Jogi Ramesh: వైసీపీని వీడేందుకు మరో మాజీ మంత్రి సిద్ధంగా ఉన్నారా?ఈ మేరకు సంకేతాలు ఇచ్చినట్లేనా?గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న ఆయన టిడిపి నేతలతో ఎందుకు కలిసినట్టు? కార్యక్రమాల్లో ఎందుకు పాలుపంచుకున్నట్లు? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో వైసిపి దారుణంగా ఓడిపోయింది.కనీసం ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు గుడ్ బై చెబుతున్నారు. మరికొందరు కేసుల భయంతో పార్టీని వీడుతున్నారు.రాజ్యసభ, ఎమ్మెల్సీ వంటి పదవులు వదులుకున్న వారు ఉన్నారు. అధినేత జగన్ కు వీర విధేయత చూపే నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేస్తున్నారు. వైసిపి అధికారంలో ఉన్నప్పుడు ప్రాధాన్యత దక్కించుకున్న వారు సైతం పక్క చూపులు చూస్తున్నారు.
* వారి జాబితాలో రమేష్
ఇప్పటికే మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి, ఆళ్ల నాని వంటి నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. క్యాబినెట్ హోదాతో సమానమైన మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా వ్యవహరించిన వాసిరెడ్డి పద్మ సైతం పార్టీకి రాజీనామా ప్రకటించారు.ఇప్పుడు అదే బాటలో మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నట్లు తెలుస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జోగి రమేష్ తో పాటు ఆయన కుమారుడు పై వరుసుగా కేసులు నమోదు అవుతున్నాయి. అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి జోగి రమేష్ కుమారుడితోపాటు కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యాయి.అరెస్టులు కూడా జరిగాయి. దీనిపై ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు జోగి రమేష్. మరికొన్ని పాత కేసులు తెరపైకి రావడంతో జోగి రమేష్ భయపడుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో ఉండి కష్టాలు పడే కంటే.. టిడిపిలో చేరడం ఉత్తమమని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. కానీ టిడిపి హై కమాండ్ నుంచి ఇంతవరకు పెద్దగా స్పష్టత రాలేదు.
* టిడిపి నేతలతో కలిసి
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దూకుడుగా వ్యవహరించారు జోగి రమేష్. చంద్రబాబుతో పాటు పవన్ లపై విరుచుకుపడేవారు. ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోవడంతో ఇబ్బందుల్లో పడ్డారు. అందుకే టిడిపిలో చేరడానికి సిద్ధపడ్డారు. కానీ టిడిపి నుంచి అంత సానుకూలత రావడం లేదు. అయితే ఈరోజు నూజివీడు లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు రమేష్. మంత్రి కొలుసు పార్థసారథి గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జోగి రమేష్ అక్కడ ప్రత్యక్షమయ్యారు. టిడిపి ఎమ్మెల్యేలు, మంత్రులతో చనువుగా మెలిగారు. దీంతో జోగి రమేష్ టిడిపిలో చేరిక ఖాయమైనట్లు ప్రచారం నడుస్తోంది. దీనికి సంబంధించి ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది. చంద్రబాబు సమక్షంలో జోగి రమేష్ టిడిపిలో చేరే ఛాన్స్ కనిపిస్తోంది.