https://oktelugu.com/

మహబూబా ముఫ్తీ పౌరసత్వాన్ని తొలగించండి

దేశ అస్తిత్వంతో ఆటలాడుకోవటం పరిపాటిగా మారింది. కాశ్మీర్ సమస్యనుంచి దృష్టి మరులుద్దామనుకున్నా కుదరని పరిస్థితులు తలెత్తుతున్నాయి. వరుసగా కాశ్మీర్ సమస్యనే మా సంపాదకీయాల్లో చోటుచేసుకోవటం మాకూ ఆశ్చర్యంగా వుంది. కాని తప్పటంలేదు. నిన్న మహబూబా ముఫ్తీ మాట్లాడిన మాటలు విన్నవాడి కెవరికైనా రక్తం మరగక మానదు. అలా కాలేదంటేనే ఆలోచించాలి. దక్షిణాదిలో మనం ఇటువంటి వ్యాఖ్యానాలు వినటానికి అలవాటు పడ్డాం. అది మనకి అన్ని వార్తల్లో ఒకటి. ఇది దురదృష్టం. భారతావని ఇప్పటికే పరాయిపాలనలో మగ్గి మగ్గి […]

Written By:
  • Ram
  • , Updated On : October 27, 2020 7:05 am
    Follow us on

    దేశ అస్తిత్వంతో ఆటలాడుకోవటం పరిపాటిగా మారింది. కాశ్మీర్ సమస్యనుంచి దృష్టి మరులుద్దామనుకున్నా కుదరని పరిస్థితులు తలెత్తుతున్నాయి. వరుసగా కాశ్మీర్ సమస్యనే మా సంపాదకీయాల్లో చోటుచేసుకోవటం మాకూ ఆశ్చర్యంగా వుంది. కాని తప్పటంలేదు. నిన్న మహబూబా ముఫ్తీ మాట్లాడిన మాటలు విన్నవాడి కెవరికైనా రక్తం మరగక మానదు. అలా కాలేదంటేనే ఆలోచించాలి. దక్షిణాదిలో మనం ఇటువంటి వ్యాఖ్యానాలు వినటానికి అలవాటు పడ్డాం. అది మనకి అన్ని వార్తల్లో ఒకటి. ఇది దురదృష్టం. భారతావని ఇప్పటికే పరాయిపాలనలో మగ్గి మగ్గి అస్తిత్వం కోల్పోయే ప్రమాదపుటంచుల్లోకి చేరింది. ఎటువంటి వారసత్వ సంస్కృతి లేని దేశాలు కూడా దేశ వ్యవహారం వచ్చేసరికి అందరూ ఒక్కటవుతారు. కానీ మన దగ్గర ఇది కూడా పార్టీల వ్యవహారంగా మారింది. మొదట్నుంచీ తెలుగు మీడియాలో జాతీయ భావాలు గురించి ఎవరైనా మాట్లాడితే అదేదో తప్పులాగా,మన స్థితిగతుల గురించి మాట్లాడకుండా తప్పుదారిపట్టించే టాపిక్ గా అవహేళన చేయటం అలవాటైపోయింది. అసలు మహబూబా ముఫ్తీ మాట్లాడినదానిమీద ఎన్ని చానళ్ళు,ఎన్ని పత్రికలు పతాక శీర్షికలో పెట్టటం,చర్చించటం జరిగింది. ఇదేదో మామూలు వార్తలాగ అన్నింటితో కలిపి ఇవ్వటం తప్పిస్తే ఆవిడ వ్యాఖ్యానంపై చర్చ పెట్టిన పాపాన పోలేదు. ఇదేమి దౌర్భాగ్యం మీడియా మిత్రులారా?

    మహబూబా ముఫ్తీ చేసినది సాధారణ తప్పా?

    అసలు జమ్మూ-కాశ్మీర్ ని వాడుకున్నది,ఆడుకున్నది అబ్దుల్లాలు, ముఫ్తీలే. ఇంతకుముందు ఆర్టికల్ 370 కోసం అవసరమయితే చైనా సహాయం తీసుకుంటానన్న ఫరూక్ అబ్దుల్లా దగ్గర్నుంచి మా జండాని పునరుద్ధరించకుండా భారత జాతీయ జండాని పట్టుకోనని చెప్పిన మహబూబా ముఫ్తీదాకా ఏదిపడితే అది మాట్లాడే స్వేచ్చని కల్పించింది మన రాజ్యాంగమని మరిచిపోవద్దు. ఇంకా ఏ దేశంలోనైనా ఇలా మాట్లాడివుంటే ఈపాటికి ఈ ఇద్దరూ దేశద్రోహం కింద నిర్బంధించ బడి ఉండేవారే. అసలు ఈ రెండు కుటుంబాలు భారత సంపదని అనుభవించినంత జమ్మూ, కాశ్మీర్ లో ఎవరూ అనుభవించలేదు. ఒక్కొక్క కుంభకోణం బయటకొస్తుంటే వీళ్ళ కింద కుర్చీ కదిలిపోతుందని మరిచిపోవద్దు. విశేషమేమంటే భారత చర్యల్ని వ్యతిరేకించే కాశ్మీర్ ప్రత్యేకవాదులు కూడా ఈ రెండు కుటుంబాలపట్ల ఎటువంటి సానుభూతిని వ్యక్తపరచటంలేదు.ఎందుకంటే వీళ్ళు చేసిన అకృత్యాలు,అక్రమ సంపాదన వాళ్ళందరికీ తెలుసు. 1989 లో ఫరూక్ అబ్దుల్లా ఎన్నికల్ని ఎంత భీభత్సంగా రిగ్గింగ్ చేసాడో వీళ్ళందరూ కళ్ళారా చూసారు. ప్రస్తుతం వీళ్ళు తమ పాత పద్దతిలోనే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి అధికారం పొందాలనే తాపత్రయం జమ్మూ,కాశ్మీర్ ప్రజలందరికి అర్ధమయింది.

    ఇక ముఫ్తీ కుటుంబం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వీళ్ళ నాన్న ముఫ్తీ మహమ్మద్ సయ్యద్ దేశానికి హోం మంత్రిగా చేసాడు. మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టాడు. ఆయన హోం మంత్రిగా ఉన్నప్పుడే ఈ మహబూబా చెల్లెలు రుబియా సయీద్ ని ఉగ్రవాదులు కిడ్నాప్ చేస్తే ఆవిడను విడిపించటానికి కరుడుగట్టిన ఉగ్రవాదుల్ని విడుదల చేయాల్సి వచ్చింది. ఈ ఉగ్రవాదులు విడుదలకు ముందు,తర్వాత కొన్ని వందలమంది ప్రాణాలు తీయటానికి కారణమయ్యారు. ఇంతకన్నా ఇంకేమికావాలి. వీళ్ళు జీవితాంతం దేశానికి రుణ పడి వుండాలి. వీళ్ళు అనుభవించిన పదవులు కాని,ఇప్పుడు ఉంటున్న బంగ్లాలు కాని,తీసుకునే జీత భత్యాలు కాని, ప్రస్తుతం అనుభవిస్తున్న భద్రతా సిబ్బంది రక్షణ కానీ  అన్నీ భారత ప్రభుత్వ కానుకలే. కానీ ఈ దేశ జండాని పట్టుకోవటానికి సంకోచిస్తుంటారు. ఆవిడ ఈ ప్రకటన తర్వాతే గుప్కార్ మీటింగ్ జరిగింది. అందులోని పార్టీలు ఒక్కరుకూడా ఆవిడని ముందుగా మీ వ్యాఖ్యానం ఉపసంహరించుకోమని కోరలేదు. అంటే అర్ధమేంటి? వీళ్ళ రాజకీయాలకోసం మౌనం వహించారని అనుకోవాలా? సిపిఎం చెప్పే మాటలు,చేసే చేష్టలకు పొంతన ఉందా? ఆర్టికల్ 370 స్వంత అభిప్రాయాలు వుండటం వేరు, అది పునరుద్ధరిస్తేనే త్రివర్ణ పతాకం పట్టుకుంటామని చెప్పటం వేరు. మౌనం దేనికి సంకేతం? నిర్ద్వందంగా మహబూబా ముఫ్తీ ప్రకటనను ఖండించాల్సిన అవసరం లేదా?

    రాజకీయ పార్టీలు దేశ భవిత్యంతో ఆటలాడుకుంటున్నాయి

    బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత జమ్మూ,కాశ్మీర్ లో పిడిపితో కలిసి అధికారాన్ని పంచుకోవటాన్ని ఏ కోణంలో చూడాలి. ఏవిధంగా చూసినా పిడిపి అప్పటికే ఉగ్రవాదులతో మెతకగా వుందని అందరికీ తెలుసు. అయినా అటువంటి పార్టీతో అధికారాన్ని పంచుకోవటం తప్పని ఇప్పటికైనా ఒప్పుకుందా? లేదు. అసలు ఆ ఒప్పందాన్ని కుదిర్చిన ప్రముఖ వ్యక్తి మన తెలుగువాడే. రామ్ మాధవ్ అప్పట్లో బిజెపికి ట్రబుల్ షూటర్. ఇటువంటి అనైతిక ఒప్పందాలు అటు కాశ్మీర్ లో,ఇటు ఈశాన్య భారతంలో కుదుర్చుకోవటంలో ఆరితేరిన జాణ. అదేమంటే కాంగ్రెస్ కూడా అదివరకు పిడిపితో అధికారం పంచుకుంది కదా అని సమాధానం చెబుతారు. అంటే అందరూ ఆ తానులో గుడ్డ లేనన్న మాట. ఇప్పటికైనా బిజెపి ఈ అపవిత్ర కలయిక పై జాతికి క్షమాపణ చెప్పాలి.

    ఇక కాంగ్రెస్ సంగతి ఎంత తక్కువ చెబితే అంత మంచిది. అసలు జమ్మూ,కాశ్మీర్ సమస్యని మొదట్నుంచీ జటిలం చేసిందే కాంగ్రెస్. ఎంతమంది ముఖ్యమంత్రుల్ని చెస్ లో పావుల్ని కదిపినట్లు కదిపిందో. నేషనల్ కాన్ఫరెన్స్ తో కలిసి ఎన్నికల్ని రిగ్గింగ్ చేసిన మహా ఘనకార్యం కాంగ్రెస్ దే. చట్టంలో లేని ప్రజాభిప్రాయ సేకరణను ముందుకు తీసుకొచ్చి ఐక్యరాజ్యసమితికి నివేదించిందీ కాంగ్రెస్ పార్టీనే. ఒకటేమిటి కాంగ్రెస్ చేసిన నిర్వాకాలు రాయాలంటే ఎన్నో వ్యాసాలు కావాలి. ఇప్పుడుకూడా గుప్కార్ ప్రకటనని వెనకుండి మద్దత్తు తెలుపుతూ మహబూబా ముఫ్తీ ప్రకటనని ఖండించిన పాపాన పోలేదు. కాశ్మీర్ లో కాంగ్రెస్ చేసిన పాపాలు తనని ఎప్పటికీ వెన్నంటుతూనే వుంటాయి.

    సిపిఎం పార్టీ ఈ పార్టీలను భుజాన వేసుకొని మోయాల్సిన అవసరం ఏమొచ్చింది? అబ్దుల్లాలు,ముఫ్తీలు చేసిన పాపాలు,సంపాదించిన అక్రమసంపాదన వీళ్ళకు తెలియదా? బిజెపిని వ్యతిరేకించే పేరుతో కాశ్మీర్ ని నిలువునా దోచుకున్నవారికి అండకాగటం వీళ్ళ దివాలాకోరు రాజకీయానికి మచ్చుతునక. సంస్థానాల విలీనాల చరిత్ర వీళ్ళకు తెలియదా? ఒక్క జమ్మూ,కాశ్మీర్ కాదు. అన్ని సంస్థానాలు విలీన పత్రం సంతకం చేసినప్పుడు మూడు అంశాలే భారత ప్రభుత్వానికి దఖలు పరిచాయి. అవి విదేశీ వ్యవహారాలూ, రక్షణ,కమ్యూనికేషన్ అంశాలు. ఆరోజు పరిస్థితులకు అనుగుణంగా ఆ ఒప్పంద పత్రాలు కుదుర్చుకున్నారు. అలాగే రాజభరణాల ఒప్పందం కూడా వాటితోపాటే కుదుర్చుకున్నారు. దానిని తర్వాత రద్దుచేయలేదా? విలీనమప్పుడు ఒప్పుకున్నామని పొడిగించలేదు కదా. పార్లమెంటు అన్నింటికన్నా సుప్రీం అనుకున్నప్పుడు రాజభరణాల రద్దయినా,తాత్కాలిక ఆర్టికల్ 370 రద్దయినా అదే సూత్రం కదా. జమ్మూ,కాశ్మీర్ లో అంతకుముందు ప్రభుత్వాలు చేసిన తప్పులు ఇప్పుడు పార్లమెంటు సరిదిద్దే అధికారం లేదా?

    మహబూబా ముఫ్తీ పౌరసత్వాన్ని రద్దుచేయాలి 

    జమ్మూ,కాశ్మీర్ భారత్ లో 1947 అక్టోబర్ 27వ తేదీ విలీనమయింది. ఆ రోజుకి ఆర్టికల్ 370,జమ్మూ,కాశ్మీర్ రాజ్యాంగం లేదు. ఆ తర్వాత షేక్ అబ్దుల్లా పుణ్యమా అని అవి వచ్చాయి. అంటే అర్ధం ముందుగా భారత్ లో జమ్మూ,కాశ్మీర్ భాగమయ్యింది. అంటే 1947 కి జమ్మూ,కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమయింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ ప్రక్రియలో భాగంగా ఆర్టికల్ 370 తాత్కాలిక స్వభావంగానే చేరింది. ఇక ఆర్టికల్ 35ఎ ఈరోజుకీ రాజ్యాంగంలో అధికారికంగా చేరలేదు. ఏరోజూ ఈ ఆర్టికల్ ని ఆమోదించలేదు. ఇక జమ్మూ,కాశ్మీర్ రాజ్యాంగం షేక్ అబ్దుల్లా,నెహ్రూ ఒప్పందం ప్రకారం జరిగింది. ఇవన్నీ రాజకీయ ప్రక్రియలో భాగం. కానీ జమ్మూ,కాశ్మీర్ మహారాజు భారత ప్రభుత్వం తో చేసుకున్న విలీన ఒప్పందం శాశ్వతం. దానిని ఎవరూ మార్చలేరు. భారత పార్లమెంటు సహా. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం ఈ రాజకీయ పార్టీలకు తెలియదని అనుకోలేము. వీళ్ళకు దేశం కన్నా రాజకీయ క్రీడ ముఖ్యం.

    అసలు గుప్కార్ ప్రకటన ఏమి చెప్పింది. ఆర్టికల్ 370 ని పునరుద్ధరించటానికి అవసరమైన చట్టబద్ద చర్యలన్నీ తీసుకుంటామని కదా. అంటే ఇప్పటికే సుప్రీం కోర్టులో వున్న కేసుని బలంగా ముందుకు తీసుకెళ్లటం, దేశ ప్రజలకి దాని పునరుద్ధరణ ఏవిధంగా కరెక్టో వివరించటం, అవసరమయితే తిరిగి పార్లమెంటులో ఈ పునరుద్ధరణ బిల్లు తీసుకురావటం లాంటివి. అంతేగాని భారత త్రివర్ణ పతాకాన్ని అవమానించటం కాదుకదా. మరి అటువంటప్పుడు గుప్కార్ ప్రకటన భాగస్వామి అయిన మహబూబా ముఫ్తీ దేశ వ్యతిరేక వ్యాఖ్యానం చేసినప్పుడు ఖండించాల్సిన అవసరం లేదా? అదేమంటే మేము ఆ ప్రకటన ఇవ్వలేదు కదా అని సర్దిపుచ్చుకుంటే సరిపోతుందా? ఇప్పటికైనా మహబూబా ముఫ్తీ ఆ వ్యాఖ్యానాన్ని ఉపసంహరించుకొని జాతికి క్షమాపణ చెప్పాలి. లేదంటే తక్షణం ఆవిడ పౌరసత్వాన్ని రద్దుచేసి,పాస్ పోర్టుని స్వాధీనం చేసుకొని,భద్రతని ఉపసంహరించుకోవాలి. ఇంతకంటే వేరే మార్గం లేదు. జాతీయ జండాని అగౌరవపరిచే వాళ్లకు ఇంతకన్నా తక్కువ శిక్ష వేయటం జాతికే అవమానం.