోలంగా మారింది. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని అధికారులు సూచిస్తున్నారు. ఆదివారం వరకు మత్స్యకారులు తీరానికే పరిమితం కానున్నారు. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా రణస్థలం లో అత్యధిక వర్షపాతం నమోదు అయింది. 89.7 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.
* చురుగ్గా రుతుపవనాలు..
వాస్తవానికి ఈనెల 17 నాటికి నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తాయని వాతావరణ శాఖ చెప్పింది. కానీ రుతుపవనాల కదలిక చురుగ్గా ఉండడంతో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడడానికి అనుకూలమైన వాతావరణం కలిగింది. దీంతో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. తీవ్ర వాయుగుండం గా మారితే ఉత్తరాంధ్రకు పెనుముప్పు తప్పదు. అందుకే ఏపీ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. విపత్తుల నిర్వహణ సంస్థ వర్ష బాధిత జిల్లాలను ప్రత్యేకంగా అప్రమత్తం చేసింది. ముందస్తు హెచ్చరికలు జారీచేసింది.