Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Movement: అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు.. సాధించింది ఏంటి?

Amaravati Movement: అమరావతి ఉద్యమానికి నాలుగేళ్లు.. సాధించింది ఏంటి?

Amaravati Movement: అమరావతి.. అజరామరంగా, ఆచంద్రార్కంగా నిలవాల్సిన ప్రాంతం. అద్భుతాలకు, అవకాశాలకు అలవాలంగా ఉండాల్సిన ప్రాంతం. కానీ మూడు రాజధానుల నిర్ణయంతో మరణ శాసనంగా మారింది. గత నాలుగున్నర సంవత్సరాలుగా అచేతనంగా మిగిలింది. ఒక ఉద్యమ పదంగా మారింది. ఒక మహా ఉద్యమం గా రూపుదిద్దుకుంది. అడుగడుగునా అవమానాలు, దాడులు, దౌర్జన్యాలు, లాటి చార్జీలు, కేసులు, అరెస్టులకు వెరవకుండా శాంతియుతంగా, మొక్కవోని దీక్షతో ఉద్యమం సాగుతోంది.ఈ ఉద్యమానికి నేటితో నాలుగేళ్లు పూర్తవుతోంది.

అది 2014, సెప్టెంబర్ 4. శాసనసభ వేదికగా నాటి సీఎం చంద్రబాబు తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 217 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని రాజధానిగా ప్రకటించారు. అప్పటి విపక్ష నేత జగన్ సహా అన్ని రాజకీయ పార్టీలు ముక్తకంఠంతో స్వాగతించాయి. తాను ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని జగన్ చెప్పుకొచ్చారు. అందుకు తగ్గట్టుగానే తాడేపల్లిలో ప్యాలెస్ కట్టి మరి అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించారు. కానీ 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ అదే ఏడాది డిసెంబర్లో మూడు రాజధానుల ప్రకటన చేశారు. తాను ఆడిన మాటను తప్పారు. అమరావతిపై కర్కశం ప్రదర్శించారు.

అయితే అమరావతి రైతులు పోరాటానికి దిగారు. అమరావతి పరిరక్షణ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఉద్యమానికి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. గత నాలుగేళ్లుగా సుమారు 3000 మంది రైతులు, మహిళలు, ఎస్సీలు, మైనార్టీలపై వైసీపీ సర్కార్ 500 కు పైగా అక్రమ కేసులు పెట్టింది. కొందరిపై అయితే 25 నుంచి 30 వరకు కేసులు కూడా ఉన్నాయి. అష్టదిగ్బంధం చేయడం, దాడులకు దిగడం, ఇనుప కంచెలు కట్టడం ఆటవిక పాలనను తలపిస్తోంది. కాలు కదిపిన కేసు, రాజధాని గ్రామాల్లో చీమ చిటుక్కుమంటే కేసే. మొదట నాలుగైదు పేర్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. తరువాత ఇతరులు అని పెట్టి మిగతా వారిని జత కలుపుతారు. చివరికి ఎస్సీ రైతులు పైనే ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయిస్తారు. నెలలో సగం రోజులు కోట్లు చుట్టూ తిప్పిస్తారు. అయినా సరే రాజధాని రైతులు విసగలేదు. తమలో ఉన్న ధైర్యాన్ని పోగుచేసుకుని పోరాడుతున్నారు. చట్టపరంగా పోరాటం చేస్తూనే.. ప్రత్యక్ష ఉద్యమాన్ని సైతం నడుపుతున్నారు. చట్టం, న్యాయం తమకు న్యాయమే చేస్తాయని నమ్మకంగా ఉన్నారు. తమను వంచించిన జగన్ సర్కార్ దిగిపోవడం ఖాయమని బలంగా నమ్ముతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version