Gorantla Butchaiah Chowdary: బుచ్చయ్య చౌదరికి భలే ఛాన్స్.. సభలో కీలక బాధ్యతలు

అసెంబ్లీలో బుచ్చయ్య చౌదరి సీనియర్ ఎమ్మెల్యే. చంద్రబాబుతో సమకాలీకుడు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు అత్యంత సీనియర్ సభ్యుడిగా సభలో ఉన్నారు. ఆయన తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

Written By: Dharma, Updated On : June 19, 2024 11:00 am

Gorantla Butchaiah Chowdary

Follow us on

Gorantla Butchaiah Chowdary: టిడిపి సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అరుదైన అవకాశం దక్కింది. ప్రొటెం స్పీకర్ గా ఆయన వ్యవహరించునున్నారు. రేపు సాయంత్రం ప్రొటెమ్ స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుచ్చయ్య చౌదరికి శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఫోన్ చేసి ప్రొటెమ్ స్పీకర్ గా వ్యవహరించాలని కోరారు. అందుకు బుచ్చయ్య చౌదరి అంగీకరించారు. గురువారం బుచ్చయ్య చౌదరితో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు, పవన్, జగన్ తో పాటు 175 మంది సభ్యులతో బుచ్చయ్య చౌదరి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

అసెంబ్లీలో బుచ్చయ్య చౌదరి సీనియర్ ఎమ్మెల్యే. చంద్రబాబుతో సమకాలీకుడు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. చంద్రబాబు అత్యంత సీనియర్ సభ్యుడిగా సభలో ఉన్నారు. ఆయన తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత వరుసలో బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. అయ్యన్నపాత్రుడు ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆయన స్పీకర్ గా ఎంపిక కావడంతో ప్రొటెమ్ స్పీకర్ గా బుచ్చయ్య చౌదరికి ఛాన్స్ దక్కింది.

బుచ్చయ్య చౌదరి మంత్రి పదవి ఆశించారు. 2014లో టిడిపి అధికారంలోకి రావడంతో మంత్రిగా ఛాన్స్ దక్కుతుందని భావించారు. కానీ వివిధ సమీకరణల దృష్ట్యా అవకాశం ఇవ్వలేదు చంద్రబాబు. నాడు బాహటంగానే తనలో ఉన్న అసంతృప్తిని బయటపెట్టారు. ఈ నేపథ్యంలో ఈసారి తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని భావించారు. ఇప్పుడు కూడా మొండి చేయి చూపారు. ఈ తరుణంలో బుచ్చయ్య చౌదరికి స్పీకర్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా మరో సీనియర్ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడు పేరు తెరపైకి వచ్చింది. అయినా ఎక్కడ అసంతృప్తి బయట పెట్టలేదు బుచ్చయ్య చౌదరి. ఆయనకు బలమైన హామీ ఉన్నట్లు టాక్ నడుస్తోంది. ఈ తరుణంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రొటెమ్ స్పీకర్ గా వ్యవహరించాలని ఆహ్వానించారు. ఆ ఆహ్వానాన్ని మన్నించిన బుచ్చయ్య చౌదరి సానుకూలంగా స్పందించారు. రేపు సాయంత్రం గవర్నర్ అబ్దుల్ నజీర్ బుచ్చయ్య చౌదరితో ప్రమాణస్వీకారం చేయిస్తారు. 21 నుంచి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ప్రతిపక్ష నేత వరకు, మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయించనున్నారు.