Ganta Srinivasa Rao: ఊరందరిదీ ఒక బాధ అయితే.. గంటా శ్రీనివాసరావు ది మరో బాధ. ఎలాగోలా చంద్రబాబును ఒప్పించి భీమిలి అసెంబ్లీ స్థానం టికెట్ తెప్పించుకున్నారు. కానీ ఇప్పుడు సొంత పార్టీ నుంచి ఆయనకు ప్రతికూలత తప్పడం లేదు. గంటా అభ్యర్థి అయితే తాము సహకరించమని టిడిపి శ్రేణులు తేల్చి చెబుతున్నాయి. ఏకంగా సమావేశం నిర్వహించి హైకమాండ్ కు హెచ్చరికలు పంపుతున్నాయి. జనసేన నుంచి సైతం అదే పరిస్థితి ఎదురవుతోంది. దీంతో గంటా ఇబ్బంది పడుతున్నారు.
ప్రతి ఎన్నికకు నియోజకవర్గాన్ని మార్చడం గంటాకు ఆనవాయితీగా వస్తోంది. గత ఎన్నికల్లో ఆయన విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఎన్నికల్లో మాత్రం గంటాను చంద్రబాబు చీపురుపల్లి వెళ్లాలని సూచించారు. బొత్స సత్యనారాయణ పై పోటీ చేయాలని ఆదేశించారు. కానీ అందుకు గంటా సమ్మతించలేదు. విశాఖ జిల్లా దాటి వెళ్లలేనని తేల్చి చెప్పారు. తనకు భీమిలి టిక్కెట్టు ఇవ్వాలని పట్టుబట్టారు. చివరకు గంట శ్రీనివాసరావు ఒత్తిడిని చంద్రబాబు తలొగ్గాల్సి వచ్చింది. భీమిలి అసెంబ్లీ సీటు కేటాయించాల్సి వచ్చింది.
అయితే ఇక్కడ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జిగా కోరాడ రాజాబాబు ఉన్నారు. సుదీర్ఘకాలం ఆయనే కొనసాగుతూ వచ్చారు. గత ఎన్నికల్లో గంటా శ్రీనివాసరావు విశాఖ ఉత్తర నియోజకవర్గానికి మారడంతో.. నియోజకవర్గ టిడిపి బాధ్యతలను రాజాబాబు చూసుకునేవారు. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో నుంచి టిడిపి అభ్యర్థిగా దివంగత నేత సబ్బం హరి పోటీ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయారు. కొద్ది రోజులకే అనారోగ్యంతో చనిపోయారు. అప్పటినుంచి రాజాబాబు ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. గత ఐదు సంవత్సరాలుగా టిడిపి శ్రేణులను సమన్వయం చేసుకుంటున్నారు. ఇప్పుడు గంటాకు టికెట్ ప్రకటించడంతో ఆయన అనుచరులతో భేటీ అయ్యారు. గంటాకు సహకరించకూడదని నిర్ణయించారు.
జనసేన ఇన్చార్జిగా పంచకర్ల సందీప్ కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఈయనే పోటీ చేశారు. పొత్తులో భాగంగా ఈసారి భీమిలి టిక్కెట్ జనసేనకే దక్కుతుందని అంతా భావించారు. ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికవ్వాలని ఆలోచన చేశారు. తప్పకుండా జనసేనకే ఈ సీటు కేటాయిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు గంటా కోసం టిడిపికి కేటాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. జనసేన శ్రేణులు సైతం అసంతృప్తితో ఉన్నాయి. ఈ పరిణామాలన్నీ ఎటు దారితీస్తాయోనని గంటా శ్రీనివాసరావు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. మరి ఈ ఇబ్బందులను ఎలా అధిగమిస్తారో చూడాలి.