https://oktelugu.com/

Visakha: విశాఖలో గ్యాంగ్ రేప్.. బాలికపై పదిమంది దారుణం

ఆర్కే బీచ్ వద్ద రోధిస్తూ కనిపిస్తుండగా.. పర్యాటకుల ఫోటోలను తీసే ఓ ఫోటోగ్రాఫర్ తారసపడ్డాడు. ఆమెపై జాలి చూపించాడు.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 1, 2024 / 10:51 AM IST
    Follow us on

    Visakha: మానవ మృగాల అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతుంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే సాగరనగరంలో ఇటీవల నేర సంస్కృతి పెరుగుతోంది. ముఖ్యంగా గ్యాంగ్ రేప్ లు వెలుగులోకి వస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. మొన్నటికి మొన్న ఓ నేవీ అధికారి కుమార్తె గ్యాంగ్ రేప్ ఘటన మరువకముందే.. తాజాగా ఒడిశాకు చెందిన బాలికపై సామూహిక అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ప్రియుడు ఆయన స్నేహితుడు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు నిర్ణయించుకున్న బాధితురాలని కాపాడే క్రమంలో ఓ ఫోటోగ్రాఫర్, ఆయన స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారం రోజులు పాటు నరకం చూపించారు.

    ఒడిస్సా కు చెందిన ఓ కుటుంబం కంచరపాలెంలో అపార్ట్మెంట్ లో పనికి కుదిరింది. ఆ కుటుంబానికి చెందిన 17 ఏళ్ల బాలిక రైల్వే స్టేషన్ సమీపంలో కుక్కలకు ఆహారం వేసే పనిలో చేరింది. అప్పుడే భువనేశ్వర్ కు చెందిన ఓ యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. అది కాస్త ప్రేమగా మారింది. డిసెంబర్ 17న ఆ యువతికి మాయ మాటలు చెప్పి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హోటల్ కు తీసుకెళ్లాడు. అక్కడే అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం తన స్నేహితుడిని పురిగొల్పాడు. ప్రియుడే అత్యాచారానికి ప్రోత్సహించడంతో బాధితురాలు మనస్థాపానికి గురైంది. ఆత్మహత్య చేసుకోవాలని డిసైడ్ అయ్యింది.

    ఆర్కే బీచ్ వద్ద రోధిస్తూ కనిపిస్తుండగా.. పర్యాటకుల ఫోటోలను తీసే ఓ ఫోటోగ్రాఫర్ తారసపడ్డాడు. ఆమెపై జాలి చూపించాడు. కాపాడుతున్నట్లు నటిస్తూ తన వెంట తీసుకెళ్లాడు. జగదాంబ థియేటర్ సమీపంలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అంతటితో ఆగకుండా తన స్నేహితులు ఏడుగురికి ఈ విషయం చెప్పాడు. వారు సైతం అత్యాచారం చేస్తూ బాధిత బాలికకు నరకం చూపించారు. ఈ బాధను తాళలేక ఆమె ఒడిస్సా లోని స్వగ్రామం వెళ్ళిపోయింది. ఇంతలో బాలిక కనిపించలేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీస్ విచారణలో ఆమె సొంత గ్రామం వెళ్లిపోయినట్లు తెలిసింది. అక్కడ నుంచి తీసుకొచ్చి బాలికను తల్లిదండ్రులకు పోలీసులు అప్పగించారు. అయితే ఆదివారం వరకు మౌనంగా ఉన్న ఆ బాలిక.. తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు వివరించింది. దీంతో వారు పోలీసులకు ఈ విషయాన్ని చేరవేశారు. పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రియుడుతో పాటు ఆయన స్నేహితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. అయితే ఎన్నడూ లేని విధంగా విశాఖ నగరంలో గ్యాంగ్ రేప్ లు వెలుగు చూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.