Gone Prakash Rao: ఏపీలో కూటమిదే గెలుపు.. ఆ వైసీపీ నేత జోష్యం

తాజాగా ఏపీ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని జోష్యం చెప్పారు. బిజెపితో పొత్తు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా.. కూటమి గెలుపును మాత్రం ఎవరు ఆపలేరని తేల్చి చెప్పారు.

Written By: Dharma, Updated On : April 8, 2024 3:12 pm

Gone Prakash Rao

Follow us on

Gone Prakash Rao: ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో గోనె ప్రకాశరావు అంటే తెలియని వారు ఉండరు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. వైసీపీ ఆవిర్భావ సమయంలో జగన్ వెంట నడిచిన నాయకుడు కూడా ఆయన. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. గత కొంతకాలంగా సమకాలిన రాజకీయ అంశాలను విశ్లేషిస్తుంటారు. రాజకీయాల కంటే విశ్లేషణలకు అత్యంత ప్రాధాన్యమిస్తుంటారు. కానీ గత కొంతకాలంగా ఆయన చేస్తున్న విశ్లేషణలు వివాదాస్పదమవుతున్నాయి. ఒకటి రెండు సందర్భాల్లో ఆయనపై దాడి ప్రయత్నం కూడా జరిగింది. అయితే ఆయన తాజాగా ఏపీ రాజకీయ పరిస్థితులపై ఎప్పటికప్పుడు విశ్లేషణలు జరుపుతుంటారు.

తాజాగా ఏపీ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని జోష్యం చెప్పారు. బిజెపితో పొత్తు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా.. కూటమి గెలుపును మాత్రం ఎవరు ఆపలేరని తేల్చి చెప్పారు. కూటమికి 130 నుంచి 145 స్థానాలు దక్కే అవకాశం ఉందని.. 19 నుంచి 21 లోక్ సభ స్థానాలు కూడా వస్తాయని గోనే స్పష్టం చేయడం సంచలనంగా మారింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 50 నుంచి 60 వేల మెజారిటీతో గెలుపొందుతారని కూడా గోనె ప్రకాష్ రావు చెప్పుకొచ్చారు. అటు పవన్ చివరి నిమిషంలో ఎంపీగా పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని.. కేంద్ర ప్రభుత్వం నుంచి మంచి ఆఫర్ ఉందని కూడా గోనె తేల్చి చెప్పారు.

వైసీపీ ఆవిర్భావ సమయంలో గోనె ప్రకాష్ రావు ఆ పార్టీలో చాలా యాక్టివ్ గా పని చేశారు. తెలంగాణ వైసీపీ నాయకుడిగా కొనసాగారు. 2014 రాష్ట్ర విభజన తరువాత కూడా వైసీపీలోనే కొనసాగారు. అయితే జగన్ ఉన్నపలంగా తెలంగాణలో పార్టీని విడిచిపెట్టడంతో గోనె షాక్ కు గురయ్యారు. కెసిఆర్ ప్రయోజనాలకు జగన్ పనిచేశారని అనుమానం వ్యక్తం చేస్తూ.. వైసీపీని వీడారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తెలంగాణ నేత అయినా ఏపీ రాజకీయాలపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తుంటారు. గత కొద్ది రోజులుగా ఆయన జోష్యం వైసీపీకి వ్యతిరేకంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది. దీంతో గోనె ప్రకాష్ రావు వ్యాఖ్యలను పట్టించుకోనవసరం లేదని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే గోనె ప్రకాష్ రావు కామెంట్స్ మాత్రం టిడిపిలో కొత్త ఆశలను రేపుతోంది.