Alla Nani joins TDP
Alla Nani : ఆళ్ల నాని( alla Nani ) టిడిపిలో ఎందుకు చేరారు? టిడిపి శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేసినా చంద్రబాబు ఎందుకు చేర్చుకున్నారు? తెర వెనుక జరిగింది ఏంటి? చంద్రబాబు ఎటువంటి హామీ ఇచ్చారు? టిడిపి ఎమ్మెల్యే కు ఏం చెప్పారు? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదో హాట్ టాపిక్. చంద్రబాబు సమక్షంలో నిన్న ఆళ్ల నాని టిడిపిలో చేరిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఆయన కొద్ది నెలల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. అప్పటినుంచి అదిగో ఇదిగో అంటూ ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ ఆయన తెలుగుదేశం పార్టీలో చేరలేకపోయారు. దీనికి లోకల్ క్యాడర్ అడ్డుకోవడమే ప్రధాన కారణం. వారందరినీ ఒప్పించి చంద్రబాబు ఆళ్ళ నానిని తెలుగుదేశం పార్టీలోకి రప్పించినట్లు ప్రచారం నడుస్తోంది.
* సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా
ఆళ్ల నాని ఏలూరు ( Eluru)నుంచి సుదీర్ఘకాలంగా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 2004లో ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2009లో సైతం రెండోసారి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయినా సరే ఆయనకు ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇచ్చారు జగన్. 2019లో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి స్వీకరించారు. డిప్యూటీ సీఎం అయ్యారు కూడా. అయితే ఆయన మంత్రిగా ఉన్నప్పుడే ఏలూరు నియోజకవర్గంలో బలవంతంగా టిడిపి నేతలతో వైసిపి కండువాలు వేయించారన్న ఆరోపణలు ఉన్నాయి. టిడిపి శ్రేణులకు హింసించారని కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దాని ప్రభావంతోనే ఎక్కువ మంది టీడీపీ శ్రేణులు ఆళ్ల నాని టిడిపిలోకి వచ్చేందుకు అభ్యంతరాలు తెలిపారు. అయితే సీఎం చంద్రబాబు సముదాయించడంతో వెనక్కి తగ్గారు. ఏలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య ఆళ్ల నాని రావడాన్ని స్వాగతించారు.
* రెండు రకాల అవకాశం
అయితే ఆళ్ల నాని( Alla Nani )నియోజకవర్గాల పునర్విభజనతో.. కొత్త నియోజకవర్గంలో ఏర్పడితే తనకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. లేకుంటే తన కుమారుడికి ఏలూరు ఎంపీ సీటు ఇవ్వాలన్నది ఆళ్ల నాని డిమాండ్. ఒకవేళ పునర్విభజన జరిగితే.. ఏలూరు రెండు నియోజకవర్గాలు అయితే.. ఒక నియోజకవర్గం తనకు కేటాయించాలన్నది ఆళ్ల నాని కోరిక. అలా కుదరకపోతే ఏలూరు ఎంపీ సీటు తనకు ఇస్తే పోటీ చేస్తానని ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. అయితే చంద్రబాబు నిర్దిష్టమైన హామీ ఇవ్వలేదు. కానీ ఏదో ఒక అవకాశం కల్పిస్తానని మాత్రం హామీ ఇచ్చినట్లు సమాచారం. ఆ హామీ మేరకు మాత్రమే ఆళ్ల నాని టిడిపిలో చేరినట్లు తెలుస్తోంది.
* మంచి పట్టున్న నేత
అయితే ఆళ్ల నాని ఏలూరు( Eluru) నియోజకవర్గంలో బలమైన నేత. సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించడంతో అక్కడ ఆయనకు బలమైన కేడర్ ఉంది. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యే రాధాకృష్ణయ్య ఆళ్ల నాని రాకను వ్యతిరేకించారు. అయితే చంద్రబాబు మాత్రం ఈ విషయంలో స్పష్టంగా చెప్పారు. ఇద్దరూ కలిసి పని చేసుకోవాలని.. జిల్లాస్థాయిలో ఆళ్ల నాని సేవలు వినియోగించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. అదే విషయాన్ని టిడిపి శ్రేణులకు చెప్పారు. ఎవరికి ఎటువంటి నష్టం జరగకుండా చూస్తానని హామీ ఇచ్చారు.