NTR Bharosa Pension: ఏపీలో( Andhra Pradesh) పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. వారికి తీపి కబురు అందించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించి ఒకరోజు ముందుగానే పెన్షన్ అందించాలని నిర్ణయించింది. జనవరి 30న బ్యాంకులో నుంచి డబ్బులు తీసుకోవాలని సచివాలయ ఉద్యోగులకు ఆదేశాలు జారీచేసింది. ఇంకోవైపు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు సైతం 2026 జనవరి 1 నుంచి 2026 ఫిబ్రవరి 28 వరకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాలని ఆదేశాలు ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో ఈనెల 31న సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు అందించనున్నారు సచివాలయం ఉద్యోగులు. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.
ఆ రెండు కారణాలతో..
ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్లు అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నెల ఒకటో తేదీన సచివాలయ ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బంది పింఛన్ మొత్తాన్ని అందిస్తూ వచ్చారు. అయితే ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో.. ఒకరోజు ముందుగానే అంటే జనవరి 31న పింఛన్లు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. సచివాలయాలకు పెన్షన్ల నగదు మొత్తాన్ని జనవరి 30న పంపించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఒక రోజు ముందు ఇవ్వడానికి కేవలం ఆదివారం మాత్రమే కారణం కాదు. అదేరోజు శాసనసభలో ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే పింఛన్లు పంపిణీ తేదీలను మార్చడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇలా చేసింది.
గత నెలలో ఇదే మాదిరిగా..
గత నెలలో కూడా ఒకరోజు ముందుగానే పింఛన్లు అందించింది ప్రభుత్వం. జనవరి 1 నూతన సంవత్సర వేడుకలు కావడంతో సచివాలయ ఉద్యోగుల విజ్ఞప్తి మేరకు ముందు రోజు అందించింది. అయితే ఆది నుంచి సామాజిక పింఛన్ల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. పింఛన్ లబ్ధిదారులకు 4వేల రూపాయల మొత్తం పెంచిన ఘనత మాత్రం టిడిపి ప్రభుత్వానికే చెందుతుంది. ఏకకాలంలో మూడు వేల రూపాయల ఉన్న పింఛన్ ను 4 వేలకు పెంచారు చంద్రబాబు. అప్పట్లో కూడా వెయ్యి రూపాయలు ఉన్న పింఛన్ ను ఏకకాలంలో రెండు వేల రూపాయలకు పెంచిన ఘనత ఆయనదే. జగన్మోహన్ రెడ్డి 3000 కు పెంచుతానని చెప్పారు కానీ.. ఏకకాలంలో చెయ్యలేదు. తన ఐదేళ్ల పాలనలో 3000 రూపాయలకు పెంచారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే నాలుగువేల రూపాయలకు పెంచడంతోపాటు.. పెంచిన మొత్తానికి సంబంధించి రెండు నెలల బకాయిలు కూడా చెల్లించారు. ఏదైనా సెలవు దినం తో పాటు ప్రత్యేక పర్వదినం ఉంటే ముందు రోజే అందిస్తున్నారు.