Kethireddy Peddaa Reddy : రాయలసీమ అంటే ముందుగా గుర్తుకొచ్చేది తాడిపత్రి. ఫ్యాక్షన్ రాజకీయాలకు అడ్డా. గత కొంతకాలంగా ప్రశాంతంగా ఉంటూ వచ్చింది. అయితే ఎన్నికల పోలింగ్ సమయంలో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. అటు తరువాత కూడా కొనసాగుతూ వచ్చింది. అయితే వైసిపి ఓడిపోవడంతో ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు రాయలసీమను విడిచిపెట్టినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మాత్రం వెనక్కి తగ్గలేదు. నియోజకవర్గంలో పర్యటించేందుకు చాలాసార్లు ప్రయత్నించారు. అయితే ఒకటి రెండు సార్లు హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దీంతో కేతిరెడ్డి పెద్దారెడ్డిని నియోజకవర్గం నుంచి బహిష్కరించింది పోలీస్ శాఖ. దీనిపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు పెద్దారెడ్డి. అదే సమయంలో జెసి ప్రభాకర్ రెడ్డి సైతం కీలక ప్రకటనలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత.. గతంలో తనకు జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. అనవసరంగా కేసులు పెట్టిన వైనాన్ని గుర్తు చేశారు. దీనిపై తనకు న్యాయం చేయాలని ఏకంగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి.. భారీ కాన్వాయ్ తో వెళ్లారు. అక్కడకు కొద్ది రోజులకే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఓ పని మీద తాడిపత్రి వచ్చారు. ఆ క్రమంలో టిడిపి,వైసీపీ శ్రేణుల మధ్య ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. పోలీసులు కలుగ చేసుకున్నారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిని అక్కడ నుంచి పంపించేశారు. అటు తరువాత కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రిలో అడుగుపెట్టకుండా ఆంక్షలు విధించారు.
* ఐదేళ్లుగా ఉద్రిక్త పరిస్థితులు
గత ఐదేళ్ల వైసిపి పాలనలో తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి. 2019 ఎన్నికల్లో తాడిపత్రిలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జెసి కుటుంబం పై గెలిచారు. అప్పటినుంచి మరింత రచ్చ ప్రారంభం అయ్యింది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం జెసి కుటుంబం పట్టు నిలుపుకుంది. తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ గెలిచింది. ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయ్యారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి తో ఢీ అంటే ఢీ అన్నట్టు కొనసాగింది పరిస్థితి. దీంతో తాడిపత్రిలో తరచూ హింసాత్మక ఘటనలు జరిగేవి. పోలీస్ శాఖకు శాంతిభద్రతల పరిరక్షణ కత్తి మీద సాముగా మారింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పరిస్థితి మారింది. కేతిరెడ్డి పెద్దారెడ్డి నియోజకవర్గాన్ని విడిచి పెట్టాల్సి వచ్చింది.
* మూడుసార్లు హత్యా ప్రయత్నం
అయితే తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.మీడియా ముందుకు వచ్చిన ఆయన జెసి ప్రభాకర్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనతో పాటు కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు మూడుసార్లు తమపై హత్య చేసే ప్రయత్నం జరిగిందని కూడా చెప్పుకొచ్చారు. 2006లో తన సోదరుని దారుణంగా హత్య చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మరోసారి తనను అలానే చేయడానికి ప్రయత్నిస్తున్నారని పెద్దారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే దీనికిజిల్లా ఎస్పీ సహకరిస్తున్నారని సంచలన ఆరోపణలు చేయడం విశేషం. అయితే పెద్దారెడ్డి కామెంట్స్ తో పోలీస్ శాఖ అలర్ట్ అయ్యింది. ఎటువంటి విధ్వంసాలకు తావివ్వకుండా పటిష్ట చర్యలు చేపట్టింది. మొత్తానికైతే ఫ్యాక్షన్ రాజకీయాల తేనె తుట్టను మరోసారి కీర్తి రెడ్డి కదిపినట్లు అయ్యింది.రాయలసీమలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.