Chandrababu: నామినేటెడ్ పోస్టుల విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 90 రోజులు అవుతోంది. పాలనగాడిన పడుతున్న తరుణంలో విజయవాడలో వరదలు బీభత్సం సృష్టించాయి. ప్రభుత్వ కీలక నిర్ణయాలపై ప్రభావం చూపుతున్నాయి.

Written By: Dharma, Updated On : September 11, 2024 9:37 am

Chandrababu

Follow us on

Chandrababu: ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అదిగో ఇదిగో అంటూ కాలయాపనే తప్ప.. పదవుల భర్తీ మాత్రం జరగడం లేదు. రకరకాల కారణాలు చూస్తూ వాయిదా వేస్తూ వస్తున్నారు. దీంతో మూడు పార్టీల శ్రేణుల్లో ఒక రకమైన నిరాశ కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు అవుతోంది. పెద్దలకు పదవులు వచ్చాయి కానీ.. ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం ఆశగా ఎదురుచూస్తున్నారు. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు. కొందరైతే కేసులను సైతం ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో తమ కష్టాలు తీరాయని భావించారు. అటు టిడిపి హై కమాండ్ సైతం ఐవిఆర్ఎస్ సర్వే ద్వారా పేర్లు సేకరించడంతో అందరిలోనూ ఆశలు చిగురించాయి. వివిధ సమీకరణల నేపథ్యంలో చాలామంది సీనియర్లు టికెట్లను త్యాగం చేశారు. అటువంటి వారికి ఆర్టీసీ చైర్మన్ వంటి పదవులు ఇస్తారని భావించారు. ఆ జాబితా కూడా సోషల్ మీడియాలో సర్కులేట్ అయ్యింది. అయితే ఇంతలో శ్రావణమాసం ప్రకటిస్తామంటూ లీకులు వదిలారు. కానీ ఇంతలో వరదలు వచ్చాయి. విజయవాడ మునిగిపోయింది. దీంతో మరోసారి నామినేటెడ్ పదవుల ఇష్యూ ఆగిపోయింది.

* అప్పట్లో కూడా అంతే
2014లో టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇదే జరిగింది. నామినేటెడ్ పదవుల భర్తీలో ఎడతెగని జాప్యం జరిగింది. అప్పుడే రాష్ట్ర విభజన జరిగింది. నవ్యాంధ్రప్రదేశ్ ఆర్థికంగా ఇబ్బందులు పడింది. ఆ సమయంలో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు వస్తాయని చంద్రబాబు సర్కార్ భావించింది. అందుకే అప్పట్లో నామినేటెడ్ పోస్టుల విషయంలో వెనక్కి తగ్గింది.దీంతో ద్వితీయ స్థాయి నేతలు స్థానిక సంస్థల పదవులతోనే సరిపెట్టుకున్నారు. పార్టీలో అసంతృప్తికి అదొక కారణంగా మారింది.

* వైసిపి హయాంలో జీతభత్యాలతో
అయితే 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ మాత్రం పెద్ద ఎత్తున నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది. పైగా వారికి భారీగా జీతభత్యాలను చెల్లించింది. గత ఐదేళ్లుగా ఏ పని లేకున్నా చాలామంది నామినేటెడ్ పదవుల ద్వారా ప్రభుత్వ వేతనాలను తీసుకున్నారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఉంటుందని మూడు పార్టీల నేతలు కోరుకున్నారు. కానీ ఈ విషయంలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దుబారా ఖర్చులు తగ్గించే పనిలో ఉంది ప్రభుత్వం. ఇటువంటి సమయంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే ఇప్పట్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం లేనట్లు తెలుస్తోంది.

* జాప్యం చేయాలని నిర్ణయం
మరి కొన్ని రోజులపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీని జాప్యం చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ పోస్టుల విషయంలో పవన్ సైతం పెద్దగా పట్టుబడుతున్నట్లు లేదని సమాచారం. ఒకటి రెండు పోస్టులు వచ్చే నామినేటెడ్ పదవుల కోసం బిజెపి నేతలు సైతం పట్టించుకోవడం లేదు. దీంతో కొద్దిరోజుల తర్వాత ఈ పోస్టులను భర్తీ చేస్తే ఆర్థికంగా కొన్ని రకాల ఇబ్బందులను అధిగమించి అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజా పరిణామాల నడుమ నామినేటెడ్ పదవుల ప్రకటన ఇప్పట్లో లేదని తెలియడంతో ఆశావహుల్లో నిరాశ అలుముకుంది.