Gummanur Jayaram: ఏపీలో ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో సీటు దక్కని వారు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ప్రధానంగా అధికార వైసిపి ముందుగా అభ్యర్థులను ప్రకటించింది. భారీ ఎత్తున మార్పులు చేసింది. దీంతో ఆ పార్టీకి అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఆశించిన సీటు దక్కకపోవడంతో ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. తాజాగా మంత్రి గుమ్మనూరు జయరాం వైసీపీకి గుడ్ బై చెప్పారు. టిడిపిలో చేరనున్నారు. దీంతో కర్నూలు జిల్లా రాజకీయ సమీకరణలు ఒక్కసారిగా మారనున్నాయి.
కార్మిక శాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాం కు కర్నూలు ఎంపీ సీటును జగన్ కేటాయించారు. అయితే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలూరు అసెంబ్లీ టికెట్ తనకు కావాలని జయరాం తేల్చి చెప్పారు. కర్నూలు ఎంపీగా పోటీ చేయలేనని కూడా చెప్పుకొచ్చారు. అయినా జగన్ నిర్ణయంలో మార్పు రాలేదు. ఎంపీ అభ్యర్థిగా వేరే నేత పేరును కూడా ప్రకటించారు. గుమ్మనూరు జయరాంను పట్టించుకోకుండా మానేశారు. దీంతో వైసీపీలో ఉండడం అంత శ్రేయస్కరం కాదని జయరాం భావించారు. టిడిపిలోకి వెళ్లాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు.ఈరోజు ఆలూరు నుంచి భారీ ర్యాలీగా విజయవాడ చేరుకున్న జయరాం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మంత్రి పదవికి సైతం రాజీనామా ప్రకటించారు. సాయంత్రం జరిగే జయహో బీసీ సభలో చంద్రబాబు సమక్షంలో జయరాం తెలుగుదేశంలో చేరనున్నారు.
గత ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుంచి జయరాం వైసీపీలో చేరారు. దీంతో జగన్ ఆయనకు ఆలూరు అసెంబ్లీ టిక్కెట్ను కేటాయించారు. ఎమ్మెల్యేగా జయరాం విజయం సాధించారు. దీంతో జగన్ తొలి క్యాబినెట్ లోకి జయరామ్ ను తీసుకున్నారు. మంత్రివర్గ విస్తరణలో సైతం జయరాంకు కొనసాగింపు లభించింది. అయితే టిక్కెట్ కేటాయింపులో జయరాంకు తాజాగా జగన్ మొండి చేయి చూపారు. ఆలూరు టిక్కెట్ను జడ్పిటిసి విరూపాక్షకు కేటాయించారు. అయితే నేనుండగా ఓ జడ్పిటిసి కి టికెట్ కేటాయించడం ఏమిటని జయరాం ప్రశ్నించారు. కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చిన పోటీ చేసేందుకు విముఖత చూపారు. కొద్దిరోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.అయితే తాను ఎంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న జగన్ పట్టించుకోలేదు. అటు కర్నూలు ఎంపీ టికెట్ ను సైతం జయరాం కు క్యాన్సిల్ చేశారు. దీంతో పార్టీలో ఉండకూడదని జయరాం భావించారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయనకు గుంతకల్ టిక్కెట్ విషయంలో చంద్రబాబు హామీ ఇవ్వడంతోనే టిడిపిలో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.