Pithapuram constituency : పిఠాపురం నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్నది పవన్ కళ్యాణ్ లక్ష్యం. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలిచారు పవన్. ఏకంగా 70 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో పిఠాపురం నియోజకవర్గ రుణం తీర్చుకుంటానని పవన్ ప్రకటించారు. పిఠాపురం తో పాటు పరిసర ప్రాంతాలను సైతం అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పచ్చారు. ఈ నపథ్యంలో కూటమి ప్రభుత్వం పిఠాపురానికి శుభవార్త చెప్పింది. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ పిఠాపురంను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ముందుగా పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేస్తామని భావించారు. అటు తరువాత దానికి పేరు మార్చారు. దానికే క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. పిఠాపురం నియోజకవర్గాన్ని శాశ్వతం చేసుకోవాలన్న ఆలోచనలో పవన్ ఉన్నారు. చంద్రబాబుకు కుప్పం, జగన్కు పులివెందుల మాదిరిగా.. పిఠాపురం నియోజకవర్గాన్ని పదిల పరుచుకోవాలని పవన్ భావిస్తున్నారు.
* ఇకనుంచి అభివృద్ధి పరుగులు
అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ పిఠాపురంకు సంబంధించి వడివడిగా అడుగులు వేశారు. ఆర్డీవో పర్యవేక్షణలో ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. పిఠాపురం తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ఆర్థిక అభివృద్ధి, పేదరిక నిర్మూలనకు ప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నారు. ప్రజల జీవన ప్రమాణం పెంచేలా నిర్ణయాలు తీసుకోనున్నారు. ముందుగా పిఠాపురం పట్టణంలో ఉన్న 30 పడకల ఆసుపత్రిని 100 పడకలుగా మార్చనున్నారు. దీనికి గాను 39 కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నారు. దీంతో పిఠాపురం తో పాటు చుట్టుపక్కల నియోజకవర్గాలకు మంచి వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆస్పత్రిలో ప్రస్తుతం 20 మంది ఉద్యోగులు ఉన్నారు.. కొత్తగా 66 మంది రానున్నారు.
* భారీగా నిధులు కేటాయింపు
పిఠాపురం నియోజకవర్గాన్ని సమూలంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు పవన్. పిఠాపురంలో ఆర్టీసీ బస్టాండ్ ను అభివృద్ధి చేయడంతో పాటు రోడ్ల మరమ్మతులకు మూడు కోట్ల రూపాయలు, గ్రామీణ ప్రాంత రహదారులకు 10 కోట్ల రూపాయలను కేటాయించారు. దీనికి తోడు అపోలో ఆసుపత్రి ఇక్కడ నిర్మితం కానుంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులు కొంత భూమిని ఇక్కడ కొనుగోలు చేశారు. కేవలం పవన్ ప్రాతినిధ్యం వహిస్తుండడంతోనే ఇక్కడ అపోలో ఆసుపత్రి ఏర్పాటుకు ముందుకు వచ్చారు. త్వరలోనే దీనికి సంబంధించి నిర్మాణ పనులు కూడా ప్రారంభం కానున్నాయి. మరోవైపు పవన్ ఇంటి నిర్మాణంతో పాటు క్యాంప్ ఆఫీస్ కోసం కొంత స్థలాన్ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు సైతం పిఠాపురంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. వాటిలో సరికొత్త నిర్మాణాలను చేపట్టనున్నారు. మొత్తానికైతే పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే ఒక మోడల్ గా మారనుందన్నమాట.