AP New liquer policy మద్యం దుకాణాల విషయంలో ప్రభుత్వ లక్ష్యం మేరకు దగ్గరగా దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ నెల ఒకటి నుంచి వాటికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష దరఖాస్తులు వస్తాయని అంచనా వేసింది. తద్వారా 2000 కోట్ల ఆదాయం సమకూర్చుకోవచ్చని భావించింది. అయితే ఈ నెల 9 గడువు సమీపిస్తున్నా దరఖాస్తులకు సంబంధించి అనుకున్నంత స్థాయిలో రాలేదు. దీంతో ప్రభుత్వంలో ఒక రకమైన ఆందోళన కనిపించింది. అయితే సొంత నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు దరఖాస్తులు రాకుండా చేశారన్న విమర్శలు వచ్చాయి. ఆ షాపులను తమకే విడిచి పెట్టాలని.. అలా కాకుండా షాపులకు టెండర్ వచ్చిన ఇబ్బందులు తప్పవని కొంతమంది ఎమ్మెల్యేలు వ్యాపారులను హెచ్చరించినట్లు ఆరోపణలు వచ్చాయి. అందుకే దరఖాస్తుల సంఖ్య తగ్గినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. దాదాపు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూటమి పార్టీల కీలక ప్రజాప్రతినిధులు సైతం ఈ వ్యవహారంలో తలదూర్చినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు స్పందించారు. మద్యం షాపుల కు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియలో.. ఎవరు తల దూర్చవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దరఖాస్తు గడువును రెండు రోజులపాటు పొడిగించారు. ఈనెల 11 అర్థరాత్రి వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. క్యూ లైన్ లో ఉన్న చివరి దరఖాస్తుదారుడు వరకు… అందరివి స్వీకరించారు. అటు చివరి నిమిషంలో ఆన్లైన్లో సైతం చాలామంది దరఖాస్తు చేయడం కనిపించింది.
* లక్ష్యానికి దగ్గరగా
రాష్ట్రవ్యాప్తంగా 3396 షాపులకు గాను.. 89,643 దరఖాస్తులు వచ్చాయి. నాన్ రెఫండబుల్ రుసుముల రూపంలో రూ. 1792 కోట్ల ఆదాయం సమకూరింది. అయితే ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ, ఆపై ఆన్లైన్లోనే రుసుముల చెల్లింపులకు సంబంధించి అర్ధరాత్రి 12 వరకు అవకాశం ఇచ్చారు.దీంతో చివరి నిమిషం వరకు దరఖాస్తులు వస్తూనే ఉన్నాయి.అయితే ఈసారిసాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఆడిటర్లు,వైద్యులు సైతం టెండర్లు అధిక సంఖ్యలో వేశారు. రాష్ట్రంలో సగటు ఒక్కో షాపునకు 26 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. చివరి నిమిషంలో అన్ని జిల్లాల్లో దరఖాస్తులు క్రమేపీ పెరిగాయి.
* లాటరీ ప్రక్రియకు ఏర్పాట్లు
దరఖాస్తుల స్వీకరణ పూర్తి కావడంతో.. లాటరీ ప్రక్రియకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 14న లాటరీ తీయనున్నారు.లాటరీలో షాపులు దక్కించుకున్న వారు 16న.. కొత్త షాపులు ప్రారంభించాల్సి ఉంటుంది.అయితే దరఖాస్తులు చేసుకున్న వారు ముందస్తుగా షాపులు మాట్లాడుకున్నారు. ఇలా ఖరారు అయిన మరుక్షణం రంగంలోకి దిగనున్నారు. అటు మద్యం సరఫరా సంస్థల నుంచి సైతం.. మద్యాన్ని వీలైనంతవరకు షాపులకు తొలి రోజే చేర్చాలని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుంది. కాగా షాపులు దక్కించుకున్న వారు నిర్దేశిత మొత్తాన్ని ఆరు వాయిదాలలో చెల్లించుకోవచ్చు. అయితే షాపులు ప్రారంభానికి ముందే తొలి వాయిదా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తానికి అయితే మద్యం షాపుల విషయంలో ప్రభుత్వం అనుకున్న లక్ష్యానికి దగ్గరగా చేరువ అయ్యింది. దాదాపు 1800 కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకుంది. 2017లో ఆదాయానికి నాలుగు రెట్లు అదనంగా ఇప్పుడు లభించింది.