Posani Krishna Murali Arrest: పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali) అరెస్ట్ డైవర్షన్ లో భాగమా? జీవి రెడ్డి ఎపిసోడ్ తో రేగిన వివాదాన్ని చల్లారిచే ప్రయత్నమా? అసలు పోసాని అరెస్టును ఏ విధంగా తీసుకోవాలి? నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని ప్రకటించిన తర్వాత కూడా ఎందుకు అరెస్టు చేశారు? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే ఆసక్తికర చర్చ. ఇటీవల ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు జీవీ రెడ్డి. తెలుగుదేశం పార్టీ పదవులు కూడా వదులుకున్నారు. అయితే జీవి రెడ్డి వ్యవహారంలో టిడిపి హై కమాండ్ వ్యవహరించిన తీరును తప్పుపడుతున్నారు పార్టీ శ్రేణులు. ఇటువంటి సమయంలోనే పోసాని కృష్ణ మురళి అరెస్టు జరగడం విశేషం.
Also Read: పోసాని వర్సెస్ ఏపీ పోలీసులు.. అరెస్టుకు ముందు మై హోమ్ భుజ లో ఏం జరిగిందంటే?
* క్షమించినట్లు వార్తలు
అసలు పోసాని కృష్ణ మురళిని( Posani Krishna Murali ) కూటమి ప్రభుత్వం క్షమించేసిందని వార్తలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత పోసాని కృష్ణ మురళి బయటకు వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డిని కీర్తించారు. సాక్షి ఛానల్ లో ప్రత్యేక కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు. అందుకు సంబంధించి ప్రోమో కూడా విడుదల చేశారు. అయితే ఉన్నట్టుండి పోసాని కృష్ణ మురళి తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఇకనుంచి రాజకీయాలు మాట్లాడనని కూడా చెప్పుకున్నారు. వీలైనంతవరకు కూటమి ప్రభుత్వంతో తనకు ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని భావించారు.
* అప్పట్లో ఆ భయంతో
ఏపీవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ సోషల్ మీడియా ప్రతినిధులతో పాటు పలువురు సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. అరెస్టులు కూడా జరిగాయి. అప్పుడే పోసాని కృష్ణ మురళి ఆ సంచలన ప్రకటనలు చేశారు. అయితే ఇన్ని నెలలు పోసాని విషయంలో ఊరుకున్న కూటమి ప్రభుత్వం ఇప్పుడే పావులు కదపడానికి మాత్రం జీవి రెడ్డి కారణమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫైబర్ నెట్ వివాదంలో జీవి రెడ్డి రాజీనామా టిడిపి నాయకత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టింది. గత ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి విషయంలో.. నాయకత్వం అలా వ్యవహరించడం తగదన్న కామెంట్స్ వినిపించాయి. దీంతో టీడీపీ నాయకత్వంలోనే ఒక రకమైన ఆందోళన ప్రారంభమైంది.
* జీవీ రెడ్డి టిడిపిలోకి రీఎంట్రీ
జీవీ రెడ్డి (GV reddy ) ఎపిసోడ్లో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని ప్రభుత్వం భావించింది. జీవి రెడ్డిని మళ్ళీ టిడిపిలోకి తెచ్చి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని కూడా ప్రచారం ప్రారంభమైంది. అయితే అందుకు జీవి రెడ్డి ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఇప్పటికి ఇప్పుడు పార్టీలోకి వచ్చి ఎమ్మెల్సీ పదవి తీసుకుంటే క్యారెక్టర్ పై మచ్చ పడుతుందని.. అందుకే నిర్ణయం తీసుకోలేనని జీవీ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. అయితే ఈ వివాదానికి పుల్ స్టాప్ పడాలంటే మరో వివాదం అవసరం. అందుకే మరుగునపడిన పోసాని కృష్ణ మురళి కేసులను బయటపెట్టినట్లు తెలుస్తోంది. అరెస్టు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
Also Read: ఆ బూతులే పోసాని అరెస్ట్ కు కారణమయ్యాయా? కూటమి కక్షగట్టి లోపలేసిందా?