Ganesh Kumar : విశాఖలో( Visakhapatnam) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతకు షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి షాక్ ఇచ్చారు. దీంతో బాధిత నేత లబోదిబోమంటున్నాడు. అనవసరంగా తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చేసానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ నేత ఎవరో తెలుసా? విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా గెలిచిన ఆయన.. కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ టికెట్ దక్కించుకున్నారు. కానీ ఓటమి తప్పలేదు. ఈ తరుణంలో ఆయన తిరిగి మాతృ పార్టీలోకి వస్తారని ప్రచారం సాగింది. అయితే అటువంటిదేమీ లేకుండా పోయింది. ఇటీవల ఓ టిడిపి కార్పొరేటర్ ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించడంలో కీలక భూమిక పోషించారు వాసుపల్లి గణేష్. కానీ జగన్మోహన్ రెడ్డి వేరేగా ఆలోచన చేశారు. వాసుపల్లి గణేష్ కుమార్ స్థానంలో కొత్త నేతకు బాధ్యతలు ఇచ్చారు.
Also Read : ఆ 44 నియోజకవర్గాలకు కొత్త ఇన్చార్జిలు.. మహానాడులో సంచలనాలు
* 2009లో తొలిసారిగా..
విశాఖలో డిఫెన్స్ అకాడమీతో( Defence Academy) అందరికీ సుపరిచితులయ్యారు వాసుపల్లి గణేష్ కుమార్. ఏటా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించేవారు. అలా విశాఖ నగరంలో ప్రముఖుడయ్యారు. తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉన్న వాసుపల్లి గణేష్ కుమార్ ను గుర్తించారు చంద్రబాబు. 2009లో మత్స్యకారులు అధికంగా ఉండే విశాఖ దక్షిణ నియోజకవర్గ టికెట్ కట్టబెట్టారు. ఆ ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ కు ఓటమి తప్పలేదు. 2014లో రెండోసారి టిక్కెట్టు ఇవ్వడంతో దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచారు. 2019 లో మూడోసారి టికెట్ ఇచ్చారు. రాష్ట్రంలో జగన్ ప్రభంజనం వీచినా.. విశాఖ నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో మాత్రం టిడిపి గెలిచింది. దక్షిణ నియోజకవర్గం నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ విజయం సాధించారు. కానీ కొద్ది రోజులకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. 2024 ఎన్నికల్లో అతి కష్టం మీద వైసిపి టికెట్ దక్కింది. అయినా ఓటమి తప్పలేదు.
* వైసిపి నేతలపై హాట్ కామెంట్స్..
మొన్న ఆ మధ్యన వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ నేతల తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు వాసుపల్లి గణేష్ కుమార్. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి కొంతమంది నేతల తీరే కారణమని ఆరోపించారు. మాజీ మంత్రి రోజా అలా కామెంట్స్ చేయకూడదని హితవు పలికారు. వల్లభనేని వంశీ, కొడాలి నాని లాంటి నేతలను బయటకు పంపించేయాలని సూచించారు. దీంతో వాసుపల్లి గణేష్ కుమార్ పై అనుమానాలు ప్రారంభం అయ్యాయి. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు అన్న కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పటివరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు వాసుపల్లి గణేష్ కుమార్. అయితే ఇప్పుడు ఉన్నఫలంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను కొండా రాజీవ్ అనే యువకుడికి అప్పగించారు. వైసీపీ తరఫున సోషల్ మీడియాతో పాటు సాధారణ మీడియాలోనూ బలమైన వాయిస్ వినిపిస్తుంటారు రాజీవ్.
* బిజెపిలో చేరే ఛాన్స్..
విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతల నుంచి తనను తొలగించడంతో వాసుపల్లి గణేష్ కుమార్( Ganesh Kumar) తీవ్ర ఆవేదనతో ఉన్నారు. త్వరలో కీలకమైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆయన అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దక్షిణ నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నారు. మరోవైపు టిడిపి ఇన్చార్జిగా ఇప్పటికే సీతం రాజు సుధాకర్ నియమితులయ్యారు. అందుకే వాసుపల్లి గణేష్ కుమార్ చూపు బిజెపి వైపు ఉందని ప్రచారం సాగుతోంది. మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.