Andhra Pradesh: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.జూన్ లో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాలేదు. దీంతో వాతావరణం వేసవిని తలపిస్తోంది. ఖరీఫ్ పై సైతం నీలి నీడలు కమ్ముకున్నాయి. ఈ తరుణంలో శుభవార్త చెప్పింది వాతావరణ శాఖ. జూలై నెలలో సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని స్పష్టం చేసింది. బంగాళాఖాతంలో ఏకంగా మూడు అల్పపీడనాలు ఏర్పడుతాయని అంచనా వేసింది. ఏపీకి తీవ్ర వర్ష సూచన ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చింది.దీంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.
ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఆవహించి ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, పిడుగులు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలో వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం,చిత్తూరు,శ్రీకాకుళం, విజయనగరం, కృష్ణా, తిరుపతి, నంద్యాల, శ్రీ సత్య సాయి, అన్నమయ్య జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.
ప్రస్తుతం అరేబియా సముద్రంలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వాటి ప్రభావం కూడా ఏపీపై ఉంటుందని చెబుతోంది. రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవనున్నాయని అంచనా వేస్తోంది. రాగల మూడు రోజుల్లో వర్షాలు ఊపందుకుంటాయని స్పష్టం చేసింది. ఈనెల 10 వరకు వర్షాలు కొనసాగున్నాయి. ఇప్పటికే అల్పపీడనానికి తోడు 15న మరో అల్పపీడనం, 23న ఇంకో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. 23న ఏర్పడే అల్పపీడనం బలహీనపడి వాయుగుండంగా మారుతుందని.. దీని ప్రభావంతో భారీ వర్షపాతం నమోదు అవుతుందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తద్వారా జూలైలో సాధారణ వర్షపాతం నమోదు కావడం ఖాయమని చెబుతోంది.