Galla jayadev: చంద్రబాబు ఇటీవల బిజీ అయ్యారు. విజయవాడకు వరదలు రావడంతో స్వయంగా రంగంలోకి దిగారు. విజయవాడ కలెక్టరేట్లో బస చేసి బాధిత ప్రాంతాలను సందర్శించారు. వరద బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. సాధారణ పరిస్థితి వచ్చేవరకు తాను అక్కడే ఉంటానని చెప్పుకొచ్చారు. అన్నట్టుగానేఅక్కడే ఉండి సహాయ చర్యలను పర్యవేక్షించారు. అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా బాధిత ప్రాంతాలను సందర్శించారు. ఇప్పుడు సాధారణ పరిస్థితికి విజయవాడ రావడంతో పాలనపై దృష్టి పెట్టారు చంద్రబాబు. రాజకీయ అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రధానంగా రాజ్యసభ సభ్యుల ఎంపిక పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇటీవల వైసిపికి చెందిన రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు వైసీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. రాజ్యసభ స్థానాలతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం వారు రాజీనామా చేశారు. ఆ రెండు స్థానాలు టిడిపికి దక్కే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఆశావహులు ఎవరికి వారే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అవకాశం దక్కించుకోవాలని చూస్తున్నారు.
* కలిసొచ్చే అంశాలు అవే
చంద్రబాబు రాజ్యసభ సభ్యుల ఎంపికపై దృష్టి పెట్టారు.ఈ నేపథ్యంలో ప్రధానంగా గల్లా జయదేవ్ పేరు వినిపిస్తోంది. దాదాపు గల్లా జయదేవ్ పేరు ఖరారు అయినట్లు సమాచారం. గత రెండుసార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించడం, జాతీయస్థాయిలో పలుకుబడి ఉండడం, బిజెపి అగ్రనేతలతో సత్సంబంధాలు ఉండడం వంటి కారణాలతో గల్లా జయదేవ్ వైపు చంద్రబాబు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. దాదాపు ఆయన పేరు ఖరారు చేశారని.. ఒకటి రెండు రోజుల్లో అందుకు సంబంధించి ప్రకటన రానున్నట్లు సమాచారం.
* వరుసగా రెండుసార్లు ఎంపీగా
2014, 2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు జయదేవ్. ఆ రెండు ఎన్నికల్లోను గెలిచారు. 2019లో జగన్ ప్రభంజనంలో సైతం ఎదురెొడ్డి నిలబడ్డారు. కానీ వైసీపీ సర్కార్ జయదేవ్ పరిశ్రమలకు చాలా రకాల ఇబ్బందులు పెట్టింది. అందుకే ఈ ఫిబ్రవరిలో క్రియాశీలక రాజకీయాలకు జయదేవ్ గుడ్ బై చెప్పారు. పరిశ్రమల నిర్వహణపై దృష్టి పెడతానని ప్రకటించారు. అయితే కూటమి ప్రభుత్వం బంపర్ మెజారిటీతో గెలవడం, టిడిపి కేంద్ర ప్రభుత్వంలో కీలక భాగస్వామి కావడంతో తాజాగా మనసు మార్చుకున్నారు.
* త్రుటిలో తప్పిన ఛాన్స్
వాస్తవానికి జయదేవ్ ఈసారి గుంటూరు ఎంపీగా పోటీ చేసి గెలిచి ఉంటే కేంద్రమంత్రి అయ్యేవారు. కానీ రాజకీయాలకు గుడ్ బై చెప్పడంతో ఆయన స్థానంలో పారిశ్రామికవేత్త పెమ్మసాని చంద్రశేఖర్ భర్తీ అయ్యారు. గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. ఏకంగా కేంద్ర మంత్రి అయ్యారు. అయితే ఇప్పుడు తొందరపాటు నిర్ణయం తీసుకున్నానని జయదేవ్ బాధపడుతున్నారు. పెద్దల సభకు వెళ్లడం ద్వారా ఆ తప్పిదాన్ని సరి చేసుకోవాలని చూస్తున్నారు. అదే సమయంలో చంద్రబాబు, లోకేష్ లకు జయదేవ్ పై మంచి అభిప్రాయం ఉంది. ఆయన సేవలను రాజ్యసభలో వినియోగించుకోవాలని డిసైడ్ అయినట్లు సమాచారం. మొత్తానికైతే జయదేవ్ త్వరలో పెద్దల సభకు ప్రాతినిధ్యం వహించనున్నారు అన్నమాట.