Srikakulam Venkateswara Swamy Temple: శ్రీకాకుళం జిల్లా( Srikakulam district) కాశిబుగ్గ ఆలయ ఘటనకు సంబంధించి స్థానికంగా కలకలం రేగింది. అయితే ఈ ఆలయానికి సంబంధించి ఆసక్తికర కథనాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. పేద భక్తుల కోసం హరి ముకుంద పండా అనే 95 ఏళ్ల వృద్ధుడు తన సొంత డబ్బులతో ఆలయాన్ని నిర్మించాడు. గత మే నుంచి ఆలయంలో దర్శనాలు ప్రారంభం అయ్యాయి. దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ సొంత ఆలయం నిర్మించడం విశేషం. గత ఏడాదిగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుండగా.. ఈరోజు కార్తీక ఏకాదశి కావడంతో ఒక్కసారిగా పోటెత్తారు. దీంతో ఈ విషాద ఘటన జరిగింది.
తిరుపతిలో ఇబ్బందికరం..
ఒడిస్సా రాజ కుటుంబానికి చెందిన హరి ముకుంద పండా( Hari Mukunda Panda) అనే 95 సంవత్సరాల వృద్ధుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఆయన తల్లి శతాధిక వృద్ధురాలు. వెంకటేశ్వర స్వామి భక్తురాలు. హరి ముకుంద పండా ఓసారి తిరుమల వెళ్లారు. కానీ అక్కడ దర్శనం వీలు కాలేదు. అయితే తనలాంటి వ్యక్తులకే ఆ పరిస్థితి అంటే.. సామాన్య భక్తుల పరిస్థితి ఏంటని ఆలోచించారు. తిరుమలలో తనను క్యూ లైన్ నుంచి పక్కకు తోసేయడాన్ని అవమానంగా భావించారు. తనకు ఎదురైన అనుభవాన్ని జీర్ణించుకోలేని హరి ముకుంద పండా కాశీబుగ్గలోని తన తోటలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించాలని భావించాడు. 2018లో ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించి.. 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేయగలిగాడు. గత ఏడాది నుంచే భక్తుల దర్శనాలకు అనుమతిస్తున్నారు.
విశేష ప్రాచుర్యం..
ఈ ప్రాంతంలో చిన తిరుపతిగా( Chinna Tirupati) పేరుగాంచింది ఈ ఆలయం. ఆపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కావడంతో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇటీవల భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ ప్రాంతంలో కార్తీక మాసం అంటే విపరీతమైన భక్తి భావం ఉంటుంది. ఈ క్రమంలోనే కార్తీక ఏకాదశి కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. ముఖ్యంగా మహిళా భక్తులు పోటెత్తారు. వీరిని నియంత్రించేందుకు తగిన సిబ్బంది, సేవకులు లేరు. అయితే ఈ ఆలయ సామర్థ్యం 3,000 మంది భక్తులు కాగా.. 25వేల మంది భక్తులు వచ్చినట్టు అంచనా వేస్తున్నారు. ఒకేసారి రావడంతోనే ఈ ఘటన జరిగినట్లు స్పష్టమవుతోంది.
సొంత నిధులతో నిర్మించడంతో..
దాదాపు 10 కోట్ల రూపాయలతో ఈ ఆలయాన్ని సొంతంగానే నిర్మించారు. అయితే కేవలం పేద, సామాన్య భక్తుల కోసం నిర్మించినట్లు చెబుతున్నారు. అయితే ఆలయ నిర్మాణంలో ఇంజనీరింగ్ నిపుణుల సలహాలు తీసుకోలేదని తెలుస్తోంది. కానీ ఇతర రాష్ట్రాలకు చెందిన శిల్పకారులు ఎక్కువగా పనిచేశారు. అయితే హరి ముకుంద పండా తల్లి విష్ణుప్రియ విష్ణుప్రియ శతాధిక వృద్ధురాలు. ఆపై వాస్తు శాస్త్ర నిపుణురాలుగా మంచి పేరు ఉంది. ఆమె సలహా సూచనలతోనే ఆలయ నిర్మాణం జరిపినట్లు సమాచారం. అయితే ఇరుకు ద్వారం గుండా ప్రవేశం కల్పించడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హరి ముకుంద పంట నిర్వహణలోనే ఆలయం ఉంది. ఎటువంటి లాభాపేక్ష లేకుండా సొంత ఖర్చులతో ఈ ప్రాంతీయుల కోసం ఆలయ నిర్మాణం జరగడంతో.. ప్రభుత్వం ఆలయ నిర్వహణపై దృష్టి పెట్టలేదు. కానీ సామాన్య భక్తులకు తిరుమల దర్శనం మాదిరిగా ఆలయ నిర్మాణం చేపట్టడంతో ఈ ప్రాంతీయులు ఎంతగానో ఆనందించారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.