Pithapuram Verma : పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ( Pithapuram Verma )తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? టిడిపి హై కమాండ్ గుర్తింపు ఆందోళనతో ఉన్నారా? నామినేటెడ్ పదవి కేటాయించలేదని బాధపడుతున్నారా? చంద్రబాబు ఇచ్చిన హామీని గుర్తుపెట్టుకోలేదని భావిస్తున్నారా? తన త్యాగానికి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? పవన్ కళ్యాణ్ విజయం కోసం కృషి చేస్తే తనకు కనీసం విలువ ఇవ్వడం లేదని భావిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈరోజు ఆయన సంచలన ట్వీట్ చేశారు. తన మనసులో ఉన్న బాధను బయటపెట్టారు. ప్రస్తుతం వర్మ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
* వర్మ త్యాగంతో
పిఠాపురం నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు పవన్ కళ్యాణ్( Pawan Kalyan). ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం కూడా అయ్యారు. అయితే ఆ సీటు త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మకు మాత్రం ఇంతవరకు న్యాయం జరగలేదు. 2019లో రెండు చోట్ల పోటీ చేశారు పవన్ కళ్యాణ్. రెండు చోట్ల ఓడిపోయారు. అయితే ఈ ఎన్నికల్లో చివరి నిమిషంలో పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. పొత్తులో భాగంగా ఆ సీటు తనకు కేటాయించాలని చంద్రబాబును కోరారు. అప్పటికే అక్కడ పోటీకి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు టిడిపి మాజీ ఎమ్మెల్యే వర్మ. 2014లో అదే మాదిరిగా టికెట్ దక్కకపోవడంతో ఏకంగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు వర్మ. అటువంటి వర్మ మారు మాట చెప్పకుండా పవన్ కళ్యాణ్ కోసం తన సీటు త్యాగం చేశారు. తొలుత ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని అనుచరులు ఒత్తిడి చేశారు. కానీ చంద్రబాబు పిలిచి మాట్లాడారు. తగిన ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. దీంతో వర్మ మెత్తబడ్డారు.
* అంకితభావంతో కృషి
ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం అంకితభావంతో పనిచేశారు. అటు పవన్ సైతం వర్మకు( Varma) ఎంతగానో ప్రాధాన్యమిచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ప్రాధాన్యంగా వర్మకు సరైన గౌరవం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతోంది. నామినేటెడ్ పోస్టులతో పాటు ఎమ్మెల్సీల భర్తీ కూడా జరిగింది. రాజ్యసభ పదవులను సైతం ప్రకటించారు. కానీ ఎక్కడా వర్మకు ప్రాధాన్యం తగ్గలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపనే తప్ప వర్మకు ఎటువంటి పదవి కేటాయించలేదు. అటు పిఠాపురంలో జనసేన క్యాడర్ సైతం వర్మను పరిగణలోకి తీసుకోవడం లేదు. దీంతో ఒక రకమైన మనస్తాపంతో గడుపుతున్నారు వర్మ.
* తన ప్రచారం వీడియోలతో
అయితే ఈరోజు వర్మ సంచలన ట్వీట్( tweet) చేశారు. కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ వర్మ తన ఎక్స్ హేండిల్ లో పోస్ట్ పెట్టారు. ఇందులో ఓ వీడియోను కూడా జత చేశారు. పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం వీడియోలు అన్ని కలిపి పెట్టారు. అయితే ఇందులో ఎక్కడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు. కేవలం పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం మాత్రమే ఉంది. దీంతోపాటు ఆయన పెట్టిన ట్యాగ్ లైన్ కూడా చూస్తే పవన్ కష్టపడి విజయం సాధించలేదని.. తానే కష్టపడి పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని అర్థం వచ్చేలా ఈ వీడియో, పోస్ట్ కూడా ఉన్నాయి. దీంతో సోషల్ మీడియాలో ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.
కష్టపడి సాధించిన విజయమే నిజమైన గౌరవం! pic.twitter.com/v8vA1u9HQ4
— SVSN Varma (@SVSN_Varma) February 20, 2025