Tirumala Laddu Controversy : టీటీడీ లడ్డు వివాదం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. లక్షలాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. తిరుమల పవిత్రతను ప్రశ్నార్ధకం చేసింది. అన్ని రంగాల ప్రముఖులు వచ్చి దీనిపై మాట్లాడుతున్నారు. జరిగిన ఘటనను ఖండిస్తున్నారు. వైసిపి ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగిందని టిడిపి ఆరోపించడం సంచలనం గా మారింది. దీనిపై వైసీపీ సైతం కౌంటర్ అటాక్ చేస్తోంది. ఇప్పటికే టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి స్పందించారు. ఇలా జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. జగన్ సైతం మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. అయితే ఈ ఎపిసోడ్లో కీలక వ్యక్తిగా ఉన్న టీటీడీ మాజీ ఇంచార్జ్ఈఓ ధర్మారెడ్డి మాత్రం ఇంతవరకు నోరు మెదపలేదు. ధర్మారెడ్డి సుదీర్ఘకాలం టీటీడీ ఈవో గా పని చేశారు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటించేవారని ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. అయితే ఆయన తీరుతోనే తిరుమల కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయని సొంత పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. అయితే దాదాపు వైసీపీ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా ఈ వివాదం రాజకీయ రంగు పులుముకుంది. కానీ దీనిపై వివరణ ఇవ్వాల్సిన ధర్మారెడ్డి మాత్రం హైదరాబాదులో సేద తీరుతున్నారు. గత ఐదేళ్లలో తిరుమలలో ధర్మారెడ్డి హవా నడిచింది. ఇప్పుడు వైసీపీ కష్టాల్లో ఉంటే ఆయన స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.
* టీటీడీపై కూటమి ఫోకస్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టిటిడి పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. విజిలెన్స్ తో ప్రత్యేకంగా విచారణ కూడా జరిపించింది. విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చింది. చాలా రకాలుగా అవినీతి జరిగినట్లు నివేదికలో పేర్కొంది.అయితే విజిలెన్స్ విచారణ నిలిపివేయాలని కోరుతూ.. టిటిడి మాజీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ఏకంగా కోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది. ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తుందని తెలిసి ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు ప్రచారం జరుగుతోంది.
* జగన్ ఛాన్స్ ఇచ్చారు
ధర్మారెడ్డి విషయంలో జగన్ ఎంతో సాహసం ప్రదర్శించారు. ఎక్కడో కేంద్ర సర్వీసులో ఉన్న ధర్మారెడ్డిని తీసుకువచ్చి టీటీడీ బాధ్యతలను అప్పగించారు. అక్కడ పాలకమండలి చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ఉన్నా.. కరుణాకర్ రెడ్డి ఉన్నా.. జగన్ మాత్రం ధర్మారెడ్డికి ఎక్కువ విలువ ఇచ్చేవారు. ఆయన నిర్ణయాలకు జై కొట్టేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంతో నమ్మకం ఆయనపై ఉండేది. అటు విపక్షాల నుంచి అభ్యంతరాలు వచ్చినా.. మీడియాలో వ్యతిరేక కథనాలు వచ్చినా జగన్ ఎన్నడూ ధర్మారెడ్డి విషయంలో గాబర పడలేదు. ఆయన మాటకు విలువ ఇచ్చారు. అటువంటిది వైసిపి కష్టాల్లో ఉంటే ధర్మారెడ్డి ముందుకు వచ్చి మాట్లాడకపోవడం వైసీపీ శ్రేణుల్లో కూడా ఆగ్రహానికి కారణమవుతోంది.
* ఐవిఆర్ ఖండించారు
గతంలో టీటీడీ ఈవోగా పనిచేశారు ఐ వి ఆర్ కృష్ణారావు. ప్రస్తుతం ఆయన బిజెపి నేతగా ఉన్నారు. టిడిపికి బిజెపి మిత్రపక్షం. సీఎం చంద్రబాబు లడ్డూలపై చేసిన ప్రకటనను.. నమ్మలేదంటూ ఐవిఆర్ ప్రకటించారు. ఒక బీజేపీ నేతగా ఐవిఆర్ స్పందించారు కానీ.. జగన్ ఇన్ని రకాల అవకాశాలు ఇచ్చిన ధర్మారెడ్డి మాత్రం నోరు తెరవకపోవడం ఏమిటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆయనకు అరెస్టు భయం పట్టుకుందని వైసీపీ అంచనా వేసింది. అయితే మొత్తానికి అయితే జగన్ ఏ అధికారినైతే బలంగా నమ్మారో.. అదే అధికారి మాత్రం ఇప్పుడు వైసీపీకి అండగా నిలవకపోవడం ఆ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆవేదన కనిపిస్తోంది.