ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని రైతులకు శుభవార్త చెప్పారు. నేడు ఏపీ రైతుల ఖాతాల్లో రూ.2,000 చొప్పున జమ చేయనున్నారు. ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కన్నబాబు ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. కొన్ని రోజుల క్రితం జగన్ సర్కార్ ఈ నెల 27న రైతు భరోసా నగదును ఖాతాల్లో జమ చేస్తామని కీలక ప్రకటన చేయగా ప్రభుత్వం అ హామీని నిలబెట్టుకుంది. కరోనా కష్ట కాలంలో సైతం జగన్ హామీలను అమలు చేస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు.
సీఎం జగన్ బటన్ నొక్కి రాష్ట్రంలోని రైతులందరి ఖాతాల్లో ఒకే సమయంలో నగదు జమ చేయనున్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజనులకు కొన్ని రోజుల క్రితం ఆర్ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఇచ్చింది. ఈ పట్టాలు ఉన్న గిరిజన రైతులకు ప్రభుత్వం తొలిసారి రైతుభరోసా స్కీమ్ ద్వారా లబ్ధి పొందుతున్న నేపథ్యంలో ఏకంగా 11,500 రూపాయలు జమ చేయనుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల గిరిజనులకు ప్రయోజనం కలగనుంది.
రాష్ట్రంలోని 50.47 లక్షల మంది రైతుల ఖాతాలలో జగన్ సర్కార్ నేడు నగదును జమ చేయనుంది. జగన్ సర్కార్ నిన్న రాష్ట్రంలో ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెలల మధ్య అకాల వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీకి సంబంధించిన జీవోను విడుదల చేసింది. ఇన్ పుట్ సబ్సిడీ నగదు కూడా అర్హులైన రైతుల ఖాతాలలో జమ కానుందని సమాచారం. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సర్కార్ రైతులకు పెట్టుబడిసాయంగా నగదు జమ చేస్తోంది.
ప్రతి సంవత్సరం జగన్ సర్కార్ 13,500 రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయనుండగా ఈ మొత్తంలో కేంద్రం వాటా కూడా ఉంది. కేంద్రం 6,000 రూపాయలు జమ చేయనుండగా రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు జమ చేయనుంది.