Guntur YCP: ఇటీవల గుంటూరు నగరపాలక సంస్థను( Guntur Municipal Corporation) కూటమి కైవసం చేసుకుంది. అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన బలం ఉంది. అయినా సరే అక్కడ మేయర్ పీఠం ఆ పార్టీకి చేజారిపోయింది. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అదే మింగుడు పడడం లేదట. కనీసం సంఖ్యాబలంగా దరిదాపుల్లో లేని టిడిపి ఇక్కడ గెలవడం ఏమిటనేది వైసీపీ నుంచి వినిపిస్తున్న మాట. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఓ కట్టప్ప దయతోనే ఇదంతా జరిగిందన్న అనుమానాలు ఉన్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పోస్టుమార్టం లో సైతం ఇదే తేలినట్లు తెలుస్తోంది. కేవలం కేసులకు భయపడి సదరు కట్టప్ప రాజీనామా తోనే ఇదంతా జరిగినట్లు సమాచారం.
Also Read: సాక్షిలో కనిపించని అమరావతి ప్రకటనలు!
* అసాధారణ మెజారిటీతో..
2021 లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గుంటూరు నగరపాలక సంస్థను ఏకపక్షంగా కైవసం చేసుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ( YSR Congress party ). 57 డివిజన్లకు గాను 47 డివిజన్లో సూపర్ విక్టరీ కొట్టింది. కావటి మనోహర్ నాయుడు మేయర్ గా ఎంపికయ్యారు. ఆయన మేయర్ గా ఉండగానే చిలకలూరిపేట వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేశారు. ఆయన ఓడిపోవడం ఏ కాకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. అయితే ఎన్నికలకు ముందు కొందరు కార్పొరేటర్లు టిడిపిలో చేరారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మరికొందరు చేరారు. అయినా సరే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అక్కడ స్పష్టమైన బలం ఉంది. కనీసం అవిశ్వాస తీర్మానం పెట్టిన లొంగని కార్పొరేటర్లు ఉన్నారు. అటువంటి నగరపాలక సంస్థను టిడిపి కైవసం చేసుకోవడం మాత్రం నిజంగా విచిత్రమే.
* అకస్మాత్తుగా రాజీనామా..
ఒకరోజు అకస్మాత్తుగా మేయర్ కావటి మనోహర్ నాయుడు( kahavatti Manohar Naidu ) మీడియా ముందుకు వచ్చారు. మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నగరపాలక సంస్థ కమిషనర్ తీరుతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అయితే విచిత్రంగా కమిషనర్ పేరు చెప్పి ఆయన రాజీనామా ప్రకటించడం మాత్రం విచిత్రంగా ఉంది. అటు తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ఫోన్ చేసినా మనోహర్ నాయుడు లిఫ్ట్ చేయలేదు. స్థానిక నేతలు సంప్రదించినా ఆయన నుంచి స్పందన లేదు. ఇంతలో కూటమి జాగ్రత్త పడింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ లను తన వైపు తిప్పుకుంది. తమ పార్టీ అభ్యర్థి మేయర్ గా ఎన్నుకునేందుకు మార్గం సుగమం చేసింది. ఇంత జరుగుతున్నా కావటి మనోహర్ నాయుడు అటువైపుగా కనిపించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
* కేసులకు భయపడి..
వాస్తవానికి చిలకలూరిపేటలో( chilakaluripeta ) ఎమ్మెల్యే అభ్యర్థిగా మనోహర్ నాయుడుకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. సిట్టింగ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న విడదల రజిని పై వ్యతిరేకత ఉండడంతో.. ఆమెను గుంటూరు పశ్చిమ స్థానానికి పంపించారు. గుంటూరు మేయర్ గా ఉన్న మనోహర్ నాయుడు ను చిలకలూరిపేటకు పంపించారు. మేయర్ కావడంతో రజిని గెలుపు కోసం దోహదపడతారని భావించారు. రజిని సైతం మనోహర్ నాయుడు విజయానికి కృషి చేస్తారని అంచనా వేశారు. కానీ ఆ అంచనాలేవి ఫలించలేదు. ఇద్దరు ఓడిపోవడంతో పాటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం దారుణంగా ఓడిపోయింది. అదే సమయంలో మనోహర్ నాయుడు కు కొన్ని రకాల కేసులు ఎదురైనట్లు తెలుస్తోంది. అందుకే రాజీనామా చేసి టిడిపి కూటమికి మార్గం సుగమం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.