IPL 2024: దూకుడయిన బ్యాటింగ్, మెరుపు ఫోర్లు, మైదానం దాటే సిక్స్ లు, కళ్ళు చెదిరే బౌలింగ్, ఆశ్చర్యానికి గురి చేసే ఫీల్డింగ్, వికెట్లను సుడిగాలి వేగంతో గిరాటేసే బంతులు.. ఐపీఎల్ అంటే అభిమానులకు ఇవే గుర్తుకు వస్తాయి. దూకుడుకు పర్యాయపదమైన ఈ క్రికెట్ లీగ్ ను ప్రేక్షకులు అమితంగా ఇష్టపడతారు. త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ కు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పలు జట్లు సన్నాహాలు ప్రారంభించాయి. కొద్దిరోజుల్లో ఈ లీగ్ ప్రారంభం కానంది.. ఈ క్రికెట్ పండుగ కోసం అభిమానులు ఎంతగానో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్ లో బ్యాటర్లు ఎంతో దూకుడుగా బ్యాటింగ్ చేసినప్పటికీ కొన్ని రికార్డులు చెక్కుచెదరకుండా అలానే ఉన్నాయి. ఒక సీజన్ కు సంబంధించి బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ 973 పరుగులు చేశాడు. క్రిస్ గేల్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఇలా చెప్పుకోవాలంటే ఐపీఎల్లో ఎన్నో రికార్డులు ఉన్నాయి. అందులో ఐదు మాత్రం చెక్కుచెదరకుండా ఉన్నాయి.
229 పరుగుల భాగస్వామ్యం
2016లో బెంగళూరు జట్టు తరఫున విరాట్ కోహ్లీ, డివిలియర్స్ తిరుగులేని రికార్డు సృష్టించారు. గుజరాత్ జట్టుపై రెండో వికెట్ కు వీరు 229 పరుగులు జోడించారు. ఐపీఎల్ టోర్నీలో ఏ వికెట్ కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. దీనిని ఇంతవరకు ఏ జట్టు ఆటగాళ్లు కూడా బ్రేక్ చేయలేకపోయారు.
ఐదుసార్లు ట్రోఫీ దక్కించుకుంది
ధోని ఆధ్వర్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. చెన్నై జట్టు 14 ఐపీఎల్ సీజన్ లలో ఏకంగా 12సార్లు ప్లే అప్ లు ఆడిందంటే అతిశయోక్తి కాదు. పదిసార్లు ఫైనల్స్ లో ఆడింది. ఐదుసార్లు ట్రోఫీ దక్కించుకుంది. పదిసార్లు ప్లే అప్ కు చేరి చెన్నై జట్టు రెండవ స్థానంలో కొనసాగుతోంది.
గేల్ 175
క్రిస్ గేల్ అంటే సుడిగాలి ఇన్నింగ్స్ గుర్తుకొస్తుంది. 2013లో పూణే జట్టుపై 66 బంతుల్లో 175 పరుగులు చేసి గేల్ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ లో ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ స్కోరుగా రికార్డ్ కు ఎక్కింది. ఈ ఇన్నింగ్స్ లో గేల్ 13 ఫోర్లు, 17 సిక్సర్లు బాదడం విశేషం. అంతేకాదు చివరి ఓవర్ బౌలింగ్ వేసి రెండు వికెట్లు కూడా తీశాడు. ఇలా ఆల్ రౌండర్ ప్రదర్శనతో గేల్ ఆకట్టుకున్నాడు.
మహేంద్ర సింగ్ ధోని
2008లో ఐపిఎల్ ప్రారంభమైంది. ఇప్పటివరకు 16 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే ఇందులో 226 మ్యాచ్ లు ఆడిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ చరిత్రలో మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 226 మ్యాచ్ లు ఆడి 133 మ్యాచ్ లలో తన జట్టును గెలిపించాడు. ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 158 ఐపీఎల్ మ్యాచ్ లకు కెప్టెన్ గా వ్యవహరించి లీగ్ లలో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా ఘనత సాధించాడు.
కోహ్లీ 973 పరుగులు
2016 సీజన్లో విరాట్ కోహ్లీ ఐపిఎల్ లో సత్తా చాటాడు. 16 మ్యాచ్ లలో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలతో 973 పరుగులు చేశాడు. ఇప్పటివరకు ఒక సీజన్లో ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్.