GVL Narasimha Rao: ఎన్నికల్లో విశాఖ ఎంపీ టికెట్ను ఆశించారు జీవీఎల్ నరసింహారావు. కానీ ప్రో వైసీపీ అన్న ముద్ర వేసి ఆయనకు టికెట్ రాకుండా చేశారన్న కామెంట్స్ వినిపించాయి. ఒక్క జీవీఎల్ కాదు.. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి లాంటి నేతలకు ఎన్నికల్లో ఛాన్స్ దక్కలేదు. ఆది నుంచి వీరు టిడిపి తో పొత్తు వ్యతిరేకించడమే అందుకు కారణంగా తెలుస్తోంది. అయితే పొత్తులో భాగంగా బిజెపి 10 అసెంబ్లీ, ఆరు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నా బిజెపి అగ్ర నేతలుగా చలామణి అవుతున్న చాలామంది నాయకులు కనిపించడం లేదు. అసలు ఎన్నికల ప్రచారం చేయడం లేదు. కనీసం స్పందించిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఇటువంటి సమయంలో జీవీఎల్ నరసింహం ప్రెస్ మీట్ పెట్టారు. ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రంలో బిజెపి పొత్తులతో ముందుకెళ్తుందన్న సంకేతాలు వచ్చిన నాటి నుంచి.. జివిఎల్ విశాఖకు మకాం మార్చారు. తరచూ కార్యక్రమాలు నిర్వహించేవారు. విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలో పర్యటనలు చేసేవారు. దీంతో జివిఎల్ విశాఖ ఎంపీగా పోటీ చేస్తారని బలంగా ప్రచారం జరిగింది. అటు చాలా సందర్భాల్లో జీవీఎల్ సైతం ఇదే విషయాన్ని ప్రకటించారు. తన మనసులో ఉన్న మాటను బయటపెట్టారు. అయితే జీవీఎల్ కు టికెట్ దక్కలేదు. పొత్తులో భాగంగా విశాఖ సీటును టిడిపి తీసుకుంది. కనీసం రాజమండ్రి కానీ, అనకాపల్లి కానీ జీవీఎల్ కు దక్కుతుందని అంతా భావించారు. ఆ రెండు సీట్లను పురందేశ్వరి, సీఎం రమేష్ తీసుకున్నారు. అప్పటినుంచి జివిఎల్ సైలెంట్ అయ్యారు. చివరి నిమిషం వరకు టికెట్ కోసం ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా జీవీఎల్ మీడియా ముందుకు వచ్చారు. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో సీఎం జగన్ ఉండాలా? లేదా? అన్న ఫ్యాక్టర్ పైనే ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ఏపీలో ఎన్డీఏ కి 110 కి పైగా అసెంబ్లీ సీట్లు, 18 నుంచి 20 పార్లమెంట్ సీట్లు వస్తాయని తమ పార్టీ అంతర్గత సర్వేలో తేలిందని జివిఎల్ స్పష్టం చేశారు. తెలంగాణలో బిజెపికి తొమ్మిది నుంచి పది స్థానాలు వస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఏపీలో బిజెపికి ఐదు ఎంపీ తో పాటు ఐదు అసెంబ్లీ స్థానాలు లభిస్తాయని జీవీఎల్ తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే అసంతృప్తితో ఉన్న జీవీఎల్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు నిజమా? లేకుంటే వ్యూహంలో భాగంగా చేశారా? అన్నది తెలియాల్సి ఉంది.