Janasena MLA Pantham Naanaaji : వివాదాలకు దూరంగా ఉండాలని కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించిన సంగతి తెలిసిందే. అయితే ఏదో ఒకచోట ఎమ్మెల్యేలు వివాదాస్పదం అవుతున్నారు. మొన్న ఆ మధ్యన టిడిపి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల కేసుల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు జనసేన యాక్టివిస్టు జానీ మాస్టర్ సైతం అదే తరహా ఆరోపణలతో అరెస్టయ్యారు. ఇప్పుడు తాజాగా జనసేనకు చెందిన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ వివాదాస్పదం అయ్యారు. కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజ్ స్పోర్ట్స్ వైస్ చైర్మన్ డాక్టర్ ఉమామహేశ్వరరావుఫై ఎమ్మెల్యే పంతం నానాజీ తీవ్రస్థాయిలో దుర్భాషలు ఆడడం వివాదానికి కారణమవుతున్నాయి. కాలేజీ గ్రౌండ్ లో వాలీబాల్ ఆడేందుకు యువకులకు పర్మిషన్ ఇవ్వకపోవడంతోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బెట్టింగులు జరుగుతున్నాయని.. ఉన్నతాధికారుల పర్మిషన్ తర్వాత నిర్ణయం తీసుకుంటామని కాలేజీ సిబ్బంది వెల్లడించారు. అయినా వినకుండా సదరు యువకులు వాలీబాల్ ఆడేందుకు ప్రయత్నం చేశారు. దీంతో వారిని కాలేజీ సిబ్బంది అడ్డుకున్నారు. ఆ యువకులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ కి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. వస్తూ వస్తూనే స్పోర్ట్స్ వైస్ చైర్మన్ ఉమామహేశ్వరరావు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిట్ల దండకంతో దుర్భాషలు ఆడారు. ప్రస్తుతం ఎమ్మెల్యే పంతం నానాజీ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
* వివాదాలు వద్దని సూచన
ఏపీ ప్రజలు ఎంతో నమ్మకంతో అధికారాన్ని అప్పగించిన విషయాన్ని ఎమ్మెల్యేలు గుర్తుంచుకోవాలని చంద్రబాబు పలుమార్లు సూచించారు. పవన్ కళ్యాణ్ సైతం తాను తప్పు చేసినా కఠినంగా శిక్షించాలని కోరారు. పార్టీ ఎమ్మెల్యేలు లైన్ దాటి ప్రవర్తించవద్దని కూడా పలుమార్లు సూచించారు. ఇటీవల ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో సైతం ఎమ్మెల్యేలకు హితబోధ చేశారు. ఏపీలో కూటమి మధ్య సమన్వయం ఉండాలని.. ఎమ్మెల్యేలు ఎంతో సంయమనంతో వ్యవహరించాలని.. వివాదాలకు దూరంగా ఉండాలని చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
* కుటుంబ సభ్యుల వింత ప్రవర్తన
కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే అనంతపురం జిల్లాకు చెందిన ఓ మంత్రి భార్య పోలీసులతోనే వాగ్వాదానికి దిగారు. అది మరువక ముందే చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువ ఎమ్మెల్యే మీడియాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇసుక విషయంలో తనకు వ్యతిరేకంగా కథనాలు వచ్చాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు కలుగచేసుకొని యువ ఎమ్మెల్యేకు క్లాస్ పీకినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇక గుంటూరు జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే భర్త ప్రవర్తన పై సైతం నేరుగా ఫిర్యాదులు వచ్చాయి.
* వైసీపీకి ప్రచారాస్త్రం
కూటమి పార్టీల ఎమ్మెల్యేలు తప్పు చేస్తే బయట పెట్టేందుకు వైసిపి సిద్ధంగా ఉంది. ఎక్కడ తప్పు చేస్తారా? ఎలా బుక్ చేస్తామా? అన్న రీతిలో ఆ పార్టీ ఉంది. ఇదే విషయంలో చంద్రబాబుతో పాటు పవన్ సైతం చాలాసార్లు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. అయినా సరే పెద్దగా మార్పు రావడం లేదు. కాకినాడలో జరిగిన చిన్నపాటి ఘటనకు ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రెస్టేజ్ ఇష్యూ తో మరింత పెద్దదిగా మారినట్లు సమాచారం. సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుండడంతో జనసేన హై కమాండ్ స్పందించే అవకాశం ఉంది. సదరు ఎమ్మెల్యే నుంచి వివరణ కోరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.