TDP Mahanadu : తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party) పండుగ మహానాడుకు రంగం సిద్ధం అయ్యింది. కడప వేదికగా తొలిసారి మహానాడు జరగనుంది. వరుసగా మూడు రోజులపాటు మహానాడు కొనసాగనుంది. పార్టీకి నాలుగు దశాబ్దాల దిశ నిర్దేశం చేసే విధంగా మహానాడులో నిర్ణయాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. మొత్తం 14 తీర్మానాలు చేసి ఆమోదం తెలపనున్నారు. అన్నింటికీ మించి టీడీపీలో నాయకత్వ మార్పు ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా నారా లోకేష్ కు ప్రమోషన్ ఖాయమని తెలుస్తోంది. దీంతో మహానాడు పై టిడిపి శ్రేణుల్లో ఒక రకమైన అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాల నేపథ్యంలో మరికొద్ది సేపట్లో మహానాడు ప్రారంభం కానుంది. మహానాడుకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. 22 పసందైన వంటకాలతో భోజన మెనూ ఆకట్టుకుంటుంది. ఉదయం టిఫిన్ నుంచి రెండు పూటల భోజనాల ఏర్పాట్లు అక్కడే చేశారు. కీలక నేతలకు కడప నగరం తో పాటు సమీప పట్టణాల్లో బస ఏర్పాటు చేశారు.
Also Read : ‘తూర్పు’లో కట్టుదాటుతున్న తమ్ముళ్లు!
* లోకేష్ కు ప్రమోషన్..
ముఖ్యంగా లోకేష్ కు( Nara Lokesh) పదోన్నతి ఉంటుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీలో లోకేష్ ఆక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు సమయంలో కూడా కేంద్ర పెద్దలతో సమన్వయం చేసుకొని వ్యవహరించారు. సుదీర్ఘకాలం రాష్ట్రంలో పాదయాత్ర చేసి ప్రజలతో మమేకం అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు. ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు తర్వాత పార్టీని భుజస్కందాలపై మోసే బాధ్యతను తీసుకున్నారు నారా లోకేష్. పార్టీలో ప్రమోషన్ ఇచ్చేందుకు ఇదే మంచి సమయమని చంద్రబాబుకు సన్నిహితులు, పార్టీలో సీనియర్లు సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే లోకేష్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారని సమాచారం. మహానాడు వేదికగా ఈ ప్రకటన చేసి పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన జోష్ నింపుతారని తెలుస్తోంది.
* ఆ నియోజకవర్గాల్లో వివాదాలు.
మరోవైపు తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ నింపేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పార్టీ ఎమ్మెల్యేలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని ఇచ్చారని.. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పనిచేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు వర్క్ షాప్ లు నిర్వహిస్తూ కీలక సూచనలు చేశారు. అయితే చాలామంది ఎమ్మెల్యేల పనితీరులో మార్పు రావడం లేదు. అందుకే ఈసారి హెచ్చరికలకు కాకుండా వారికి ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వారికి ప్రత్యామ్నాయంగా నియోజకవర్గ ఇన్చార్జిలు అందుబాటులోకి వస్తారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 44 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగా లేకపోవడంతో అక్కడ ఇన్చార్జిలను నియమిస్తారని తెలుస్తోంది.
* ఆ ఎమ్మెల్యేల వైఖరితోనే..
సహజంగా పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నచోట ఇన్చార్జిలు ఉండరు. అలా ఉంటే అధికార కేంద్రాలు రెండుగా మారుతాయి. ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. అయితే చాలామంది ఎమ్మెల్యేల పనితీరుపై అనేక రకాల సందేహాలు ఉన్నాయి. వివాదాలు కూడా నడుస్తున్నాయి. అటువంటి వారికి హెచ్చరిస్తున్న పరిస్థితిలో మార్పు రావడం లేదు. అందుకే కొత్తగా నియోజకవర్గ ఇన్చార్జిల ఏర్పాటు అంశం తెరపైకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఉన్నచోట ఇన్చార్జిలను నియమిస్తేనే వారు వారి వైఖరిలో మార్పు వస్తుందని టిడిపి హై కమాండ్ ఒక ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. మొత్తానికైతే మహానాడు వేదికగా సంచలన నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది.