Srikakulam: ఆర్మీలో( Indian Army) 22 ఏళ్ల పాటు విధులు నిర్వహించాడు ఆయన. వివిధ హోదాలో పనిచేశాడు. చివరికి లాన్స్ నాయక్ గా పదవీ విరమణ చేశారు. జనవరి 31న రిటైర్ అయ్యారు. విజయ గర్వంతో స్వగ్రామానికి బయలుదేరిన ఆ సిపాయి గుండె ఆగిపోయింది. ఈ విషాద ఘటన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా లక్ష్మీ నర్సు పేట మండలం బొర్రంపేటకు చెందిన కాగితాపల్లి వెంకటరమణ( Kag ita Palli Venkataramana) ఆర్మీలో జనవరి 31న పదవీ విరమణ చేశారు. సికింద్రాబాద్ నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. రైల్వే స్టేషన్ కు రాగా గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు గమనించేసరికి మృతి చెందారు.
* 2003లో తొలి పోస్టింగ్
కాగితాపల్లి వెంకటరమణ 2003లో ఆర్మీలో( Indian Army ) చేరారు. సాధారణ సిపాయిగా ఎంపికయ్యారు. ఓ సాధారణ కుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆర్మీకి ఎంపిక కావడంతో తల్లిదండ్రుల్లో ఆనందం వెల్లివిరిసింది. గ్రామస్తులతో పాటు స్నేహితులు కూడా ఎంతగానో ఆనందించారు. ఆర్మీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ వచ్చారు వెంకటరమణ. చివరిసారిగా లాన్స్ నాయక్ గా పదోన్నతి పొందారు. ఆ హోదాలోనే ఉండగా జనవరి 31న సికింద్రాబాద్ ఆర్మీ కార్యాలయంలో పదవీ విరమణ చేశారు. స్వగ్రామానికి వచ్చేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ఇంతలోనే గుండెపోటుకు గురయ్యారు. ప్రాణాలను వదిలారు.
* గ్రామంలో విషాదం
అయితే వెంకటరమణ( Venkataramana ) పదవీ విరమణతో స్వగ్రామానికి వస్తుండడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ప్రత్యేక స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని భావించారు. కానీ ఇంతలోనే పిడుగు లాంటి వార్త వచ్చింది. వెంకటరమణ చనిపోయాడు అన్న వార్తతో వారంతా విషాదంలో మునిగిపోయారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తూ కుటుంబ సభ్యులు హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. మృతదేహాన్ని చూసి స్నేహితులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఉద్యోగ విరమణ తర్వాత గ్రామంలో హాయిగా ఉందామని చెప్పారని.. ఇంతలోనే ఈ విషాదం జరిగిందని భార్య పద్మావతి గుండెలవిసేలా రోదిస్తోంది. వెంకటరమణ కు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. తల్లిదండ్రులైన వృద్ధ దంపతులు కూడా ఉండడంతో వారి బాధ వర్ణనాతీతం. ఈరోజు వెంకటరమణ అంత్యక్రియలు గ్రామంలో అశ్రునయనాల నడుమ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.