RTC Free Bus : మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ముహూర్తం ఫిక్స్.. అప్పటి నుంచే అమలు.. వారికే ఛాన్స్!

ఏపీలో మరో నూతన పథకానికి ముహూర్తం ఫిక్స్ చేయనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి ఈరోజు చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నారు. అంతకుముందు అధికారుల నుంచి ప్రతిపాదనలు తీసుకొనున్నారు. అందుకు అనుగుణంగానే ముందుకు అడుగులు వేయనున్నారు.

Written By: Dharma, Updated On : July 29, 2024 2:35 pm
Follow us on

RTC Free Bus : ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. గత ప్రభుత్వ వైఫల్యాలను శ్వేత పత్రాల రూపంలో వెల్లడిస్తూనే.. ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాలపై దృష్టి పెట్టింది. అందులో కీలకమైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పై కూడా ఫోకస్ చేసింది. వీలైనంత త్వరగా ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తోంది. ఈ పథకం అమలు, ఆర్థిక భారం వంటి అంశాలపై అధికారులు నివేదిక సిద్ధం చేశారు. ఈరోజు చంద్రబాబు నిర్వహించే సమీక్షలో పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ ఇచ్చింది. దీంతో మహిళలు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. అక్కడ కాంగ్రెస్ గెలుపునకు ఈ హామీ ఎంతగానో దోహద పడింది. తెలంగాణలో సైతం ఇదే హామీ వర్కౌట్ అయ్యింది. దీంతో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా మహిళల ఉచిత ప్రయాణం హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు అమలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ పథకం అమలులో కొన్ని కండీషన్లు పెట్టాలని అధికారులు సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటక తో పాటు తెలంగాణలో అమలు చేస్తుండడంతో అక్కడ పరిస్థితులపై ఏపీ అధికారులు అధ్యయనం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో 15 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వాటిలో మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పిస్తే.. ప్రతి నెల ఆర్టీసీ పై 250 కోట్ల రూపాయల భారం పడుతుందని అధికారులు లెక్కలు వేశారు. ఈ పథకం అమలు చేయాలంటే కొత్త బస్సులు కూడా అవసరమని గుర్తించారు. అయితే కేవలం పల్లె వెలుగులకే పరిమితం చేస్తారా? లేకుంటే అన్ని రకాల బస్సులకు వర్తింపజేస్తారా? అన్నది తెలియడం లేదు. అయితే ఎన్నికల్లో హామీ ఇచ్చినందున అమలు చేయాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.

* ఆ రెండు రాష్ట్రాల్లో అలా..
తెలంగాణలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ ల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించారు. అలాగే హైదరాబాదులోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ లో ఉచిత ప్రయాణం కొనసాగుతోంది. కర్ణాటకలో గ్రామీణ బస్సు సర్వీసులు, బెంగళూరు సిటీ సర్వీసులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంది. అయితే మన రాష్ట్రంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఇప్పటికే అధికారులు ఒక నివేదిక తయారు చేశారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ లతో పాటు విశాఖ, విజయవాడ సిటీ, మెట్రో బస్సుల్లో మహిళలకు ఫ్రీ జర్నీ అవకాశం కల్పించాలని నిర్ణయించినట్లు సమాచారం.

* ఇక్కడ కూడా జీరో టికెట్ విధానం
ఉచిత ప్రయాణం పథకంలో భాగంగా కర్ణాటక, తెలంగాణలో జీరో టిక్కెట్ జారీ అవుతోంది. టికెట్ పై చార్జి సున్నా అని ఉన్న యంత్రంలో మాత్రమే ఈ ధర నమోదవుతుంది. ఈ జీరో టిక్కెట్లు మొత్తం విలువను ఆర్టీసీ అధికారులు లెక్క కట్టి రియంబర్స్మెంట్ కోసం ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. ఆ రెండు రాష్ట్రాల్లో పథకం అమలు చేసిన తర్వాత బస్సుల్లో ఆక్యుపెన్సి శాతం 65 నుంచి 95 శాతానికి పెరిగిందని గుర్తించారు. అందుకే వీలైనంత త్వరగా ఏపీలో సైతం ఉచిత ప్రయాణం ప్రారంభించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.

* ఆగస్టు 15 నుంచి?
ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణం పథకం ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈరోజు చంద్రబాబు అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష చేయనున్నారు. ఈ సందర్భంగా అధికారులతో కీలక చర్చలు జరపనున్నారు. సమావేశం అనంతరం ఈ పథకం అమలుపై చంద్రబాబు కీలక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏ బస్సులకు ఈ ప్రయాణాన్ని పరిమితం చేస్తారో? తెలియడం లేదు.