https://oktelugu.com/

Balineni Srinivas Reddy : అది చీకటి ఒప్పందమే.. సంతకం పెట్టలే.. బాలినేని సంచలన కామెంట్స్

విద్యుత్ ఒప్పందాలలో జగన్ సర్కార్ భారీగా ముడుపులు తీసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదానీ విషయంలో అమెరికాలోని అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎన్నో అభియోగాలు మోపింది. అందులో వైసిపి హయాంలో జరిగిన ఒప్పందాలను ప్రస్తావించింది. ఈ తరుణంలో నాటి మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Written By:
  • Dharma
  • , Updated On : November 23, 2024 / 11:10 AM IST

    Balineni Srinivas Reddy

    Follow us on

    Balineni Srinivas Reddy : దేశవ్యాప్తంగా అదానీ అవినీతి వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. ఏపీలో సోలార్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి 1750 కోట్ల రూపాయల ముడుపులను నాటి పాలకులకు ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అమెరికాలో అత్యున్నత దర్యాప్తు సంస్థ అక్కడి కోర్టుకు ఇదే విషయాన్ని తెలియజేసిందని బయటపడడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయంలో అప్పటి వైసీపీ సర్కార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయితే నాడు ఇంధన శాఖ మంత్రిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉండేవారు. సంబంధిత మంత్రి కావడంతో ఆయన సంతకం లేనిదే దస్త్రం ముందుకు కదలని పరిస్థితి. అయితే తాను ఎటువంటి సంతకాలు చేయలేదని.. తనతో బలవంతంగా సంతకం చేయించే ప్రయత్నం చేశారని తాజాగా వెల్లడించారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. అప్పట్లో సెకితో జరిగిన ఒప్పందాల విషయంలో తన ప్రమేయం ఏమీ లేదని చెప్పుకొచ్చారు. ఇంధన శాఖ కార్యదర్శి ఒకరు అర్ధరాత్రి ఫోన్ చేసి ఫైల్ పై సంతకం చేయమని కోరారని.. నాడే అనుమానంతో తాను సంతకం చేయలేదని.. అందుకే క్యాబినెట్లో పెట్టి ఆమోదించుకున్నారని నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు బాలినేని. నాడు సంతకం చేసి ఉంటే నా పరిస్థితి ఏంటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో వైసిపి హయాంలో అదానీతో జరిగిన ఒప్పందంలో అవినీతి జరిగిందని అర్థం వచ్చేలా మాట్లాడారు బాలినేని.

    * కీలకమైన ఇంధన శాఖ మంత్రిగా
    2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. జగన్ తన క్యాబినెట్ లోకి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని తీసుకున్నారు. కీలకమైన ఇంధన శాఖను అప్పగించారు. 2021లో సెకితో ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందానికి సంబంధించి ఆదానీ కంపెనీ నుంచి వైసీపీ సర్కార్కు భారీగా ముడుపులు అందాయన్నదే తాజా ఆరోపణ. అగ్రరాజ్యం అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇదే విషయం స్పష్టం చేసింది. దీంతో ఇది వైరల్ అంశంగా మారింది. జగన్ వైపు అందరి వేళ్ళు చూపేలా చేసింది. ఇప్పుడు ఆయన క్యాబినెట్లో, అదే శాఖకు ప్రాతినిధ్యం వహించిన నేత అనుమానాలు వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

    * ప్రభుత్వ పెద్దల ప్రమేయంతోనే
    అయితే ఇప్పుడు ఏకంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ పెద్దల ప్రమేయాన్ని ప్రస్తావించడం విశేషం. నాటి నిర్ణయాలతో తనకు ఎటువంటి ప్రమేయం లేదని చెప్పుకొచ్చారు. అలాంటి ఒప్పందాల గురించి ప్రభుత్వ పెద్దలకే తెలుస్తుందని తేల్చి చెప్పారు.అయితే ఇప్పుడు జగన్ సర్కార్ చుట్టూ ఆరోపణలు రావడం, ఆయన మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి మరింత అనుమానాలు వచ్చేలా మాట్లాడడంతో.. మున్ముందు ఇది మరింత వివాదంగా మారే అవకాశం ఉంది. మరి ఇది ఎంతవరకు వెళ్తుందో చూడాలి.