Guntur Collectorate: సాధారణంగా గ్రీవెన్స్( grievance ) విభాగానికి చాలామంది సమస్యలు చెప్పుకోవడానికి వస్తుంటారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించి గ్రీవెన్స్ లో అర్జీ పెట్టుకుంటారు. కానీ ఓ 8 ఏళ్ల బాలుడు స్కూల్ బ్యాగ్ తో కలెక్టరేట్ గ్రీవెన్స్ విభాగానికి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తన కుటుంబం పడుతున్న బాధను జిల్లా కలెక్టర్ తో విన్నవించాడు. మీరు చదువుతోంది నిజమే. గుంటూరు కలెక్టరేట్లో వెలుగు చూసింది ఈ ఘటన. ‘ అమ్మ చనిపోదాం అంటుంది.. సహాయం చేయండి’ అంటూ ఆ బాలుడు అడిగేసరికి గుంటూరు జిల్లా కలెక్టర్ తో పాటు అక్కడున్న అధికారులు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఈ ఘటన మారింది.
Also Read: ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ కు ముందున్నవన్నీ గడ్డు రోజులేనా?
* సడన్ గా ఓ బాలుడు
ప్రతి సోమవారం కలెక్టరేట్లలో గ్రీవెన్స్ సెల్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గుంటూరు కలెక్టరేట్లో( Guntur collectorate) ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించారు. చాలామంది తమ సమస్యలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు వచ్చారు. వారందరినీ దాటుకుంటూ స్కూల్ బ్యాగ్ వేసుకొని యశ్వంత్ అనే బాలుడు కలెక్టర్ వద్దకు వచ్చాడు. తన తల్లి బాధ గురించి విన్నవించాడు. ఆ బాలుడి నోట అమ్మ చనిపోదాం అంటోంది అంటూ పలికిన ఆ మాటలు అందరితో కంటతడి పెట్టించాయి. గుంటూరులోని వెంకట్రావుపేటకు చెందిన అలవాల రాధిక భర్త చనిపోవడంతో.. కుమారుడు యశ్వంత్ తో కలిసి నివాసం ఉంటుంది. స్థానిక ప్రభుత్వాసుపత్రి గేటు వద్ద టిఫిన్ బండి నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. కుమారుడు యశ్వంత్ ను చదివించుకుంటూ జీవనం సాగిస్తోంది.
* స్పందించిన కలెక్టర్..
అయితే రోడ్డు విస్తరణ పనుల పుణ్యమా అని ఆ కుటుంబం వీధిన పడింది. ఆమె బండిని అధికారులు తొలగించారు. అంతటితో ఆగకుండా కాలువలో పడేశారు. అయితే ఉన్నపలంగా ఉపాధికి దూరం కావడంతో అధికారులకు పెద్ద ఎత్తున వినతి పత్రాలు అందించారు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఒంటరిగా జీవిస్తున్న రాధిక బతుకు మరింత భారంగా మారింది. పసి హృదయం తల్లడిల్లిపోయింది. వెంటనే ఆ బాలుడు కలెక్టరేట్ కు వచ్చి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని( collector nagalakshmi ) ఆశ్రయించాడు. చేతిలో ఫిర్యాదు పత్రంతో నిలబడిన ఆ బాలుడ్ని దగ్గరకు పిలిచారు జిల్లా కలెక్టర్. యశ్వంత్ విన్నపాన్ని శ్రద్ధగా విన్నారు. వెంటనే గుంటూరు కార్పొరేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు కలెక్టర్. ఆ కుటుంబానికి తక్షణమే జీవనోపాధి కల్పించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యశ్వంత్ పల్లి తిరిగి టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని సూచించారు. అయితే ఎనిమిదేళ్ల ఆ బాలుడు గ్రీవెన్స్ కు వచ్చి వినతి పత్రం ఇవ్వాలన్న ఆలోచనను ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు.